నిత్య జాగురూకతలో కేంద్రం

ABN , First Publish Date - 2021-05-11T07:42:57+05:30 IST

ఈఏడాది జనవరి ప్రారంభంలో దేశవ్యాప్తంగా కొవిడ్ పరిస్థితి గణనీయంగా మెరుగుపడి, రోజువారీ కొత్త కేసుల సంఖ్య నిరంతరం తగ్గుతూ వచ్చింది...

నిత్య జాగురూకతలో కేంద్రం

ఈఏడాది జనవరి ప్రారంభంలో దేశవ్యాప్తంగా కొవిడ్ పరిస్థితి గణనీయంగా మెరుగుపడి, రోజువారీ కొత్త కేసుల సంఖ్య నిరంతరం తగ్గుతూ వచ్చింది. కానీ, కేరళలో మాత్రం వ్యాధిపీడితుల సంఖ్య పెరుగుతూ, దేశవ్యాప్త రోజువారీ కేసులలో దాదాపు మూడోవంతు ఆ రాష్ట్రం నుంచే నమోదవడం మొదలైంది. దీంతో తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ జనవరి 6న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ మరునాడే కొవిడ్ నిర్వహణ కృషిలో రాష్ట్రానికి తోడ్పడేందుకు ఉన్నతస్థాయి కేంద్రబృందాన్ని పంపారు. దేశమంతటా కొవిడ్ కేసులపై తక్షణ ప్రతిస్పందనలో భాగంగా ఏడాది నుంచీ కేంద్రం చేపట్టిన ముమ్మర పర్యవేక్షణ కృషిని ప్రస్ఫుటం చేసే అనేక ఉదంతాల్లో ఇదీ ఒకటి.


మహమ్మారి తొలిదశ తర్వాత కొవిడ్ నియంత్రణ బాధ్యతలను కేంద్రప్రభుత్వం పూర్తిగా రాష్ట్రాలకే వదిలేసి చేతులు దులిపేసుకున్నట్లు అసత్యప్రచారం జరుగుతున్నందున ప్రస్తావిత ఉదంతాన్ని నేను గుర్తు చేయాల్సి వచ్చింది. నిజమేమిటి? మన రాజ్యాంగం ప్రకారం ప్రజారోగ్యం రాష్ట్రాల పరిధిలోని అంశం అయినప్పటికీ ఒక కొవిడ్ మహమ్మారి నియంత్రణకు సంబంధించి జాతీయస్థాయి సమన్వయం, అపార ఆర్థిక వనరులు అవసరం కనుక కేంద్రప్రభుత్వం ఆదినుంచీ చురుకైన పాత్ర పోషిస్తోంది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలను ముందుండి నడిపిస్తూ పూర్తి మద్దతుతో పాటు నిరంతర మార్గదర్శనం చేస్తూనే ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ 2020 ఫిబ్రవరి నుంచీ కేసుల ధోరణిని పర్యవేక్షిస్తూ రాష్ట్రాల సంసిద్ధతను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూనే ఉంది. తదనుగుణంగా సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తూ రాష్ట్ర, జిల్లా స్థాయి వ్యూహాల రూపకల్పనను పర్యవేక్షిస్తూనే ఉంది.


కొవిడ్ నియంత్రణపై కేంద్రం పాత్ర న్యూఢిల్లీ నుంచి సూచనలు, మార్గదర్శకాల జారీకి మాత్రమే పరిమితం కాలేదు. అనేక సందర్భాల్లో రాష్ట్రాల సంసిద్ధతను అంచనావేసి, వ్యాధి నిరోధం, నియంత్రణ చర్యలలో మద్దతునివ్వడం కోసం ఉన్నతస్థాయి కేంద్రబృందాలను పంపుతూ వచ్చింది. అటుపైన 2020 సెప్టెంబరు నుంచి కేంద్ర ప్రభుత్వ అధికారులు, ప్రజారోగ్య నిపుణులతో కూడిన 75కు పైగా ఉన్నతస్థాయి బృందాలను వివిధ రాష్ట్రాలకు పంపింది. ఈ బృందాల నుంచి అందిన వివరాల తోడ్పాటుతో కేంద్ర-–రాష్ట్రాల మధ్య సమాచార అసమతౌల్యాన్ని తగ్గించడం సాధ్యమైంది. అంతేకాకుండా రాష్ట్రాల సంసిద్ధత, ప్రతిస్పందన వ్యూహాల్లోని కీలక లోటుపాట్లను గుర్తించే వీలు కలిగింది.


