గుప్పుమంటున్న గుడుంబా

ABN , First Publish Date - 2020-05-11T10:24:18+05:30 IST

కరోనా వైరస్‌ నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌తో దాదాపు నెలన్నరకు పైగా మద్యం అమ్మకాలకు బ్రేక్‌ పడింది.

గుప్పుమంటున్న గుడుంబా

యథేచ్ఛగా బెల్లం, స్పటిక అమ్మకాలు

కిక్కు కోసం రసాయనిక పదార్థాలు

లాక్‌డౌన్‌తో మళ్లీ మొదలైన చీకటి దందా


మంథని, మే 10: కరోనా వైరస్‌ నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌తో దాదాపు నెలన్నరకు పైగా మద్యం అమ్మకాలకు బ్రేక్‌ పడింది. దీంతో పెద్దపల్లి జిల్లాలో మళ్లీ గుడుంబా దందా ఊపందుకుంది. జిల్లాల్లోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్‌, రామగుండం, అంతర్గాం, పాలకుర్తి, ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌, ఎలిగేడు, ధర్మారం, జూలపల్లి, పెద్దపల్లి, సుల్తానాబాద్‌ మండలాల్లోని పలు గ్రామాలు గుడుంబా తయారీ, అమ్మకాలు నెలరోజులుగా కొనసాగుతున్నాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం గుడుంబా అమ్మకాలపై ఎక్సైజ్‌, పోలీసుల శాఖల ద్వారా ఉక్కుపాదం మోపడంతో చాలా వరకు గుడుంబా అమ్మకాలు నిలిచిపోయాయి. దీంతో దాదాపు మూడేళ్ళకు పైగా జిల్లాలో గుడుంబా తయారీ, అమ్మకాలు చాలావరకు నిలిచిపోయాయి.


అయితే లాక్‌డౌన్‌తో మద్యం షాపులు చాలా రోజులు మూసివేయడంతో, అత్యధిక ధరలకు మద్యం బాటీళ్లను బ్లాక్‌ అమ్మకాలు కొనసాగిస్తుండటంతో మళ్లీ గుడుంబా తయారీ, అమ్మకాలకు డిమాండ్‌ పెరిగింది. దీంతో గతంలో గుడుంబా దందా చేసిన వారు రంగలోకి దిగడంతో పల్లెల్లో నెల రోజులుగా గుడుంబా బట్టీలు కాగుతున్నాయి. మద్యం ప్రియుల్లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కొందరు గుడుంబా బట్టీలు పెట్టి నాటుసారాను తయారు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా, వివిధ మండల కేంద్రాల్లోని పలు కిరాణా షాపుల్లో వ్యాపారులు యథేచ్ఛగా బెల్లం, స్పటిక, జీడిగింజలను విక్రయిస్తున్నారు. వీటిని గుడుంబా కాచేవారు కొనుగోలు చేస్తూ ఆటోలు, టూవీల్లర్ల ద్వారా గ్రామాల శివారులోని గుడుంబా తయారీ బట్టీల వద్దకు తరలిస్తున్నారు. వీటితోపాటు, కుళ్లిపోయిన వివిధ రకాల పండ్లు, తక్కువ సరుకుతో ఎక్కువ క్కిక్‌ రావడం కోసం వివిధ రకాల రసాయనిక పదార్థాలను గుడుంబా తయారీలో వాడుతున్నారు. ఇలాంటి విషతుల్యమైన గుడుంబాను సేవించడం ద్వారా పేదల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. తయారైన గుడుంబాను ప్యాకెట్లు, సీసాల్లో నింపి ద్విచక్ర వాహనాలపై ఆయా గ్రామాల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రిరాత్రే గుడుంబా తయారీ, ఇతర గ్రామాలకు తరలింపు, ముడిసరుకు రవాణా అన్నీ జరిగిపోతున్నాయి. దాదాపు 150 గ్రాముల గుడుంబా ప్యాకెట్‌ను రూ.50 విక్రయిస్తున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్‌, పోలీసు శాఖల జిల్లా అధికారులు స్పందించి గుడుంబా తయారీ, విక్రయాలతో పాటు బెల్టుషాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. 


Updated Date - 2020-05-11T10:24:18+05:30 IST