Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆకాశంలో మబ్బులు రైతు గుండెల్లో గుబులు

మూడురోజులుగా ధాన్యం దిగుమతుల్లో జాప్యం

మద్దతు ధర ఇవ్వలేమంటున్న మిల్లర్లు

రోడ్డెక్కిన అన్నదాతలు


 ఆకాశంలో మబ్బులు ఓ వైపు,ధాన్యం కొనుగోళ్లు కొనసాగక మరోవైపు రైతు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. చివరికి ఆరుగాలం కష్టించి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర దక్కకపోవడంతో రోడ్డెక్కుతున్నారు. ఆయకట్టుతోపాటు, నాన్‌ ఆయకట్టులో సాగుచేసిన వరి నూర్పిడి ముమ్మరంగా కొనసాగుతుండడంతో మండలంలోని శెట్టిపాలెం శివారులోని రైస్‌మిల్లులకు భారీగా ధాన్యం వస్తోంది. ధాన్యం లోడ్‌ ట్రాక్టర్లు నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై బారులు తీరుతున్నాయి. మూడురోజులుగా దిగుమతు ల్లో జాప్యం, మబ్బులతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.   

                              

వేములపల్లి, నవంబరు 1: రెండు రోజుల క్రితం మిల్లుల వద్దకు వచ్చిన రైతులకు మిల్లర్లు టోకెన్‌లు జారీ చేసి ధాన్యం దిగుమతి చేసుకుంటున్నారు. కొన్ని మిల్లుల్లో సైలోలు నిండాయని మూడు రోజులు ధాన్యం కొనుగోలు చేయలేమని మిల్లుల వద్ద ప్లెక్సీలు ఏర్పాటుచేయడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాగా, ఆదివా రం రాత్రి అకస్మాత్తుగా కురిసిన వర్షానికి కొంతమేరా ధాన్యం తడవడంతో కొనుగోలుకు మిల్లర్లు ముందుకు రాకపోవడంతో దిక్కుతోచనిస్థితిలో పడ్డారు. తెచ్చిన వెంటనే మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేస్తే, వర్షానికి తడిచేది కాదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ రైతులు పలుమార్లు నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై రాస్తారోకో చేయడంతో భారీగా వాహనాలు నిలిచాయి. విషయం తెలుసుకు న్న ఎస్‌ఐ రాజు అక్కడికి చేరుకొని మిల్లర్లతో మాట్లాడి రైతులకు సర్ధిచెప్పడంతో రాస్తారోకో విరమించారు. కాగా, రైతుల ధర్నాకు కాంగ్రెస్‌, సీపీఎం, బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షు డు కేతావత్‌ శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ, రైతులు మద్దతు ధర కోసం నిత్యం రోడ్డెక్కుతుంటే అధికార పార్టీ నాయకులు పట్టన్నట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచి, రైతులకు మద్దతుధర చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ పా దూరి గోవర్ధని, జిల్లా కిసాన్‌సెల్‌ అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి, బీజేపీ కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు చల్లా సీతారాంరెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి  శశిధర్‌రెడ్డి, సత్తిరెడ్డి, సూర్యానాయక్‌, జానకిరెడ్డి, సైదులు,వినోద్‌ పాల్గొన్నారు.


రైతులకు నష్టం

ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంతో మిల్లల వద్ద రైతులకు మద్దతు ధర రూ.1960 దక్కడం లేదు. క్వింటా ధాన్యానికి రూ.1750నుంచి రూ.1800 వరకు మిల్లర్లు కొనుగోలుచేస్తున్నారు. క్విం టాకు రెండు కిలోల చొప్పున తరుగు తీసున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ధాన్యం కొనుగోలు చేయలేమని మిల్లర్లు తెగేసి చెప్పడంతో రైతులకు నష్టం తప్పడం లేదు. ధాన్యం వర్షంలో తడిస్తే రంగుమారే ప్రమాదముందని రైతులు మిల్ల ర్లు చెప్పిన ధరకు విక్రయిస్తున్నారు.