కేసులు ముమ్మరం అవుతున్నందున మహమ్మారి ప్రస్తుత విజృంభణను కేంద్రం విస్మరించిందా? లేదు. కేంద్రం తొలినాళ్లలోనే ప్రారంభించిన చర్యల క్రమాన్నిచూస్తే వాస్తవాలు విశదమవుతాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 21న రోజువారీ కేసులు 13,000కు దిగువన ఉండగానే కేసుల విషయంలో రాష్ట్రాల మధ్య విభిన్న ధోరణిని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పసిగట్టింది. వెనువెంటనే కేసుల పెరుగుదల అధికంగాగల ఛ‌త్తీస్‌గఢ్‌, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. అదేవిధంగా కేసుల సంఖ్య ముమ్మరం అవుతున్న మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేంద్రపాలిత ప్రాంతాలు జమ్ము, కశ్మీర్‌లలో పరిస్థితుల పర్యవేక్షణతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలకు సహకారం అందించడానికి వీలుగా ఫిబ్రవరి 24నే ఉన్నతస్థాయి కేంద్ర బృందాలను పంపుతున్నట్లు ప్రకటించింది.


ఈ రాష్ట్రాల్లో వ్యాధివ్యాప్తి తీవ్రతను కేంద్రం మార్చి నెల మొత్తం చురుగ్గా పర్యవేక్షిస్తూ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలతో నిత్యం చర్చిస్తూ, కేంద్రబృందాల నివేదికలకు అనుగుణంగా అవి చేపడుతున్న ప్రతి స్పందన చర్యలను నిరంతరం సమీక్షించింది. కేంద్రం తొలినాళ్లలోనే చేసిన హెచ్చరికలను, పంపిన సమాచారాన్ని ఈ రాష్ట్రాలు మరింత లోతుగా పరిగణనలోకి తీసుకుని ఉంటే మహమ్మారి విజృంభణ ఇంతటి తీవ్రస్థాయిలో ఉండేది కాదు. కొవిడ్ నియంత్రణకు ఒకవైపు కేంద్రం శ్రద్ధతో కృషి చేస్తుండగా ప్రతిపక్ష నాయకులు మరోవైపు యథావిధిగా రాజకీయాలు చేస్తూ వచ్చారు. ఆ మేరకు ఉద్ధవ్ ఠాక్రే సాక్షాత్తూ తన పరిధిలోనే సాగుతున్న అత్యంత సంచలనాత్మక ‘మహా వసూళ్ల’ కుంభకోణాన్ని మరుగున పెట్టడం ఎలాగన్నదానిపై అమిత శ్రద్ధ చూపారు. ఇక కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఈ సమయంలో ఏ విధంగా ప్రవర్తించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే టీకాల కార్యక్రమంపై ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరితో పాటు సుదీర్ఘకాలం ఆయన రాష్ట్రానికి దూరంగా ఉండడం కూడా అందరికీ తెలిసిందే. అంతేకాకుండా కొన్ని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో కొవిడ్ నిర్వహణకు చేపట్టబోయే కృషి గురించి చాటుకోవడానికే ప్రకటనలు, ప్రచారం కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించడం చూశాం.


ప్రభుత్వం సాధించిన తొలి విజయంపై కొన్ని వర్గాల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించే విమర్శలు వచ్చిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 17న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో ఏం చెప్పారో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది: ‘‘కరోనా ప్రభావితమైన చాలా దేశాలు ఇప్పటేకే పలుదశల విజృంభణతో సతమతమయ్యాయి. మన దేశంలోనూ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన తరుణంలోనే కొన్ని రాష్ట్రాల్లో హఠాత్తుగా కొత్త కేసుల సంఖ్య పెరగడం మొదలైంది. ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో నిర్ధారిత కేసులు, వ్యాధిపీడితుల సంఖ్యలో పెరుగుదల కూడా అత్యధికంగా ఉన్నట్లు గమనించాం. ఇప్పటిదాకా ప్రభావితం కాని అనేక ప్రాంతాలు, జిల్లాల్లో ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒకవిధంగా అవన్నీ సురక్షిత ప్రాంతాలే అయినప్పటికీ ఇప్పుడు తాజా కేసులు వెలుగు చూస్తున్నాయి. దేశంలోని 70 జిల్లాల్లో గడచిన కొద్ది వారాలుగా ఈ పెరుగుదల 150 శాతానికిపైగా నమోదైంది. మహమ్మారి వ్యాప్తిని మనం ఈ దశలోనే నిరోధించకపోతే అది దేశవ్యాప్తంగా విజృంభించే ప్రమాదం ఉంది. ఆ మేరకు కరోనా ‘రెండోదశ విజృంభణ’ను తక్షణం నిరోధించి తీరాలి. ఇందుకోసం తక్షణ, నిర్ణయాత్మక చర్యలు చేపట్టాలి. ఈ తరుణంలో స్థానిక ప్రభుత్వాల స్థాయిలో పాలనా సంబంధిత ఇబ్బందులను మనం గమనించి, సమీక్షించడంతో పాటు వాటిని పరిష్కరించడం అవశ్యమని భావిస్తున్నాను. కరోనాపై యుద్ధంలో మన ఆత్మవిశ్వాసం ‘అతివిశ్వాసం’గానూ, మన విజయం ‘నిర్లక్ష్యం’ గానూ పరిణమించకుండా జాగ్రత్త వహించాలి.’’


