కేంద్రం రివర్స్‌.. జగన్‌ ప్రభుత్వ వైఫల్యమే!

ABN , First Publish Date - 2020-10-21T08:45:06+05:30 IST

పోలవరం ప్రాజెక్టు తుది అంచనా వ్యయంపై కేంద్రం ఆమోదముద్ర పొందడంలో జగన్‌ ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రప్రభుత్వం 2019లో సవరించిన రూ.55,548.87 కోట్ల తుది అంచనా వ్యయాన్ని

కేంద్రం రివర్స్‌.. జగన్‌ ప్రభుత్వ వైఫల్యమే!

పోలవరం అంచనాల్లో భారీ కోతపై నిపుణుల్లో ఆందోళన

55,548 కోట్లలో 29 వేల కోట్లకే కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం?

2013-14 ధరల ప్రకారమేనంటూ మెలిక

తుది అంచనాలపై ఒత్తిడి పెంచరేం?

రాష్ట్ర సర్కారుపై నిపుణుల కన్నెర్ర


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పోలవరం ప్రాజెక్టు తుది అంచనా వ్యయంపై కేంద్రం ఆమోదముద్ర పొందడంలో జగన్‌ ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రప్రభుత్వం 2019లో సవరించిన రూ.55,548.87 కోట్ల తుది అంచనా వ్యయాన్ని కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) పూర్తిస్థాయిలో పరిశీలించి ఆమోదించినా.. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ ఇంతవరకు ఖరారు చేయకపోగా.. దానిని భారీగా కుదించేందుకు సిద్ధమవుతోంది. 2013-14 ధరవరల మేరకు అంచనా వ్యయం రూ.29,027.95 కోట్లకే పరిమితం చేస్తామని మెలిక పెడుతోంది. అంటే దరిదాపుగా సగం.. అంటే  రూ.26,520 కోట్ల వరకు కోత పెడతామంటోంది. గత నెలలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, జలవనరుల మంత్రి అనిల్‌కుమార్‌, వైసీపీపీ నేత విజయసాయిరెడ్డి..  కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, గజేంద్రసింగ్‌ షెకావత్‌లను వేర్వేరుగా కలిశారు. ప్రధాని మోదీతోనూ సమావేశమయ్యారు.


తుది అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు సమ్మతి తెలపాలని అభ్యర్థించామని.. వారు సానుకూలంగా స్పందించారని.. ఒకట్రెండు రోజుల్లో ప్రాజెక్టు కోసం రాష్ట్రప్రభుత్వం వ్యయం చేసిన రూ.2,300 కోట్లను కేంద్రం రీయింబర్స్‌ చేస్తుందని మంత్రులు మీడియాకు వెల్లడించారు.  రీయింబర్స్‌ నిధుల మాట దేవుడెరుగు.. అసలుకే ఎసరు తెచ్చేలా.. అంచనా వ్యయం రూ.29,027.95 కోట్లేనని కేంద్ర ఆర్థిక శాఖ.. జలశక్తి శాఖకు తేల్చిచెప్పడంతో రాష్ట్ర జలవనుల శాఖ వర్గాలు విస్మయానికి లోనయ్యాయి. ఇదే జరిగితే ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లింపు, సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టేదెలాగన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మోదీ ప్రభుత్వ నిర్ణయాలకు పార్లమెంటులో జగన్‌ మద్దతిస్తున్నప్పటికీ.. ఆయనకు కేంద్రం నుంచి అంతగా సహకారం అందడం లేదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జలవనరుల నిపుణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన ఏడు ముంపు మండలాలకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం భారీగా పరిహారం చెల్లించాల్సి వచ్చింది. దీంతో ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగింది. 


సవరించిన తుది అంచనా రూ.55,548.87 కోట్లుగా పేర్కొంటూ గత ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్ర జల సంఘం పరిధిలోని సాంకేతిక సలహా కమిటీ 2019 ఫిబ్రవరిలోనే ఆమోదించింది. దీనికి కేంద్ర జలశక్తి శాఖ కూడా అంగీకరించింది. ఇదే మొత్తాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదానికి పంపింది. దీనిని పరిశీలించిన ఆర్థిక శాఖ పరిధిలోని కమిటీ.. భూసేకరణకు భారీ వ్యయం ప్రతిపాదించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 7,823.63 కోట్ల మేర కోతపెట్టి.. తుది అంచనా వ్యయం రూ.47,725.24 కోట్లుగా పేర్కొంది. దీనికి అంగీకరించాలని జలశక్తి శాఖ రాష్ట్రప్రభుత్వానికి షరతులు విధించిందని.. ఆతర్వాత ఆర్థిక శాఖ ఇంకో రూ.14,725 కోట్లు కోత పెట్టి.. తుదకు అంచనా వ్యయాన్ని రూ.33 వేల కోట్లకే కుదించే అవకాశాలు కనిపిస్తున్నాయని ‘ఆంధ్రజ్యోతి’ గతంలోనే వెల్లడించింది. తాజా పరిణామాలు చూస్తుంటే..అదే నిజమయ్యేలా ఉందని నిపుణులు అంటున్నారు.

Updated Date - 2020-10-21T08:45:06+05:30 IST