నరసరావుపేట కేంద్రంగా మద్యం స్కాం

ABN , First Publish Date - 2020-04-08T10:31:35+05:30 IST

లాక్‌డౌన్‌ అక్రమార్కులకు కలిసొచ్చింది. నరసరావుపేట కేంద్రంగా మద్యంస్కాం జరిగింది. ఆరు ప్రభుత్వ షాపుల

నరసరావుపేట కేంద్రంగా మద్యం స్కాం

ప్రభుత్వ దుకాణాల నుంచి బ్లాక్‌మార్కెట్‌కు తరలింపు

రూ.20లక్షల విలువైన మద్యాన్ని సిబ్బందే కొట్టేశారు

ఒక కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

అధికార పార్టీ అండదండలు

డబ్బు పంపకాల్లో తేడాతో వెలుగులోకి...


నరసరావుపేట, ఏప్రిల్‌7: లాక్‌డౌన్‌ అక్రమార్కులకు కలిసొచ్చింది. నరసరావుపేట కేంద్రంగా మద్యంస్కాం జరిగింది.  ఆరు ప్రభుత్వ షాపుల నుంచి  సుమారు రూ. 20లక్షల విలువైన మద్యంనిల్వలను బ్లాక్‌మార్కెట్‌లో విక్రయించి అక్రమార్కులు సొమ్ముచేసుకున్నారు. మంగళవారం ఎక్సైజ్‌, పోలీసు అధికారుల తనిఖీల్లో అక్రమాలు వెలుగుచూశాయి. ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సత్యాన్ని సస్పెండ్‌ చేసినట్టు అధికారులు వెల్లడించారు. 


పట్టణంలోని ప్రభుత్వషాపుల్లో మద్యంనిల్వలను గుట్టుచప్పుడు కాకుండా బ్లాక్‌మార్కెట్‌కు తరలించారు. ఈ ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. వినుకొండరోడ్డు, స్టేషన్‌రోడ్డు, గుంటూరు రోడ్డు, ములకలూరు, రావిపాడులలోని ప్రభుత్వమద్యం దుకాణాల్లో అక్రమాలు జరిగినట్టు పోలీసు, ఎక్సైజ్‌శాఖల అధికారులు నిర్ధారించారు. బ్లాక్‌లో ఎమ్మార్పీ కన్నా మూడు నాలుగు రెట్లు ధర పలుకుతున్నది. బ్లాక్‌లో విక్రయించగా వచ్చిన సొమ్ము పంపకాల్లో తేడాల వల్ల ఈ ఉదంతం వెలుగుచూసింది. షాపుల్లో విధులు నిర్వహించేవారు, ఒక ఎక్సైజ్‌ ఉద్యోగి సహకారంతోనే ఇదంతా జరిగినట్టు ఎక్సైజు అధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.


వినుకొండరోడ్డులోని మద్యం బ్లాక్‌ మార్కెట్‌కు తరలింపుపై సీసీ కెమెరాలలో దృశ్యాలు నమోదైనట్టు అధికారులు తెలిపారు. బ్లాక్‌మార్కెట్‌కు తరలించే సందర్భంలో అధికార పార్టీలోని ఒక నేతకు సంబంధించిన దృశ్యాలు కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంకా వీటిని బయటపెట్టకపోవడంతో అనుమానాలకు తావిస్తున్నది. సీసీ కెమెరాల పుటేజ్‌ని పోలీసులు స్వాధీనపరచుకొన్నారు. 


వినుకొండ రోడ్డు బస్టాండ్‌ వద్ద 07290 నెంబరు ప్రభుత్వ దుకాణంలో సుమారు రూ.4,63,070 మేర విలువైన వివిధ కంపెనీలకు చెందిన 4230మద్యంసీసాలను బ్లాక్‌మార్కెట్‌కు తరలించారు. లాక్‌డౌన్‌కు ముందు ఈ షాపుల్లో ఉన్న నిల్వలను, ముగింపు నగదును ఎక్సైజ్‌ అధికారులు నమోదుచేశారు. ఈ షాపులో జరిగిన ఘటనను పరిశీలించిన ఆ శాఖ అధికారులు క్యాష్‌బాక్సులో రూ.3,50,130 నగదు ఉందని తెలిపారు. ఈ నగదు కౌంటర్‌లోకి ఎలా వచ్చిందో తేలాల్సివుంది. స్టేషన్‌రోడ్డులోని షాపులో రూ.6.81 లక్షలు, గుంటూరురోడ్డులోని షాపులో రూ.4.92లక్షలు, ములకలూరు షాపులో రూ.1.50 లక్షలు, రావిపాడులోని షాపులో రూ.50వేల విలువైన మద్యం నిల్వలను కాజేశారు.


లాక్‌డౌన్‌ సందర్భంగా ఎక్సైజ్‌ శాఖ షాపులకు సీళ్లు వేయాల్సివుంది. తాము వేసిన సీళ్లను ట్యాంపర్‌ చేశారని అధికారులు చెప్పారు. కాగా షాపునకు సీళ్లు వేయలేదని షాపులో పనిచేసే వ్యక్తులు చెబుతుండటం గమనార్హం! మద్యం మాయం వెనుక ఉన్న వ్యక్తులను ప్రాథమికంగా అధికారులు గుర్తించినా వీరిపై చర్యలు ఉంటాయా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ స్కాం వెనుక అధికార పార్టీకి చెందిన ఒక నేత హస్తం ఉందనే ప్రచారం జరుగుతున్నా, అధికారులకు ఫిర్యాదులు అందినా ఈ దిశగా దర్యాప్తు చేస్తారా లేదో చూడాలి. ఈఘటనల్లో  పలువురిని అదుపులోకి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అధికారపార్టీ నేత అండదండలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరగవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్సైజ్‌శాఖ ఫిర్యాదుమేరకు పోలీసులు కేసులు నమోదుచేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇటీవల రొంపిచర్ల మద్యంషాపులో కూడా మద్యం నిల్వలు మాయంచేసిన ఉదంతం తెలిసిందే. ప్రభుత్వ దుకాణాల్లోని మద్యం బ్లాక్‌మార్కెట్‌కు తరలించడంపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.


చిలకలూరిపేటలో మద్యం పట్టివేత

నరసరావుపేటలోని మద్యంషాపుల నుంచి తీసుకువచ్చిన మద్యాన్ని చిలకలూరిపేటలో అమ్ముతుండగా అర్బన్‌ పోలీసులు సోమవారం రాత్రి పట్టుకున్నారు. అందిన సమాచారం మేరకు చిలకలూరిపేట-నరసరావుపేట మార్గంలో పట్టణ పరిధిలోని జిడ్డుకాలనీ సమీప పొలాల దారిలో దాడులు నిర్వహించగా... అమ్మకందారులు పరారవ్వడంతో 31క్వార్టర్‌ సీసాల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు  సీఐ సూర్యనారాయణ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.


Updated Date - 2020-04-08T10:31:35+05:30 IST