కరోనా కుంగదీసింది

ABN , First Publish Date - 2021-03-06T08:06:47+05:30 IST

కరోనా మహమ్మారి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక స్థితిపైనా ప్రతికూల ప్రభావం చూపుతోంది. ‘పాజిటివ్‌’ అని నిర్ధారణ అయ్యాక కొందరు.

కరోనా కుంగదీసింది

  • బాధితులను కలలోనూ వెంటాడుతున్న వైరస్‌ భయం
  • మానసిక రుగ్మతలతో ఎంతోమంది సతమతం
  • మహమ్మారి నుంచి కోలుకున్నా.. వీడని క్షోభ
  • ఆత్మన్యూనతతో పలువురి ఆత్మహత్యాయత్నాలు? 
  • భవిష్యత్‌పై ఆందోళనతో మానసిక సంఘర్షణలు
  • రోగులు, వైద్య సిబ్బందిపై గాంధీ ఆస్పత్రి 
  • సైకియాట్రిస్టు, డాక్టర్‌ అజయ్‌ సర్వే


కరోనాతో గత జూలైలో గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందిన ఓ మహిళ డిశ్చార్జి అయి ఇంటికి చేరింది. మరుసటి రోజు నుంచే ఆమె చిత్ర, విచిత్రంగా ప్రవర్తించసాగింది. తనను ఎవరో చంపడానికి వస్తున్నారని ఇంటి తలుపులు మూసేసింది. వెంటనే అక్కడ ఉన్న వాషింగ్‌ మెషీన్‌ మూత తీసి అందులో కూర్చుంది. పక్క గదిలో ఉన్న భర్త ఆ అరుపులకు బయటకు వచ్చి చూసేసరికి, ఆమె వాషింగ్‌ మెషీన్‌లో కనిపించింది. ఇలా తరచూ చేస్తుండడంతో భయపడిన ఆమె భర్త వెంటనే డాక్టర్‌కు ఫోన్‌ చేసి పరిస్థితిని వివరించారు. ఇంటికి వెళ్లిన డాక్టర్‌ ఆమె మానసిక, ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. కరోనా సోకకముందు.. ఆమె ప్రయాణించిన వాహన డ్రైవర్‌ కరోనాతో చనిపోయాడు. అతడి వల్లే తనకు కరోనా వచ్చిందని, అతడొచ్చి తనను చంపేస్తాడని పదే పదే ఆలోచించి మానసిక వ్యథకు లోనైనట్లు డాక్టర్‌ గుర్తించారు. సైకోసిస్‌ డిజార్డర్‌ సమస్యతో ఆమె ఈ రకంగా వ్యవహరిస్తోందనే నిర్ధారణకు వచ్చి తగిన మోతాదులో మందులు ఇచ్చి చికిత్స చేశారు. 


హైదరాబాద్‌ సిటీ, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక స్థితిపైనా ప్రతికూల ప్రభావం చూపుతోంది. ‘పాజిటివ్‌’ అని నిర్ధారణ అయ్యాక కొందరు.. ఆస్పత్రుల్లో చికిత్సతో కోలుకొని ఇళ్లకు తిరిగి వెళ్లాక ఇంకొందరు మానసిక రుగ్మతలను ఎదుర్కొన్నారు. తమలో తాము కుమిలిపోవడం, ఒంటరిగా మిగిలిపోయాననే ఆత్మన్యూనతా భావన, తన నుంచి కుటుంబ సభ్యులకూ వైరస్‌ సోకుతుందనే ఆందోళన, సమాజంలో చిన్నచూపు చూస్తారనే ఆవేదన, చనిపోతానేమో అనే భయాలు ఎంతోమందిని పీడ కలలా వెంటాడాయి. రాష్ట్రంలో ఈ తరహా ఇబ్బందులు ఎదుర్కొన్న వారు భారీ సంఖ్యలోనే ఉంటారని గాంధీ ఆస్పత్రి సైకియాట్రిస్టు, డాక్టర్‌ అజయ్‌ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది. రోగులతో పాటు వారికి చికిత్స అందించే క్రమంలో ఒత్తిడితో నలిగిపోయిన వైద్యులు, నర్సులు, స్వీపర్లు, ఇతర సిబ్బందిని కూడా నాలుగు దఫాలుగా వేర్వేరుగా సర్వే చేశారు. తద్వారా మానసికంగా దెబ్బతిన్న వారిని గుర్తించి కౌన్సెలింగ్‌ చేసి, తగిన చికిత్సలు అందించి ఆరోగ్యాన్ని మెరుగుపర్చారు. సర్వే వివరాలతో ప్రత్యేక కథనమిది.. 


18 ప్రశ్నలతో రోగుల సర్వే.. 

గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందిన 800 మంది కరోనా రోగులపై తొలి విడత అధ్యయనం నిర్వహించారు. 18 ప్రశ్నలతో రూపొందించిన ప్రశ్నావళికి డాక్ట ర్‌ అజయ్‌ రోగుల నుంచి సమాధానాలు సేకరించారు. కరోనా సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయాలపై ఆరా తీశారు. ఎలాంటి ఆందోళన ఎదురవుతోంది? ఎటువంటి భయాలు పీడిస్తున్నాయి? కుంగిపోయినట్లు అనిపిస్తోందా? మానసిక స్థితి ఎలా ఉంది ? ఇతర విషయాలపై ఆసక్తి తగ్గిందా? పెరిగిందా ? ఎనర్జీ ఏ స్థాయిలో ఉంది ? నిద్ర వస్తోందా ? అర్థరాత్రి అకస్మాత్తుగా మెలకువ వస్తోందా ? ఏదీ తినాలని అనిపించడం లేదా ? ఇలా వివిధ ప్రశ్నలతో రోగులను సర్వే చేశారు. సర్వే చేసిన 800 మంది కరోనా రోగుల్లో 400 నుంచి 480 మంది రకరకాల మానసిక రుగ్మతలతో కుంగిపోతున్నట్లు గుర్తించారు. ఈవిధమైన సమస్య కారణంగా ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన వల్ల కుటుంబ సభ్యులకు, భార్యాపిల్లలకు కరోనా సోకిందేమోననే ఆందోళనతో ఆయన ప్రాణాలను తీసుకోవాలని భావించాడు. అందుకోసం నిద్రమాత్రలు కూడా తెచ్చుకున్నాడు. ఒకసారి డాక్టర్‌తో మాట్లాడదామని భావించి, వెంటనే గాంధీ ఆస్పత్రి డాక్టర్‌ అజయ్‌కు ఫోన్‌ చేశాడు. ‘‘నాకు లక్షణాలు బయటపడని కరోనా ఇన్ఫెక్షన్‌ ఉంది. ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తోంది’’ అని చెప్పాడు. అప్పటి నిబంధనల ప్రకారం ఆ తరహా లక్షణాలు కలిగిన వారిని ఆస్పత్రిలో చేర్చుకునే పరిస్థితి లేదు. 


కానీ వైద్యాధికారులతో డాక్టర్‌  మాట్లాడి ప్రత్యేక కేసుగా పరిగణించి గాంధీలో చేర్చుకున్నారు. 10 నుంచి 15 రోజుల పాటు చికిత్సలు అందించి మానసిక ఆందోళనను అధిగమించేలా చేసి ఇంటికి పంపించారు. ఈ సర్వేలో పాల్గొన్న ప్రతి వంద మందిలో 50 నుంచి 60 మంది యాంగ్జయిటీతో సతమతమైనట్లు తేలింది. మరో 20 శాతం మంది డిప్రెషన్‌తో ఇబ్బంది పడ్డారు. 10 శాతం మంది ఆల్కహాల్‌ విత్‌ డ్రాయల్‌ సిండ్రోమ్‌తో ఇబ్బంది పడ్డారు. రెండు శాతం మంది సైకోసి్‌సతో సతమతమయ్యారు. మరో ఎనిమిది శాతం మంది ఇతరత్రా మానసిక సమస్యలను ఎదుర్కొన్నారు. కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయిన వారిని టెలీఫోన్‌ సర్వే చేశారు. కరోనా తగ్గి, ఇంట్లో ఉంటున్న సమయంలో వారి ప్రవర్తన, మానసిక స్థితులు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు డాక్టర్‌ అజయ్‌ చెప్పారు. డిశ్చార్జి అయిన దాదాపు వెయ్యి మందిపై ఈ స్డడీ నిర్వహించారు. 400 నుంచి 500 మంది పోస్ట్‌ ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌ (పీటీఎ్‌సడీ)తో బాధపడుతున్నట్లు గుర్తించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందిన రోజులను గుర్తుకు తెచ్చుకొని బాధపడటం, ఒంటరిగా మిగిలామనే భావనతో ఆందోళన చెందడం వంటి మానసిక సమస్యలను వారు ఎదుర్కొంటున్నట్లు వెల్లడైంది. ఎవరో తమను చంపుతున్నారనే భావన కలగడం, తామే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అనిపించడం, వింతవింతగా ప్రవర్తించడం వంటి అంశాలను పీటీఎ్‌సడీ బాధితుల్లో గుర్తించారు. వీటి ఆధారంగా చాలామంది సైకోసిస్‌ డిజార్డర్‌ను ఎదుర్కొంటున్నట్లు నిర్ధారించారు.  


