కరోనా ఉగ్రరూపం

ABN , First Publish Date - 2020-05-26T05:30:00+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా మహమ్మారి మరోసారి ఉగ్రరూపం దాల్చింది.

కరోనా ఉగ్రరూపం

ఉమ్మడి జిల్లాలో 10 కేసులు నమోదు


ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌ / షాద్‌నగర్‌ : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా మహమ్మారి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. వారంరోజులు నుంచి ఒకటి రెండు కేసులు నమోదవుతుండగా.. సోమవారం మాత్రం అత్యధికంగా 10 మంది కరోనా బారిన పడ్డారు. మేడ్చల్‌ జిల్లాలో ఒక కేసు నమోదు కాగా రంగారెడ్డి జిల్లాలో 9 కేసులు నమోదయ్యాయి. షాద్‌నగర్‌కు చెందిన మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ నెల 22న పట్టణంలోని విజయ్‌నగర్‌ కాలనీకి చెందిన ఓ యువకునికి పాజిటివ్‌ వచ్చిన విషయం విధితమే. దీంతో వైద్య సిబ్బంది అతనికి సంబంధించిన 22మంది కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను కట్టడి కేంద్రానికి తరలించారు. అయితే ఆదివారం ఉదయం వారిలో షాద్‌నగర్‌ పట్టణంలోని ఈశ్వర్‌కాలనీకి చెందిన ఓ యువకునికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.


ఈ నేపథ్యంలో ఆ యువకునికి సంబంధించిన 11 మంది కుటుంబ సభ్యులను, బంధువులను వైద్యసిబ్బంది అదేరోజు సాయంత్రం కట్టడి కేంద్రానికి తరలించారు. అయితే సోమవారం సాయంత్రం వచ్చిన రిపోర్టులో ఈశ్వర్‌కాలనీకి చెందిన యువకుని తల్లి, తండ్రి, అన్నకు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. దీంతో షాద్‌నగర్‌లో మొత్తం కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి సంఖ్య ఐదుగురికి చేరింది. వీరంతా ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే శేరిలింగంపల్లి, కొండాపూర్‌, ఆర్‌కేపురంలో ఇద్దరు చొప్పున ఈ వ్యాధికి గురయ్యారు. దీంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 302 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 


11 మంది నుంచి నమూనాల సేకరణ

వికారాబాద్‌, ఆంధ్రజ్యోతి : వికారాబాద్‌ జిల్లాకు వచ్చి వెళ్లిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్‌ రావడం కలవరం రేపుతోంది. కులకచర్ల మండలం, బండి వెల్కిచర్లలో ఇటీవల నిర్వహించిన ఓ వేడుకకు హాజరైన రంగారెడ్డి జిల్లా, షాద్‌నగర్‌కు చెందిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో అధికారులు ఆ వేడుకకు హాజరైన వారిని గుర్తించి ముందు జాగ్రత్తగా హోంక్వారంటైన్‌ చేశారు. కాగా, బండివెల్కిచర్లలో జరిగిన వేడుకకు హాజరైన వారిలో సోమవారం వరకు గౌరారం, బండివెల్కిచర్ల, తాండూరుకు చెందిన 15 మంది నమూనాలు సేకరించి పరీక్షల కోసం పంపించారు. సోమవారం బండి వెల్కిచర్లలో 10 మంది నుంచి నమూనాలు సేకరించగా, తాండూరులో ఒకరి నుంచి నమూనాలు తీసుకున్నారు. బొంరా్‌సపేట్‌ మండలం, గౌరారం గ్రామానికి చెందిన నలుగురి నుంచి వైద్య సిబ్బంది ఆదివారం నమూనాలు సేకరించిన విషయం తెలిసిందే. ఈ నమూనాల ఫలితాలు రావడానికి మూడు, నాలుగు రోజులు పట్టవచ్చని వైద్యశాఖ అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-05-26T05:30:00+05:30 IST