యాసంగిలో వరి వద్దేవద్దు

ABN , First Publish Date - 2021-11-27T07:51:37+05:30 IST

అనుకున్నదే అయింది. తెలంగాణలో యాసంగి సీజన్‌లో వరి వేయొద్దని కేంద్రం మరోమారు స్పష్టం చేసింది.

యాసంగిలో వరి వద్దేవద్దు

  • కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ గట్టిగా చెప్పారు
  • యాసంగి సేకరణపై మాట్లాడొద్దని
  • రాష్ట్ర బీజేపీ నేతలకు సూచించామని చెప్పారు
  • 2 పంటలకు కలిపి సేకరణ లక్ష్యం సాధ్యం కాదన్నారు
  • వానాకాలం కోటా సేకరణనూ నిర్దిష్టంగా చెప్పలేదు
  • కేంద్రం నిరాశపరిచ్చింది: మంత్రి నిరంజన్‌ రెడ్డి 
  • గోయల్‌తో రాష్ట్ర మంత్రులు, 
  • టీఆర్‌ఎస్‌ ఎంపీల బృందం గంటకు పైగా చర్చలు
  • సీఎం కేసీఆర్‌తో మాట్లాడిన తర్వాత 
  • పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్పష్టీకరణ


న్యూఢిల్లీ, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): అనుకున్నదే అయింది. తెలంగాణలో యాసంగి సీజన్‌లో వరి వేయొద్దని కేంద్రం మరోమారు స్పష్టం చేసింది. కనీసం రెండు పంటలకు కలిపి వార్షిక సేకరణ లక్ష్యం ఖరారు చేస్తుందేమోనని ఆశిస్తే అదీ సాధ్యం కాదని తేల్చేసింది! బియ్యం సేకరణ విషయంలో ఎన్నో ఆశలతో రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎంపీల బృందం... కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో సమావేశమైనా నిరాశే ఎదురైంది. రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో వరి పంటను వేయనివ్వవద్దని కేంద్ర మంత్రి గోయల్‌ గట్టిగా చెప్పారని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి వెల్లడించారు. ఏడాదిలో రెండు పంటలకు సంబంధించి ఎన్ని వడ్లు తీసుకుంటారో చెప్పాలని గత సమావేశంలో కేసీఆర్‌ చేసిన వినతికి కూడా ఆశాజనకంగా సమాధానం రాలేదని పేర్కొన్నారు. కేసీఆర్‌ సూచన బాగుందని తాను ఇప్పటికీ నమ్ముతున్నానని చెబుతూనే.. ఏడాది మొత్తానికి అంచనాలు వేసి కొనుగోలు లక్ష్యాన్ని ఖరారు చేయడం సాధ్యం కాదని వ్యవసాయ శాఖ తెలిపిందని గోయల్‌ చెప్పారని వెల్లడించారు. రెండు పంటలకు సంబంధించి వార్షిక లక్ష్యాన్ని ఇవ్వలేకపోవడంతో పాటు వానాకాలం బియ్యాన్ని ఎంత మేర తీసుకుంటారో నిర్దిష్టంగా చెప్పడం లేదని నిరంజన్‌రెడ్డి వాపోయారు. 40 లక్షల టన్నుల మేర తీసుకుంటామని తొలుత చెప్పారని.. కానీ, దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని పేర్కొన్నారు. రెండు పంటలకు కలిపి దాదాపు 80-85 లక్షల టన్నుల బియ్యాన్ని తీసుకుంటామని గతంలో కేంద్రమంత్రి అన్నారని.. ఇప్పుడు దాటవేసే ధోరణిలో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎంత మేర తీసుకుంటారో చెప్పలేని దయనీయ స్థితిలో కేంద్రం ఉండడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు. 


బియ్యం సేకరణ అంశంమ్మీద శుక్రవారం రాత్రి ఢిల్లీలో కేంద్ర మంత్రితో రాష్ట్ర మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, మల్లారెడ్డి, మహమూద్‌ అలీ, ఎంపీలు నామా నాగేశ్వరరావు, కేఆర్‌ సురేశ్‌ రెడ్డి, బీబీ పాటిల్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ సమావేశమై గంటకుపైగా చర్చలు జరిపారు. అనంతరం నిరంజన్‌ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు తెలంగాణ రైతాంగ ప్రయోజనాల కోసం మరోసారి చర్చకు వచ్చామని, దురదృష్టవశాత్తు కేంద్రం నిరాశపరిచిందని తెలిపారు. రెండు నెలల క్రితం కేంద్ర మంత్రితో సీఎం కేసీఆర్‌ జరిపిన చర్చల కొనుసాగింపుగా అంతిమంగా సానుకూల నిర్ణయం వస్తుందని ఆశించామపి అన్నారు ఈ నెల 24న జరిగిన సమావేశంలో, ఇప్పడు ఆశాజనకమైన హా మీ ఇవ్వలేదని తెలిపారు. ‘‘యాసంగి కొనుగోళ్ల విషయమ్మీద మీవాళ్లే (బీజేపీ వాళ్లు)గందరగోళంగా మాట్లాడారు కదా’’ అని గోయల్‌ను తాము ప్రశ్నించగా.. ఆయన ‘‘వాళ్లు తెలిసో, తెలియకో మాట్లాడారు. అలా మాట్లాడొద్దని మేం సూచించాం. ఇప్పుడు అలా మాట్లాడటం లేదు’’ అని గోయల్‌ చెప్పారని వెల్లడించారు. త్వరలో ఓ కొత్త కమిటీని వేస్తామని, కొత్త చట్టాలు తీసుకొచ్చే విషయం, కనీస మద్దతు ధరలు, పంటల వైవిధ్యీకరణ వంటి అంశాలపై అది పనిచేస్తుందని గోయల్‌ అన్నారని చెప్పారు. కనీస మద్దతు ధరలు, వార్షక కొనుగోలు లక్ష్యాలపై అప్పుడు చెబుతామంటున్నారని తెలిపారు. కాగా ఈ భేటిపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని అన్నారు.

Updated Date - 2021-11-27T07:51:37+05:30 IST