పరిషత పోరు ప్రశాంతం

ABN , First Publish Date - 2021-04-09T06:22:23+05:30 IST

జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కేవలం 26 మండలాల్లో జరిగాయి. 50 జడ్పీటీసీ స్థానాలకుగానూ 38 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 12 మండలాల జడ్పీటీసీ సభ్యుల ఎన్నిక కోసం బుధవారం పోలింగ్‌ జరిగింది.

పరిషత పోరు ప్రశాంతం
బద్వేలులో ఓటేసేందుకు బారులు తీరిన ఓటర్లు

పలు గ్రామాల్లో టీడీపీ ఏజెంట్లను అడ్డుకున్న వైసీపీ నాయకులు

దొంగ ఓట్లు వేశారని ముద్దనూరులో వాగ్వాదం

63.59 శాతం పోలింగ్‌ నమోదు

ఓటు హక్కు వినియోగించుకున్న 3,05,074 మంది ఓటర్లు

అత్యల్పంగా పోరుమామిళ్ల మండలంలో 39.50 శాతం పోలింగ్‌

నందలూరు మండలంలో అత్యధికంగా 80.61 శాతం ఓటింగ్‌

పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే భారీగా తగ్గుదల

ఎండలు కూడా ఓ కారణం

ప్రశాంత పోలింగ్‌తో ఊపిరి పీల్చుకున్న జిల్లా యంత్రాంగం


పరిషత పోరు ప్రశాంతంగా ముగిసింది. ఉదయం పలు గ్రామాల్లో టీడీపీ ఏజెంట్లను అధికార వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. చివరకు పోలీసుల జోక్యంతో ఏజెంట్లు కూర్చున్నారు. 12 జడ్పీటీసీ, 117 ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఉదయం 7.00 గంటలకు పోలింగ్‌ మొదలైంది. బుధవారం సాయంత్రం వరకు పోలింగ్‌ ఉంటుందా..? వాయిదా పడుతుందా..? అనే సందిగ్ధత ఉండడంతో ఆ ప్రభావం పోలింగ్‌పై పడింది. దీంతో పోలింగ్‌ మందకొడిగా మొదలైంది. మొత్తంగా 63.59 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే పరిషత పోరులో 19.41 శాతం పోలింగ్‌ తగ్గింది. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కేవలం 26 మండలాల్లో జరిగాయి. 50 జడ్పీటీసీ స్థానాలకుగానూ 38 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 12 మండలాల జడ్పీటీసీ సభ్యుల ఎన్నిక కోసం బుధవారం పోలింగ్‌ జరిగింది. అలాగే 554 ఎంపీటీసీ స్థానాలు ఉంటే 432 ఏకగ్రీవం అయ్యాయి. కోర్టు వివాదం, బీజేపీ అభ్యర్థి మృతి చెందడం వంటి కారణాలతో 5 స్థానాలకు ఎన్నికలు జరగలేదు. 117 ఎంపీటీసీ స్థానాలకు ఉదయం 7.00 గంటలకు పోలింగ్‌ మొదలైంది. పంచాయతీ ఎన్నకల సమయంలో తెల్లారగానే పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు బారులుతీరితే.. పరిషత ఎన్నికలు అందుకు పూర్తి భిన్నంగా జరిగాయి. ఉదయం 10 గంటలకు కేవలం 10.58 శాతం ఓటర్లే ఓటు వేశారు. అప్పటికైనా వరుసలో ఉన్నారా అంటే అదీలేదు. ఒక్కొక్కరుగా వచ్చి ఓటు వేసి వెళ్లారు. సాయంత్రానికి 63.59 శాతం మంది ఓటర్లు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం ఓటర్లు 4,79,752 ఉంటే.. 3,05,074 మంది ఓటు వేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన నిబంధనల ప్రకారం వసతులు కల్పించారు. అత్యధికంగా నందలూరు మండలంలో 26,682 ఓటర్లకు 21,509 మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో అక్కడ 80.61 శాతం పోలింగ్‌ నమోదైంది. అలాగే.. పోరుమామిళ్ల మండలంలో 47,198 మంది ఓటర్లకు గానూ కేవలం 8,642 ఓటర్లే పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. అత్యల్పంగా 39.50 శాతం పోలింగ్‌ నమోదు అయింది. ఇక్కడి టీడీపీ అభ్యర్థి బరిలో లేకపోవడం, ఆ పార్టీ ఎన్నికలను బహిష్కరించడంతో పోలింగ్‌ భారీగా తగ్గిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల బందోబస్తును ఎస్పీ కేకేఎన అన్బురాజన పరిశీలించారు.