చిల్లేపల్లి బ్రిడ్జివద్ద రైతుల రాస్తారోకో

నేరేడుచర్ల: మిర్యాలగూడ రైస్‌ మిల్లులకు ధాన్యం ట్రాక్టర్లు వెళ్లకుండా పోలీసులు సూర్యాపేట జిల్లా చిల్లేపల్లి బ్రిడ్జి వద్ద నిలిపివేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాలుగు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. ఆదివారం రాత్రి మూడు గంటలపాటు కురిసిన వర్షానికి ఇక్కడి ట్రాక్టర్లలోని ధాన్యం తడిచింది. సోమవారం ఉదయం 10 గంటల వరకు ట్రాక్టర్లను నిలి పే ఉంచడంతో రహదారికి అడ్డంగా వాహనాలను నిలిపి ధర్నాచేశారు. చివరికి మధ్యాహ్నం 2గంటల సమయంలో ట్రాక్టర్లను వదలడంతో రైతులు ఆం దోళన విరమించారు. ఇదిలా ఉండగా, రైతులంతా ఒకేచేట చేరితే ఆందోళనచేస్తారనే ఉద్దేశంతో నేరేడుచర్ల పోలీసులు ఎల్‌బీనగర్‌ సమీపంలో, నర్సయ్యగూడెం, చిల్లేపల్లి, మార్కెట్‌ యార్డు వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటుశారు. మి ర్యాలగూడకు వెళ్తున్న ధాన్యం ట్రాక్టర్లను ఈ చెక్‌పోస్టుల వద్ద నిలిపివేస్తున్నారు.


రైతులకు ఇబ్బంది కలిగించొద్దు : ఆర్డీవో

మిర్యాలగూడ: ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూ డాలని మిల్లర్లును ఆర్డీవో బి.రోహిత్‌సింగ్‌ ఆదేశించారు. డీఎస్పీ వెంకటేశ్వరరా వుతో కలిసి రైస్‌ మిల్లర్లతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మిల్లుల వద్ద టోకెన్‌ విధానాన్ని కఠినంగా అమలు చేస్తామన్నా రు. ఈనెల 4,5,6వ తేదీల్లో కొనుగోలు చేయనున్న ధాన్యానికి మంగళవారం టోకెన్లు జారీచేస్తామన్నారు. యాద్గార్‌పల్లి, నల్లగొండ, గూడూరు రోడ్లలో పర్యవేక్షణాధికారుల బృందాలు గస్తీ తిరుగుతాయని అన్నారు. ఎలాంటి ఫిర్యాదు వచ్చిన వెంటనే మిల్లును సీజ్‌చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, మిల్లర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి కర్నాటి రమేష్‌, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గౌరు శ్రీనివాస్‌, భోగవెళ్లి వెంకటరమణచౌదరి, పైడిమర్రి సురేష్‌ పాల్గొన్నారు.కర్షకుల కష్టం నేలపాలు

