చిత్రకళా మాంత్రికుడు

ABN , First Publish Date - 2021-01-10T06:53:22+05:30 IST

మనదేశం గర్వించదగిన మహోన్నత చిత్రకారుడు, శిల్పి- పిటి రెడ్డి. తెలియనివారికి సైతం- ఆ రింగులు తిరిగిన వెండికురులు, విశాలమైన ఫాలభాగం...

చిత్రకళా మాంత్రికుడు

మనదేశం గర్వించదగిన మహోన్నత చిత్రకారుడు, శిల్పి- పిటి రెడ్డి. తెలియనివారికి సైతం- ఆ రింగులు తిరిగిన వెండికురులు, విశాలమైన ఫాలభాగం, దీర్ఘాలోచనలు చేస్తున్నట్టు తోచే సులోచనాల వెనుక నయనాలు, వేషభాషలు కచ్చితంగా అతడొక కళాకారుడనే విషయాన్ని చెప్పకనే చెప్పేవి.


నూటఅయిదేళ్ళ క్రితం జనవరి మాసం తొలివారంలో జన్మించిన పిటి రెడ్డి అసలు పేరు- పాకాల తిరుమల్‌రెడ్డి. అయితే పిటి రెడ్డి గానే ఆయన సకల కళాప్రపంచానికి తెలుసు. కరీంనగర్‌ జిల్లా అన్నారం స్వగ్రామం. తల్లిదండ్రులు రమణమ్మ-రామిరెడ్డి. హాలికుడిగా పుట్టినా, చిత్ర-శిల్పేంద్రజాలికుడిగా తన ప్రతిభాపాటవాలను చాటారు. అమృతా షేర్గిల్ ఇత్యాదుల సరసన ప్రథమశ్రేణి ఆధునికభారతీయ చిత్రకారుడిగా, వైతాళికుడిగా ఆయన గణుతికెక్కారు.


తన జీవితకాలమంతా చిత్ర శిల్పకళా రచనలోనే గడిపిన పిటి రెడ్డి విభిన్న ధోరణులలో వేలాది చిత్రాలు గీశారు. వందల సంఖ్యలో శిల్పాలు తీర్చిదిద్దారు. సమకాలీన సమాజాన్ని ఎప్పటికప్పుడు అవలోకిస్తూ విశ్వవ్యాప్తంగా చెలామణిలోకి వస్తున్న విభిన్న, వినూత్న ప్రక్రియలలో ఇమిడిపోయే సృజనాత్మకమైన, ఆలోచనాత్మకమైన చిత్రాలు సామాన్యుడిని సైతం అలరించే లాగా వేశారు.


నిత్య జీవితంలో తారసపడే అనేక విశేష సంఘటనలను, ప్రకృతి దృశ్యాలను నయనానందకరమైన రీతిలో గీశారు. ఎందరో మహానుభావుల చిత్రాలు తీర్చిదిద్దారు. నిశ్చలన చిత్రాలు, రేఖాచిత్రాలు, డ్రాయింగ్‌లు ఎన్నెన్నో వేశారు. పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి మహానాయకుల మూర్తిమత్వాలను ప్రతిబింబించే ప్రతీకాత్మక చిత్రాలు వేశారు. తాంత్రికకళలో తన ప్రతిభ చూపారు. వాత్సాయన కామసూత్రాల ఆధారంగా వర్ణచిత్రాలు వేశారు. ఆయన కాలధర్మం చెందడానికి కొంచెం ముందు రూపొందించిన నైరూప్య శిల్పాలు సైతం ఏదో తెలియని ఆకర్షణను కలిగిస్తాయి. ప్రత్యేక తెలంగాణ పోరాటం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆయన సృజించిన చిత్రాలు ప్రశంసనీయమైనవి.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పిటి రెడ్డి అనేక పదవులు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ లలితకళా అకాడెమీ అధ్యక్షుడిగా ఆయన సేవలు మరపురానివి. ఆయన హయాంలోనే సుప్రసిద్ధులైన తెలుగు చిత్రకారులు, శిల్పులపై వెలువరించిన ‘మోనోగ్రాఫ్‌’ల వల్లనే ఇవాళ కళాలోకానికి కె. రాజయ్య, కొండపల్లి శేషగిరిరావు, కె. లక్ష్మాగౌడ్‌, సూర్యప్రకాశ్‌, చంద్రశేఖర్‌ దొరస్వామి లాంటి సృజనాత్మక చిత్రకారులు సుపరిచితులుగా ఉన్నారు. పిటి రెడ్డి కళాజీవితాన్ని కళాఖండాల ప్రతులను పొందుపరచిన బృహత్‌గ్రంథం ఒకదాన్ని ఆయనే స్వయంగా ప్రచురించారు. ఇంత సుందరంగా కళాప్రమాణాలకు భంగం కలగకుండా లక్షలాది రూపాయల వ్యయంతో ప్రచురించిన చిత్రకళాకారుడి దేశీయ గ్రంథాలలో ఇదే మొదటిది. ఎం.ఎఫ్‌ హుస్సేన్‌ కళాజీవితాన్ని ప్రతిబింబించిన గ్రంథం వచ్చినా అది అమెరికన్లు ప్రచురించినది. చిత్రకళారంగంలో పిటి రెడ్డి శిఖరస్థాయిని గమనించిన ఆనాటి ప్రభుత్వం ఆయన్ని ఆస్థాన చిత్రకారుడిగా నియమించి గౌరవించింది. ఇప్పటిలాగే కళాభిరుచి కరువు ఆనాటి ప్రభుత్వాధినేతలలోనూ ఉన్నందున ఆయనకు ‘పద్మ’ అవార్డులేవీ లభించలేదు.