వైద్య సిబ్బందిని వెంటాడిన ఒత్తిడి 

ఆస్పత్రిలో కరోనా రోగులకు వైద్యసేవలు అందిస్తున్న డాక్టర్లు, హౌస్‌ సర్జన్లు, పీజీ విద్యార్థులను కూడా సర్వే చేశారు. 670 మంది ఆస్పత్రి సిబ్బందిని ఎంపిక చేసి, 18 ప్రశ్నలు అడిగి వారి మానసిక, శారీరక, ఆరోగ్య స్థితిగతుల గురించి తెలుసుకున్నారు. కరోనా రోగికి చికిత్స అందించే సమయంలో ఎలాంటి మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు? పడుకునే సమయంలో పూర్తిస్థాయిలో నిద్రపోతున్నారా? మధ్యలో మెలకువ వస్తోందా? తదితర అంశాలతో వారి వద్ద నుంచి సమాచారం సేకరించారు. దాన్ని విశ్లేషించగా.. వైద్యుల్లో 335 మంది అక్యూట్‌ స్ట్రెస్‌ రియాక్షన్‌ (ఏఎ్‌సఆర్‌)ను ఎదుర్కొంటున్నట్లు వెల్లడైంది. రోగులకు ఎలాంటి చికిత్స అందించాలి?  వారు ఏ మేరకు సహకరిస్తారు?  మాకు వైరస్‌ వస్తే పరిస్థితి ఏమిటి? ఎంత ధైర్యం చేసి ముందుకు వెళ్లినా కరోనాను ఎదుర్కోవడం సులభమేనా ? వంటి ఒత్తిళ్లతో వైద్యసిబ్బంది తీవ్ర మానసిక క్షోభకు గురైనట్లు గుర్తించారు. వీరిలో చాలామంది నిద్రపోకుండా అవే భయాలు, ఆందోళనలతో రోజులు గడిపినట్లు గుర్తించారు. లక్షణాలు బయటపడని కరోనా ఇన్ఫెక్షన్‌ సోకడంతో ఓ పీజీ వైద్య విద్యార్థినికి చికిత్స అందించి రెండు, మూడు రోజుల తర్వాత డిశ్చార్జి చేశారు. అయితే ఈవిషయం ఆమె ఉండే అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడికి తెలియడంతో వెంటనే ఫ్లాట్‌ ఖాళీచేసి వెళ్లిపోవాలన్నాడు. ఈ స్థితిలో ఇంటికి తిరిగి వెళ్దామనుకున్నా.. తల్లిదండ్రులకు కరోనా అంటుకుంటుందేమోనని భయపడింది. ఇంటికి వెళ్లలేక, అపార్ట్‌మెంట్‌లో ఉండలేక ఆమె అనుభవించిన మానసిక ఒత్తిడి కారణంగా ‘యాంగ్జయిటీ సూసైడ్‌’ ఆలోచనలు వచ్చా యి. వైద్యాధికారులు అపార్ట్‌మెంట్‌ అధ్యక్షుడితో మాట్లాడి ఫ్లాట్‌లో ఉండేందుకు అనుమతి ఇప్పించారు. పది రోజుల పాటు తక్కువ మోతాదులో మందులిచ్చి ఆమెలోని యాంగ్జయిటీ, ఒత్తిడిని తగ్గించారు. 


400 మంది స్వీపర్లు, నర్సులు..

కరోనా చికిత్స అందించే ఆస్పత్రుల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులు, నర్సులు, ఆయాలు, ఇతర సిబ్బందిపై మరో అధ్యయనం నిర్వహించారు. దాదాపు 400 మందిని ఎంపిక చేసి వారి మానసిక స్థితులను అంచనా వేశారు. స్వీపర్ల కంటే నర్సులు ఎక్కువగా మానసిక స్థైర్యంతో ఉన్నట్లు గుర్తించారు. చాలా మంది స్వీపర్లు కుంగుబాటు బారినపడ్డారు. కొందరిలో యాంగ్జయిటీ వల్ల మధుమేహం, బీపీ, ఇతర జబ్బులు పెరిగాయి. నర్సులు 20 శాతం మంది, 60 శాతం మంది పారిశుధ్య కార్మికులు, మరో 20 శాతం మంది ఆయాలు మానసిక రుగ్మతలను ఎదుర్కొన్నారు. 

 హైదరాబాద్‌ సిటీ


బిహేవియర్‌ థెరపీతో చెక్‌

కరోనా రోగులకు కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ చేసి, వారి ఆలోచన విధానాన్ని మార్చే ప్రయత్నాలు చేశాం. తీవ్ర మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న పాజిటివ్‌ల వద్దకు వెళ్లి కౌన్సెలింగ్‌ ఇచ్చాం. కోపం, చిరాకు, ఆగ్రహం నివారించడానికి ‘కోపింగ్‌ మెకానిజం’ నేర్పించాం. మానసికి స్థితిని నియంత్రణలో ఉంచుకోవడానికి మైండ్‌ టెక్నిక్‌ను వారిలో అభివృద్ధి చేశాం. ఆస్పత్రిలో 24 గంటల పాటు కరోనా రోగుల మానసిక సమస్యలు తెలుసుకునేందుకు సైకియాట్రిక్‌ మొబైల్‌ సదుపాయం కల్పించాం. వార్డులో ఎవరైనా మానసిక ఇబ్బందులతో బాధపడుతుంటుంటే.. డ్యూటీ డాక్టర్‌ గమనించి మొబైల్‌ ద్వారా మాకు సమాచారమిస్తే వారికి మేం కౌన్సెలింగ్‌ ఇచ్చి, చికిత్స చేశాం. 

డాక్టర్‌ అజయ్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, 

సైకియాట్రిక్‌ విభాగం, గాంధీ ఆస్పత్రి

Updated Date - 2021-03-06T08:06:47+05:30 IST