రియల్‌ ‘ఢమాల్‌’

ABN , First Publish Date - 2020-05-26T05:30:00+05:30 IST

అవి.. కరోనాకు ముందు రోజులు.. కడప నగరంలో రింగు రోడ్డు చుట్టూ ఇరువైపులా ఉన్న భూములను

రియల్‌ ‘ఢమాల్‌’

కుప్పకూలిన రియల్‌ ఎస్టేట్‌ రంగం

నిలిచిపోయిన రూ.500 కోట్ల లావాదేవీలు

ఆందోళనలో రియల్టర్లు


కడప, మే 25 (ఆంధ్రజ్యోతి): అవి.. కరోనాకు ముందు రోజులు.. కడప నగరంలో రింగు రోడ్డు చుట్టూ ఇరువైపులా ఉన్న భూములను ఖద్దరు చొక్కాలు ధరించి నల్లద్దాలు పెట్టుకుని ఖరీదైన కార్లలో వచ్చి పరిశీలించే వారు. కొన్ని చోట్ల భూముల్లో కొలతలు వేస్తూ... మరికొన్ని చోట్ల ఇంటి నిర్మాణానికి అవసరమయిన వెంచర్లు వేస్తూ కనిపించేవారు. భూ యజమాని, రియల్టర్లు, బ్రోకర్లతో సందడిగా ఉండేది. లావాదేవీలు బాగా జరుగుతుండటంతో యజమాని నుంచి రియల్టర్లు అందరూ చెరగని చిరునవ్వుతో కనిపించేవారు. మరిప్పుడు.. కరోనా పుణ్యమా అని ఆ పరిస్థితి లేదు. రూ.కోట్లు పెట్టుబడి పెటి ్టన వారు గొల్లుమంటున్నారు. ఇది ఒక కడపకే పరిమితం కాలేదు. శరవేగంగా విస్తరిస్తున్న పులివెందుల, ప్రొద్దుటూరు, రాయచోటి, బద్వేలు, రాజంపేట పట్టణాల్లో రియల్టర్ల పరిస్థితి ఇలాగే ఉంది. మార్చిలో జిల్లాలో రూ.500 కోట్ల మేర రియల్‌ బిజినెస్‌ జరిగినట్లు చెబుతున్నారు. అయితే  కరోనా పుణ్యమా అని రియల్‌ ఢమాల్‌ అంది. అన్ని రంగాలు కుప్పకూలినట్లే రియల్‌ ఎస్టేట్‌ కూడా కుప్పకూలింది.  


జిల్లాలో ఎన్నికల ముందు నుంచి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగింది. బ్యాంకుల్లో నగదు డిపాజిట్‌, ఉప సంహరణపై అప్పట్లో ఆంక్షలు ఉండడం, బ్యాంకులపై కొన్ని రూమర్లు రావడంతో జనం డ బ్బులను రియల్‌ ఎస్టేట్‌ వైపు మళ్లించి  భూములు, నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టారు. దీంతో పాటు జగన్‌ సీఎం అవుతారన్న నమ్మకం కూడా రియల్‌ ఎస్టేట్‌కు ఊపిరిపోసింది. జగన్‌ సీఎం కావడంతో కడప, పులివెందుల, ప్రొద్దుటూరు, రాజంపేట, బద్వేలు లాంటి పట్టణాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగింది. కడప నగరంలో రిమ్స్‌ నుంచి రాయచోటి, పులివెందుల రోడ్డు వరకు ఇరువైపులా కోట్లాది రూపాయల వ్యాపారం సాగినట్లు చెబుతారు. కొప్పర్తి పారిశ్రామికవాడలో పరిశ్రమలు వస్తాయన్న నమ్మకంతో ఈ ప్రాంతంలో రియల్‌ బిజినెస్‌ ఎక్కడికో వెళ్లిపోయింది.