మిర్యాలగూడ, నిడమనూరు, తిరుమలగిరి(సాగర్‌), త్రిపురారం, కనగల్‌, గుర్రంపోడు, శాలిగౌరారం, నవంబరు 1: వర్షంతో నూర్పిడి చేసిన ధాన్యం తడవడంతోపాటు, కోతలకు సిద్ధమైన పంట నేలవాలడంతో రైతులు కన్నీరుపెట్టుకుంటున్నారు. మిర్యాలగూడ డివిజన్‌లో ఆదివారం రాత్రి 10 గంటలకు మొదలైన వర్షం సోమవారం ఉదయం వరకు కురుస్తూనే ఉంది. దీంతో డివిజన్‌ వ్యాప్తంగా సుమారు 20వేల ఎకరాల్లో వరి పంట నేలవాలింది. మిల్లుల వద్ద 1500 ట్రాక్టర్లలోని ధాన్యం తడిచింది. వర్షంతో దామరచర్ల మండలంలో 810 ఎకరాలు, మిర్యాలగూడ మండలంలో 2360, వేములపల్లి 300ఎకరాల్లో, త్రిపురారం, నిడమనూరు మండలాల్లో సైతం కొంత మేర వరి పంటలు నేలవాలాయి. నష్టాన్ని గుర్తించేందుకు వ్యవసాయశాఖ అధికారు లు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. తిరుమలగిరి(సాగర్‌) మండలంలో నేతాపురం, మేగ్యతండా, రాజవరం తదితర గ్రామాలలో ఎక్కువగా పంటనష్టం వాల్లింది. సుమారు 200 ఎకరాల్లో వరిపంట నేలవాలింది. త్రిపురారం మండలంలో 300 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు అంచనా. కనగల్‌ మండలంలో సోమవారం ఉదయం కురిసిన అకాల వర్షానికి అమ్మగూడెం, జీఎడవల్లి, రాంచంద్రాపురం, కనగల్‌ తదితర గ్రామాల్లోని పీఏసీఎస్‌, ఐకేపీ కేంద్రాల్లోకి వరద చేరి ధాన్యం రాశులు తడిచాయి. గుర్రంపోడు మండలంలోని పిట్టెలగూడెం, చేపూరు, కొప్పొలు ప్రాంతాల్లో సుమారు 200 ఎకరాల్లో వరి దెబ్బతిన్నది. దేవరకొండ మండలంలో సోమవారం తెల్లవారుజామున కురినిస వర్షానికి పత్తి దెబ్బతిన్నది. వర్షంతోపాటు డిండి ప్రాజెక్టు నీరు వస్తుండడంతో తాటికోలు-గుంటిపల్లికి రహదారిపై వరద ప్రవహిస్తోంది. రైతులకు ఇబ్బంది కలగకుండా ఇక్కడ కాజ్‌వే నిర్మించాలని సర్పంచ్‌ జూలూరి ధనలక్ష్మి కోరారు. వర్షాలు కురుస్తున్నందులన వెంటనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ నాయకులు శాలిగౌరారంలో రాస్తారోకో నిర్వహించారు. తహసీల్దార్‌ అక్కడికి చేరుకొని రెండు రోజుల్లో కొనుగోళ్లు ప్రారంభిస్తామని హామీ ఇవ్వటంతో ధర్నా విరమించారు. దీంతో ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జాం కావడంత విషయం తెలుసుకున్న కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి నూక కిరణ్‌కుమార్‌, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గుడిపాటి నర్సయ్య, సుధాకర్‌, ఎంపీటీఈ సైదమ్మ శ్రీనివాస్‌, పాల్గొన్నారు.నాలుగు రోజుల వరకు ధాన్యం తేవద్దు : కలెక్టర్‌

నల్లగొండ టౌన్‌: జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున కొనుగోలు కేంద్రాలకు నాలుగు రోజుల వరకు రైతులు ఎవ్వరూ ధాన్యం తీసుకురావద్దని కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ కోరారు. కలెక్టర్‌ కార్యాలయం నుంచి సోమవారం నిర్వహించిన సెల్‌కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఐకేపీ, పీ ఏసీఎస్‌, మార్కెట్‌యార్డులో ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే ధాన్యం తడవకుండా రైతులు టార్పాలిన్లు కప్పి ఉంచాలని సూచించారు. ఏఈవోలు ధాన్యం తేమశాతం పరిశీలించి, తూకం వేయించి ట్యాగ్‌ చేసి మిల్లులకు రవాణా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాల ప్రకారం ప్రభుత్వ మద్దతు ధర చెల్లించాలన్నారు. ధాన్యంలో తాలూ లేకుండా తూర్పారపట్టి తీసుకురావాలని రైతులకు సూచించారు. సెల్‌ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ వి.చంద్రశేఖర్‌, పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, డీఆర్‌డీవో కా ళిందిని, సహకార అధికారి ప్రసాద్‌, డీఎం నాగేశ్వర్‌రావు, మార్కెటింగ్‌ ఏడీ శ్రీకాంత్‌, రవాణా అధికారి సురే్‌షరెడ్డి, నిత్యానందం పాల్గొన్నారు.


ధాన్యం తీసుకురావద్దు : మిల్లర్స్‌ అసోసియేషన్‌

మిర్యాలగూడ: రైతులెవ్వరూ మిల్లులకు మంగళవారం ధాన్యం తీసుకురావొద్దని మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు గౌరు శ్రీనివాస్‌, బీవీఆర్‌ చౌదరి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి మిల్లుల ఎదుట లైన్‌లో ఉన్న 1500 ట్రాక్టర్లలోని ధాన్యం తడిచినందున వాటిని దిగుమతి చేసుకునేందుకు మంగళవారం సాయంత్రం వరకు సమయం పడుతుందన్నారు. టోకెన్‌ ఉన్న రైతులే బుధవారం నుంచి రావాలని కోరారు.

Advertisement
Advertisement