కరోనా వలస

ABN , First Publish Date - 2020-05-25T09:09:07+05:30 IST

ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి తిరిగొస్తున్న కూలీలతో జిల్లాలో కరోనా విజృంభిస్తోంది.

కరోనా వలస

వలస కూలీలను వెంటాడుతున్న వైరస్‌

పుట్టపర్తి, ముదిగుబ్బ ప్రాంతాలలో అలజడి

హిందూపురంలో మరో రెండు కేసులు


అనంతపురం వైద్యం, మే 24 : ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి తిరిగొస్తున్న కూలీలతో జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే అధికారిక లెక్కల మేరకే 200 కేసులు దాటిపోయాయి. మరెన్నో ప్రకటించని కేసుల్లో బాధితులు ఆస్పత్రులో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆదివారం రాష్ట్రంలో 66 కరోనా కేసులు నమో దయ్యాయి. ఇందులో జిల్లాకు చెందినవారు కూడా ఉ న్నట్టు సమాచారం. ప్రధానంగా ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వలస కూలీలను వైరస్‌ వెంటాడుతోంది. ఇప్పటికే ఉరవకొండ, తనకల్లు, మడకశిర, గోరంట్ల, పుట్టపర్తి, పెనుకొండ ప్రాంతాల్లో పలువురు వలస కూలీలు కరోనా బారిన పడ్డారు. ఆదివారం పుట్టపర్తి మండలం పెడబల్లి తండాలో ముగ్గురు వలస కూలీలకు పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ముదిగుబ్బ మండలం ముక్తాపురంతండాలో ముంబై నుంచి వచ్చిన దంపతులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. వారిని కూడా ఆస్పత్రికి తరలించారు. హిందూపురంలో మరో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు చెబుతున్నారు. ఇంకా కొందరికి పాజి టివ్‌ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. కానీ అధికారులు వాటిపై స్పష్టత ఇవ్వడం లేదు.


ముగ్గురు వలస కూలీలకు పాజిటివ్‌ 

పుట్టర్తిరూరల్‌  :  ఉపాధి కోసం ఇతర ప్రాం తాలకు వెళ్లి తిరిగొచ్చిన ముగ్గురు కూలీలకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు స్పెషలాఫీసర్‌ డాక్టర్‌ రాము, వైద్యుడు నాగరాజు నాయక్‌ తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ నాలుగు రోజుల కిందట వలస కూలీలు ముంబై నుంచి ప్రత్యేక బస్సులో మండలానికి చేరుకున్నారు.  అప్పటి నుంచి వారిని పుట్టపర్తి క్వారంటైన్‌లో ఉంచి పరీక్షలు నిర్వహించగా, వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చిందన్నారు. పుట్టపర్తి మండలంలోని పెడపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వలస కూలీలు, బడేనాయాక్‌ తండాకు చెందిన వ్యక్తికి పాజిటవ్‌ రావడంతో వారిని అనంతపు రం తరలించారు. 


దంపతులకు...

ముదిగుబ్బ : ఇద్దరు వలస కూలీలకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తహసీల్దార్‌ అన్వర్‌హుస్సేన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 19న మహారాష్ట్ర నుంచి ముక్తాపురం తండాకు చెందిన వలస కూలీలైన భార్య, భర్తలు బాగేపల్లి చెక్‌పోస్టు వద్దకు రాగా పోలీసులు వారిని అడ్డుకుని ముదిగుబ్బకు చేర్చారు. ఇక్కడి నుంచి అనంతరం క్వారెంటైన్‌కు తరలించారు. వైద్యులు కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించగా, వారికి పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది.  వీరిని క్వారంటైన్‌ కు తరలించిన ఆటో డ్రైవర్‌, వారికి అల్పాహారం అందించిన ఇద్దరిని కూడా  క్వారంటైన్‌కు తరలించినట్టు తహసీల్దార్‌ పేర్కొన్నారు. 


గోరంట్లలో మరో వలసకూలీకి  ...

గోరంట్ల : పట్టణంలోని షిర్డీసాయి కాలనీకి చెందిన వలస కూలీకి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు డా.గిరిధర్‌ ఆదివారం తెలిపారు. నల్లమాడకు చెందిన వలస కూలీ దంపతులు ఈ నెల 18న గోరంట్లకు రాగా వారిని బీసీ హాస్టల్‌ క్వారంటైన్‌లో ఉంచారు.  కొవిడ్‌-19 పరీక్షల్లో తాజాగా వలసకూలీకి శనివారం రాత్రి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అధికారులు వెంటనే వలస కూలీని  ఎస్కే యూ కొవిడ్‌ కేర్‌సెంటర్‌కు తరలించారు. 


చీపులేటిలో మరో యువకుడికి ?

మడకశిర టౌన్‌ : మండలంలోని చీపులేటి  గ్రామం లో 17 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు సమాచారం.  ఆ యువకుడిని బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. దీంతో ఆయా ప్రాంతాల పరిధిలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు సైతం కంటైన్మెంట్‌ పరిధిలో కట్టుదిట్టంగా ఆంక్షలు కొనసాగిస్తున్నారు. స్థానిక క్వారంటైన్‌లో ప్రస్తుతం 33 మంది ఉన్నట్లు తహసీల్దార్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - 2020-05-25T09:09:07+05:30 IST