సీఎంకు కరీంనగర్‌పై ప్రత్యేక అభిమానం

ABN , First Publish Date - 2021-06-14T05:46:10+05:30 IST

తెలంగాణ ఉద్యమంలో వెన్నంటి నిలిచిన కరీంనగర్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేకమైన అభిమానం ఉందని, అందుకే నగర అభివృద్ధికి ఆయన భారీగా నిధులు కేటాయిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

సీఎంకు కరీంనగర్‌పై ప్రత్యేక అభిమానం
కేబుల్‌ బ్రిడ్జి వద్ద మాట్లాడుతున్న మంత్రి గంగుల కమలాకర్‌

  - ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నాం

- తుది దశలో కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు 

- మానేరు రివర్‌ ఫ్రంట్‌కు త్వరలో సర్వే 

-  మంత్రి గంగుల కమలాకర్‌ 

కరీంనగర్‌ టౌన్‌, జూన్‌ 13: తెలంగాణ ఉద్యమంలో వెన్నంటి నిలిచిన కరీంనగర్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేకమైన అభిమానం ఉందని, అందుకే నగర అభివృద్ధికి ఆయన భారీగా నిధులు కేటాయిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఆదివారం ఆయన కరీంనగర్‌లో నిర్మిస్తున్న కేబుల్‌ బ్రిడ్జి, మానేరు రివర్‌ ఫ్రంట్‌ ప్రాంతాన్ని సర్వే బృందంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ మానేరు రివర్‌ ఫ్రంట్‌ను  దేశంలోనే అత్యున్నత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, పనులను వేగంగా పూర్తిచేస్తామని అన్నారు. మానేరు రివర్‌ఫ్రంట్‌కు సీఎం కేసీఆర్‌ 310 కోట్ల 46 లక్షల రూపాయలు కేటాయిస్తూ జీవో విడుదల చేసిన మరుసటి రోజే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి 15 రోజుల్లో డీపీఆర్‌ రూపొందించి టెండర్లను నిర్వహించేందుకు చర్యలు చేపట్టామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరీంనగర్‌ను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామని ఇచ్చిన హామీలో భాగంగా మొట్టమొదట ఆర్‌అండ్‌బీ ద్వారా కరీంనగర్‌కు నిధులు మంజూరు చేశారని అన్నారు.  ఆ నిధులతో నగరంలో 14.4 కిలో మీటర్ల ప్రధాన ఆర్‌అండ్‌బీ రహదారులన్నీటిని అభివృద్ధి చేయడంతోపాటు సెంట్రల్‌ లైటింగ్‌, ఫుట్‌పాత్‌లు నిర్మించామన్నారు. 40 ఏళ్ళ చరిత్రలో జరగని అభివృద్ధిని ఈ ఆరేళ్లలో చేశామని, ఇది సీఎంకు కరీంనగర్‌పై ఉన్న ప్రత్యేక అభిమానంతోనే సాధ్యమైందని గంగుల తెలిపారు. కరీంనగర్‌లో తీగెల వంతెనను మంజూరు చేయించుకున్నామన్నారు. 190 కోట్లతో చేపట్టిన పనులు ముగింపు దశకు చేర్చుకున్నాయని తెలిపారు. 24 టీఎంసీల నీటితో నగరానికి తలాపున ఉన్న లోయర్‌ మానేరు రిజర్వాయర్‌ పరిసరాలను సబర్వతి తరహాలో మానేరు రివర్‌ఫ్రంట్‌గా అభివృద్ధి చేయాలనే సీఎం కేసీఆర్‌ సంకల్పంతోనే ఈ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో 100 కోట్లను కేటాయించారని, వాటితో ఎల్‌ఎండీ ముందుభాగంలో నీరు నిలువ ఉంచేందుకు చెక్‌డ్యాం నిర్మాణాలను చేపడుతున్నామని చెప్పారు. మానేరు రివర్‌ఫ ప్రంట్‌లో థీమ్‌ పార్కులు, వాటర్‌ ఫౌంటెయిన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎల్‌ఎండీ గేట్ల ముందు భాగంలో 12 ఫీట్ల నీరు నిలువ ఉండేలా వాగుకు ఇరువైపులా రిటర్నింగ్‌ వాల్స్‌ను నిర్మాణం చేపడతామని తెలిపారు. అమెరికాకు చెందిన ఐకామ్‌ సంస్థ ప్రతినిధులతో చర్చించామని, ఈ సంస్థ గోమతి రివర్‌ ఫ్రంట్‌, పలు దేశాల్లో రివర్‌ఫ్రంట్‌లు నిర్మించిందన్నారు. హైదరాబాద్‌లో మెట్రో, ఐకియా వంటి పలు ప్రతిష్టాత్మక నిర్మాణాలు ఐకామ్‌ సంస్థ చేపట్టిందని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సంస్థ 15 రోజుల్లో డీపీఆర్‌ను రూపొందిస్తుందని, 15 రోజుల్లో టెండర్లను నిర్వహించి పనులను ప్రారంభిస్తామని మంత్రి గంగుల ప్రకటించారు. 

- భూ సేకరణకు ప్రజలు సహకరించాలి

వాగు ఒడ్డు నుంచి 150 మీటర్ల వరకు ఇరువైపులా ప్రాజెక్టు కోసం భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. అందుకు అనుగుణంగా భూసేకరణ చేస్తామని, ప్రజలు అందుకు సహకరించాలని కోరారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు మూడు, నాలుగురోజులపాటు విడిది చేసే విధంగా అవసరమైన అన్ని చర్యలను చేపడతామని అన్నారు. గతంలో ఇచ్చిన ప్రతి హామీని చిత్తశుద్ధితో పూర్తి చేస్తున్నామని, ప్రతిపక్షాల్లాగా ఇచ్చిన మాటలను మరిచిపోమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఐకామ్‌ సంస్థల ప్రతినిధులు, మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, కలెక్టర్‌ కె శశాంక, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణిహరిశంకర్‌, పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-14T05:46:10+05:30 IST