అక్షరాల పిల్లలు గుక్కపెట్టి ఏడుస్తున్నాయి

తెలుగు సినిమా పాట మూగబోయింది. 

వేలకొలది గీతాలతో నిర్విరామంగా సినిమా పాటకు సొగబులద్దిన కలం ఆగిపోయింది. 

తెలుగు సినీ సాహిత్యంలో చెరగని సంతకం ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో యావత్‌ తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. సీతారామశాస్త్రితో తమకు గల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.


‘సిరివెన్నెల’ మనకిక లేదు. సాహిత్యానికి ఇది చీకటి రోజు. నడిచి వచ్చే నక్షత్రంలా ఆయన స్వర్గద్వారాల వైపు సాగిపోయారు. మనకి ఆయన సాహిత్యాన్ని కానుకగా ఇచ్చి వెళ్లారు. మిత్రమా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్సవుతున్నాం..

చిరంజీవి


‘సిరివె న్నెల’ నా సన్నిహితుడు. విధాత తలపున ప్రభవించిన సాహిత్య శిఖరం నేలకొరిగింది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. 

మోహన్‌బాబు


సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు ఇక లేరనే వార్త చాలా బాధ కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

వెంకటేష్‌ 


చుక్కల్లారా... చూపుల్లారా... ఎక్కడమ్మా జాబిలి.

ఎం.ఎం. కీరవాణి 


అందరూ జీవిస్తారు. కొందరే ముందు తరాలకు స్ఫూర్తినిచ్చే మార్గదర్శకులుగా నిలిచిపోతారు. భవిష్యత్‌ తరాలు  సీతారామశాస్త్రి కృషిని గుర్తు చేసుకుంటాయి. తెలుగు సినిమా ఉన్నంత వరకూ ఆయన పాట బతికే ఉంటుంది.   

రామ్‌ గోపాల్‌ వర్మ


సీతారామశాస్ర్తి గారు ఇకలేరనే వార్త దుఃఖానికి గురిచేసింది. ఆయన కలం ఆగినా, రాసిన అక్షరాలు తెలుగుభాష ఉన్నంతకాలం చిరస్మరణీయంగా ఉంటాయి. 

ఎన్టీఆర్‌


సిరివెన్నెల మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. ఏం చేయాలో, ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఆయన మనల్ని వదలివెళ్లిపోయాడంటే నమ్మశక్యం కావడం లేదు.

కె. విశ్వనాథ్‌


నా జీవన గమనానికి దిశా నిర్ధేశం చేసిన సీతారామశాస్త్రి గారి కలానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నా...

రాజమౌళి


మీ మరణంతో మాది ఏకాకి జీవితం. భరించలేకున్నాం. మీ పాటలతో మా జీవితాలకు అర్థాన్ని జోడించిన మీకు ధన్యవాదాలు. మీరెంతో ఉత్తములు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. 

ప్రకాశ్‌రాజ్‌


పాటే శ్వాసగా జీవిస్తూ, వెండితెరపై సిరివెన్నెల కురిపించిన మా సీతారామశాస్త్రి ఇక లేరు అనే నిజాన్ని తట్టుకోలేకపోతున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. 

పరుచూరి గోపాలకృష్ణ


సిరివెన్నెల చీకట్లో కలసిపోయిందంటే నమ్మబుద్దికావడం లేదు. ఆయన సిరా...వెన్నెల. సీతారామశాస్త్రి ఏ పాట రాసినా మాకు మార్గదర్శకంగా ఉండేది. ఆయన మరణం తెలుగు సినిమా పాటకు, సాహిత్యలోకానికి చాలా పెద్ద నష్టం. ఈ నష్టం పూరించేది కాదు.

సుద్దాల అశోక్‌తేజ


ఆయన సాహిత్యంలో సిరివెన్నెల. ఆయన పాటలు మన మనసులో ఎప్పటికీ నిలిచిపోతాయి. వీడ్కోలు గురువు గారు

నాని 


సాహితీ దిగ్గజం సిరివెన్నెల గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.

తమన్‌


గుండె నిండు గర్భిణిలా ఉంది. ప్రసవించలేని దుఃఖం పుట్టుకొస్తోంది. తల్లి కాగితానికి దూరమై అక్షరాల పిల్లలు గుక్కపట్టి ఏడుస్తున్నాయ్‌. మీరు బతికే ఉన్నారు. పాట తన ప్రాణం పోగొట్టుకొంది. మీరు ఎప్పటికి రాయని పాటలాగా మేం మిగిలిపోయాం. 

సుకుమార్‌


Advertisement