సెంటు రూ.5లక్షల చొప్పున ఎకరా రూ.4 నుంచి 5 కోట్ల మధ్య క్రయ వికయ్రాలు సాగినట్లు చెబుతారు. ఇక్కడే వంద కోట్లకు పైగానే లావాదేవీలు సాగినట్లు చెబుతారు. ఇక చలమారెడ్డిపల్లె నుంచి అలంఖాన్‌పల్లె రింగు రోడ్డు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వెంచర్లు వెలిశాయి. అక్కడ కూడా రూ.వంద కోట్లకు పైగానే లావాదేవీలు సాగాయి. కడప నగరంలోని వైజంక్షన్‌లో ౅సెంటు రూ.12 నుంచి రూ.18 లక్షల మధ్య ధర పలికింది. చిన్నచౌకులో రూ.12లక్షల ధర ఉండేది. కమర్షియల్‌ ఏరియా అయితే రూ.20 లక్షలు కూడా పలికినట్లు చెబుతారు. చౌటుపల్లెలో రూ.8 నుంచి రూ.10లక్షలు, విశ్వనాధపురంలో రూ.6 నుంచి 8 లక్షలు ధర పలికింది. వినాయక్‌నగర్‌లో ఎకరా రూ.5 నుంచి 6 కోట్లు ధర పలికింది. కడప ఆర్టీసీ బస్టాండు ప్రాంతంలోనే ఓ స్థలాన్ని ప్రొద్దుటూరుకు చెందిన వ్యాపారులు రూ.వంద కోట్లుకు పైగా వెచ్చించి కొనుగోలు చేశారు. ప్రొద్దుటూరుకు చెందిన రియల్టర్లు కడపలో ఎక్కువగా భములు కొనుగోలు చేసినట్లు చెబుతారు.


భూములు, నిర్మాణ రంగం మీద కడపలోనే దాదాపు రూ.250 కోట్లు మేర లావాదేవీలు సాగినట్లు రియల్టర్లు అంచనా వేస్తున్నారు. ప్రొద్దుటూరులో పెద్ద ఎత్తున రియల్‌ వ్యాపారం జరిగింది. అక్కడ కొందరు బంగారు వ్యాపారస్తులు రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడంతో ప్రొద్దుటూరు మున్సిపాలిటీతో పాటు శివారు ప్రాంతాల్లో వెంచర్లు, వ్యక్తిగత గృహాల నిర్మాణాలు ఊపందుకున్నాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలో  నిర్మించతలపెట్టిన ఉక్కుఫ్యాక్టరీ ప్రొద్దుటూరుకు 9 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో అది రియల్‌ ఎస్టేట్‌కు ప్రాణం పోసిందని చెబుతారు. అక్కడ రూ.వంద కోట్లకు పైగానే పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. జగన్‌ సీఎం కావడంతో పులివెందులలో రియల్‌ జోరందుకుంది. శివారు ప్రాంతాలు వెంచర్లు వెలిశాయి. ఇక్కడ రూ.50 నుంచి రూ.70 కోట్లకు పైబడి పెట్టుబడులు పెట్టినట్లు చెబుతారు. రాయచోటి, రాజంపేటలలో కూడా రూ.వంద కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. బద్వేలులోని నెల్లూరు రోడ్డులో భూముల కొనుగోలుపై రూ.70 కోట్లు, నిర్మాణ రంగానికి రూ.30 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు రియల్టర్లు చెబుతున్నారు. ఇలా రూ.500 కోట్లు పైనే జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టారు.  


రియల్టర్ల ఆందోళన

కరోనాతో రియల్‌ఎస్టేట్‌ ఢమాల్‌ అనడంతో రియల్టర్లు గొల్లుమంటున్నారు. ఏదైనా స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు యజమాని, రియల్టర్‌ మధ్య ఒప్పందం కుదురుతుంది. విలువలో నాలుగో వంతు యజమానికి చెల్లిస్తారు. కొనుగోలు చేసిన స్థలాన్ని వెంచర్‌ వేసి ఏడాదిలో విక్రయించేసి మిగతా సొమ్మును చెల్లించేలా అగ్రిమెంటు చేసుకుంటారు. అయితే కరోనా కారణంగా మూడు మాసాలుగా ఎలాంటి లావాదేవీలు లేవు. గడువులోపు డబ్బు చెల్లించాలంటూ యజమానులు వత్తిడి చేస్తే పరిస్థితి ఏమి టనిఆందోళన రియల్టర్లలో నెల కొంది. కొందరు అప్పులు చేసి కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు క్రయవిక్రయాలు లేకపోవడంతో వడ్డీలు ఎలా కట్టుకోవాలంటూ మొత్తుకుంటున్నారు. మొత్తానికి కరోనా కారణంగా రియల్‌ ఎస్టేట్‌ ఢమాల్‌ అయింది.

Updated Date - 2020-05-26T05:30:00+05:30 IST