ఈ మాటలు వింటే- ‘మనం విజయం సాధించామని’ ప్రకటించిన దేశ పాలకుడికి మహమ్మారి నుంచి భవిష్యత్‌లో సంభవించే ముప్పుపై అవగాహన లేనట్లు మీకు గానీ, మరెవరికైనా గానీ అనిపిస్తుందా! మహమ్మారి ప్రస్తుత విజృంభణను కేంద్రం ముందుగానే గుర్తించి, తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రాలు, జిల్లాలకు ప్రత్యేక బృందాలను పంపింది. ఆ మేరకు ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా వివిధ జిల్లాలకు 50కి పైగా బృందాలు వెళ్లాయి. మహమ్మారి నియంత్రణ, నిఘా చర్యలలో అక్కడి రాష్ట్రప్రభుత్వాలకు సహాయ సహకారాలు అందించాయి. అంతేకాకుండా మార్చి నెలాఖరున కేసులు పెరగడం మొదలైనప్పుడు రాష్ట్రాలు తమ పరిధిలో జిల్లా స్థాయి వ్యూహాలను రూపొందించాల్సి ఉంది. ఆ మేరకు కేసుల తీవ్రత అత్యధికంగా ఉన్న దాదాపు 200 జిల్లాల కార్యాచరణ ప్రణాళికను కేంద్రప్రభుత్వ అధికారులు మార్చి 27 నుంచి ఏప్రిల్ 15 మధ్య సమీక్షించారు.


కొత్త సవాళ్లు తరచూ ఎదురవుతున్న నేపథ్యంలో పౌరుల ప్రాణరక్షణ లక్ష్యంగా కేంద్రప్రభుత్వం బహు ముఖ విధానాన్ని చేపట్టింది. అందులో భాగంగా తొలివిడత టీకాల కార్యక్రమంలో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, ముందువరుస సిబ్బంది, వృద్ధులకు తొలి ప్రాధాన్యంతో ప్రణాళిక రూపొందించి ఎంతో శ్రద్ధతో అమలు చేసింది. కేసుల సంఖ్యలో పెరుగుదలతో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల కొరతను పలు రాష్ట్రాలు గుర్తించాయి. దాంతో మందులు, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు తదితర కీలక సరఫరాల కోసం కేంద్రానికి అత్యవసర అభ్యర్థనలను పంపాయి. ఈ నేపథ్యంలో సాగుతున్న తప్పుడు సమాచారవ్యాప్తికి భిన్నంగా మహమ్మారి నియంత్రణ సంబంధిత అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఏకకాలంలో సమర్థంగా వ్యవహరిస్తోంది. ఇటువంటి సంక్షోభం నడుమ కూడా కొందరు వ్యక్తులు తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తూ రాజకీయ ప్రేరేపిత వదంతులు ప్రచారం చేస్తుండటం దురదృష్టకరం.


ఏది ఏమైనా.. మహమ్మారి పరిస్థితులను అధిగమించడం, పౌరుల అవసరాలను తీర్చి ఉపశమనం కలి గించడమే మా ప్రభుత్వ ప్రథమ ప్రాధమ్యంగా ఉంది. కొవిడ్‌పై పోరు మనమంతా ఒక దేశంగా, ఒక జాతిగా, ఒక ఉద్యమంలా సమష్టిగా చేయాల్సిన యుద్ధం.

ప్రకాష్ జావడేకర్

కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి

Updated Date - 2021-05-11T07:42:57+05:30 IST