టీడీపీ ఏజెంట్లను అడ్డుకున్న వైనం

బద్వేలు మండలం కొంగలవీడు పంచాయతీ మజరా గ్రామం ఉప్పత్తివారిపల్లెలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి శిరీషారెడ్డి ఏజెంట్ల సంతకాలను ఫోర్జరీ చేసి వైసీపీ కార్యకర్తలే టీడీపీ ఏజెంట్లుగా కూర్చుకున్నారు. అసలైన టీడీపీ ఏజెంట్లు వెళితే పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో అక్కడే అభ్యర్థి శిరీషా అక్కడ ధర్నాకు కూర్చుకున్నారు. పోలింగ్‌ ఆఫీసరు జోక్యం చేసుకొని టీడీపీ ఏజెంట్లుగా వచ్చిన వైసీపీ కార్యకర్తలను బయటకు పంపించి టీడీపీ ఏజెంట్లను అనుమతించడంతో వివాదం సద్దుమణిగింది. చాపాడు మండలం రాజువారిపేటలో టీడీపీ ఏజెంట్లను వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. మరో గ్రామ ఓటరు ఇక్కడ ఎలా కూర్చుకుంటారని అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరికి అభ్యర్థి రాజేశ్వరమ్మనే ఏజెంటుగా కూర్చుంటానన్నా ఒప్పుకోలేదు. పోలీసులు, పోలింగ్‌ అధికారి కూడా వైసీపీ నాయకులకే వంతపాడారు. చివరికి డీఎస్పీ జోక్యంతో టీడీపీ ఏజెంట్లు కూర్చుకున్నారు. మండల కేంద్రం ముద్దనూరు జిల్లా పరిషత ఉన్నత పాఠశాల పోలింగ్‌ కేంద్రం-21లో వైసీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేస్తున్నారని స్వతంత్ర అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి ప్రశాంతమైంది. రైల్వేకోడూరు మండలం మైసూరువారిపల్లిలో ప్రతిపక్షాల ఓటర్లను పోలింగ్‌ కేంద్రానికి వెళ్లకుండా వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారని, అందరనీ పోలింగ్‌ కేంద్రానికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలంటూ జనసేన నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.


ఎన్నికలు బహిష్కరించిన సుగుమంచిపల్లి ఓటర్లు

కొండాపురం మండలం సుగుమంచిపల్లి ఎంపీటీసీ-1, 2 స్థానాల పరిధిలో సుగుమంచిపల్లి, దత్తాపురం, బుక్కపట్నం.. ఇవి మూడు వేరువేరు పంచాయతీలు.  గండికోట జలాశయంలో దత్తాపురం, బుక్కపట్నంతో పంచాయతీల్లోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. దీంతో వీరికోసం ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీలను సుగుమంచిపల్లి పంచాయతీ పరిధిలో నిర్మించారు. అయితే తమ గ్రామాలను పాత పంచాయతీలుగా ఉంచాలనే డిమాండ్‌తో పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. ఎంపీటీసీకి అభ్యర్థులు పోటీలో పెట్టలేదు. ఇక్కడ జరగాల్సిన జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించి నిరసన తెలిపారు. దీంతో ఈ పోలింగ్‌ కేంద్రంలో ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు.


పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే తగ్గిన పోలింగ్‌ శాతం

పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే పరిషత పోలింగ్‌ శాతం గణనీయంగా తగ్గింది. పంచాయతీ తొలి విడతలో 77.31 శాతం పోలింగ్‌ జరిగితే.. తుది విడతలో 85.13 శాతం ఓటింగ్‌ జరిగింది. సగటున 83 శాతం పోలింగ్‌ జరిగిందని అధికారులు తెలిపారు. అయితే.. గురువారం జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 63.59 శాతం ఓటర్లే ఓటు వేశారు. అంటే.. 19.41 శాతం పోలింగ్‌ తగ్గింది. ప్రధానంగా పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు గ్రామాల్లో ఆశించిన ప్రాధాన్యత లేకపోవడం, ప్రత్యేక అధికారాలు లేకపోవడంతో అభ్యర్థులు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. దీనికితోడు మండుతున్న ఎండలు కూడా పోలింగ్‌ తగ్గడానికి కారణమని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు.. ఎన్నికలపై హైకోర్టు సింగిల్‌ బెంచ స్టే ఇవ్వడం, ఆ తీర్పుపై ప్రభుత్వం త్రిసభ్య బెంచికి వెళ్లడంతో బుధవారం సాయంత్రం వరకు కూడా ఎన్నికలు జరుగుతాయా..? అన్న సందిగ్ధత నెలకొంది. దీంతో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు ఆశించిన స్థాయిలో డబ్బులు పంచకపోవడం, టీడీపీ ఎన్నికలను బహిష్కరించడంతో పలువురు ఆ పార్టీ అభిమానులు ఓటింగ్‌కు దూరంగా ఉండడం కూడా పోలింగ్‌ శాతం తగ్గడానికి కారణమైందని అంటున్నారు.


మండలాల వారీగా పోలైన ఓట్లు

----------------------------------------------------------------

మండలం మొత్తం పోలైన శాతం

ఓట్లు ఓట్లు

----------------------------------------------------------------

బద్వేలు 16,352 10,898 66.65

గోపావరం 14,516 10,058 69.29

పోరుమామిళ్ల 47,198 18,642 39.50

జమ్మలమడుగు 23,648 18,281 77.30

కొండాపురం 35,631 19,631 55.10

ముద్దనూరు 26,091 19,063 73.06

మైలవరం 32,250 25,529 79.16

పెద్దముడియం 25,044 18,804 75.08

చిట్వేలి 32,595 21,420 65.72

రైల్వే కోడూరు 58,211 32.976 56.65

పెనగలూరు 28,463 18.281 64.23

నందలూరు 26,682 21.509 80.61

అట్లూరు 2,606 1,151 44.17

కలసపాడు 13,756 8,729 63.46

ఎర్రగుంట్ల 11,271 6,928 61.47

కమలాపురం 4,614 2,465 53.42

పెండ్లిమర్రి 1,828 983 53.77

వల్లూరు 1,348 638 47.33

బి.మఠం 3,468 2,163 62.37

చాపాడు 7,324 5,582 76.22

దువ్వూరు 7,341 5,199 70.82

ఖాజీపేట 7,189 4,967 69.09

ప్రొద్దుటూరు 22,378 13,594 60.75

రాజుపాలెం 11,281 7,142 63.31

రాజంపేట 17,704 9,719 54.90

లక్కిరెడ్డిపల్లి 963 722 74.97

-------------------------------------------------------------------

మొత్తం 4,79,752 3,05,074 63.59

-------------------------------------------------------------------



Updated Date - 2021-04-09T06:22:23+05:30 IST