Advertisement
Advertisement
Abn logo
Advertisement

కుటుంబాన్ని చిదిమేసిన ఇంటి నిర్మాణం

  • ఆస్తి తగాదాలతో భర్త ఆత్మహత్య
  • భార్య మనస్తాపం.. ఇద్దరు పిల్లలతో 
  • కలిసి చెరువులోకి దూకి ఆత్మహత్య
  • ఇంటి కొనుగోలు.. భారంగా అప్పులు
  • భూమి అమ్మాలనే ప్రతిపాదనను తండ్రి తిరస్కరించడమే కారణం! 


జోగిపేట/రామచంద్రాపురం, డిసెంబరు 3: వారు ఇద్దరు. వారికి ఇద్దరు పిల్లలు! భర్త సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఆనందంగా ఉన్న ఆ కుటుంబాన్ని తలకుమించి చేసిన అప్పులు.. ఇంటి పెద్దలతో నెలకొన్న ఆస్తి గొడవలు చిదిమేశాయి. ఇల్లు కొనేందుకు చేసిన అప్పు తీర్చడం భారమైతే, ఉమ్మడి ఆస్తిగా ఉన్న పొలాన్ని అమ్మి డబ్బు ఇవ్వాలని తండ్రిని అడిగితే కాదన్నాడనే మనస్తాపంతో భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా.. ఈ విషయం తెలిసి భార్య, తన ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులోకి దూకి బలవన్మరణానికి పాల్పడింది. సంగారెడ్డి జిల్లాలో ఈ విషాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మునిపల్లి మండలం గార్లపల్లికి చెందిన బాయికాడోల్ల చంద్రకాంత్‌ (35) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. పదేళ్ల క్రితం కామారెడ్డి జిల్లా చిట్యాలకు చెందిన లావణ్య (32)తో ఆయన వివాహమైంది. వీరికి కుమారుడు ప్రథమ్‌ (9), సర్వజ్ఞ (15నెలలు) ఉన్నారు.  ఈ కుటుంబం రామచంద్రాపురం మండం తెల్లాపూర్‌ మున్సిపాలిటీ బీహెచ్‌ఈఎల్‌ కొత్త ఎంఐజీ, విద్యుత్‌నగర్‌ ఫేజ్‌-2లో నివాసముంటోంది. 


ఇటీవల బీరంగూడలో ఓ ఇంటిని చంద్రకాంత్‌ కొన్నాడు. దాచుకున్న సొమ్ము సరిపోక తెలిసినవారి వద్ద అప్పు చేశారు. ఆ అప్పును తీర్చేందుకు స్వగ్రామమైన గార్లపల్లిలో ఉమ్మడి ఆస్తిలోని రెండెకరాల పొలం అమ్మి డబ్బు ఇవ్వాల్సిందిగా తండ్రి నాగేశ్వర్‌రావు(నాగోబారావు)ను కోరగా ఆయన నిరాకరించారు. కూతురు, అల్లుడి బాధ చూడలేక లావణ్య తండ్రి కొంత మొత్తాన్ని సర్దుబాటుచేశారు. వచ్చిన జీతమంతా సర్దుబాటు చేసినా అప్పులు తీరకపోవడంతో కుటుంబంలో గొడవలు జరుగుతుండేవి. గురువారం సాయంత్రం చంద్రకాంత్‌, తండ్రి నాగేశ్వర్‌రావు మధ్య మరోసారి గొడవ జరిగింది. ఆవేశంలో చంద్రకాంత్‌ గదిలోకి వెళ్లి తలుపువేసుకోగా, లావణ్య ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. పటాన్‌చెరు బస్టాండ్‌కు వచ్చిన లావణ్య తోటి ప్రయాణికుడి ఫోన్‌ నుంచి భర్త చంద్రకాంత్‌కు ఫోన్‌ చేయగా పక్కింటి వాళ్లు లిఫ్ట్‌ చేసి ఆయన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. తీవ్రంగా కలత చెందిన లావణ్య,  ఇద్దరు పిల్లలతో బస్సెక్కి అందోలులో దిగారు. చాలాసేపు బస్టాండ్‌ పక్కనే నాగులమ్మ గుడి వద్ద కూర్చుని రోదించిన ఆమె, చీకటిపడ్డాక తొలుత కూతురు, కొడుకును చెరువులోకి తోసేసి తాను కూడా దూకింది. శుక్రవారం ఉదయం చెరువులో మృతదేహాలు తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వారొచ్చి మృతదేహాలను జోగిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

Advertisement
Advertisement