నూనూగు మీసాల నూతన యవ్వనంలో తల్లిదండ్రులను, బంధుమిత్రులను కాదని, వారి అభీష్టానికి వ్యతిరేకంగా తనకు ప్రాణప్రదమైన కుంచెను నమ్ముకుని చిత్రకళా రంగంలో పిటి రెడ్డి ఉద్యమించారు. కొత్వాల్‌ రాజబహద్దూర్‌ వెంకట్రామారెడ్డి, పింగళి వెంకట్రామారెడ్డి ప్రభృతుల చేయూతతో తాను కోరుకున్న చిత్రకళా రంగంలో కృషి చేశారు. 1935–42 మధ్య కాలంలో బొంబాయిలోని జెజె స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో డిప్లొమా చదివి ప్రథమశ్రేణిలో సర్వ ప్రథముడిగా ఉత్తీర్ణుడయ్యారు. అనంతరం అక్కడ కుడ్య చిత్రకళను అధ్యయనం చేశారు. ఓం ప్రథమంగా 1942లో ‘వ్యష్టి’ చిత్రకళా ప్రదర్శన నిర్వహించిన ఖ్యాతి దక్కించుకుని దేశీయ చిత్రకారులందరికీ మార్గదర్శకులయ్యారు. ఆ తర్వాత బొంబాయి కేంద్రంగా దేశంలో ఉప్పెనలాగా వచ్చిన అభ్యుదయ కళోద్యమం పిటి రెడ్డి నేతృత్వంలో సాగింది. అనంతరం దేశంలోనే మొట్టమొదటగా, ఆయన వేసిన వర్ణచిత్రాలు, తెలుపు–నలుపు చిత్రాలు, డ్రాయింగ్‌లతో ఒక పోర్ట్‌ఫోలియో ప్రచురించారు.


అనంతరకాలంలో పిటి రెడ్డి చిత్రించిన ‘నాన్‌ ఆబ్జెక్టివ్‌’ చిత్రాలు, వాటి పూర్వాపరాలు వివరించే గ్రంథమొకటి, వాత్సాయన కామసూత్రాల ఆధారంగా వేసిన చిత్రాలతో- అనంగరంగ, హరిహరభట్‌, కోకన్‌, ఎర్రనల తులనాత్మక అధ్యయనంతో మరొక గ్రంథం ప్రచురించాలని ఆయన శ్రీమతి, సుప్రసిద్ధ రచయిత్రి యశోదారెడ్డి సంకల్పించారు. కాని దురదృష్టవశాత్తూ అది కార్యరూపం ధరించకుండానే అమె కన్నుమూశారు. ఆమె సంకల్పాన్ని నెరవేర్చడమే పిటి రెడ్డి, యశోదా రెడ్డి స్మృతికి మన నిజమైన నివాళి.

టి. ఉడయవర్లు


Updated Date - 2021-01-10T06:53:22+05:30 IST