కరోనాతో కొడుకు మృతి.. 16 నెలల బిడ్డతో ఇంట్లోనే ఉండిపోయిన కోడలు.. తాజాగా ఆ అత్తమామలు చేసిన పనికి..

ABN , First Publish Date - 2021-12-04T19:38:00+05:30 IST

కొడుకు చనిపోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న ఆ వృద్ధ తల్లిదండ్రులు తమ గొప్ప మనసును చాటుకున్నారు.

కరోనాతో కొడుకు మృతి.. 16 నెలల బిడ్డతో ఇంట్లోనే ఉండిపోయిన కోడలు.. తాజాగా ఆ అత్తమామలు చేసిన పనికి..

కొడుకు చనిపోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న ఆ వృద్ధ తల్లిదండ్రులు తమ గొప్ప మనసును చాటుకున్నారు. కొడుకును పెళ్లి చేసుకుని మూడేళ్ల కిందట తమ ఇంట్లోకి ప్రవేశించిన కోడలికి తల్లిదండ్రులుగా మారారు. భర్తను కోల్పోయి 16 నెలల బిడ్డతో ఇంట్లో ఉన్న ఆమెకు మళ్లీ పెళ్లి చేశారు. ఆమెను తమ కూతురిలా మార్చుకుని తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. రాజస్థాన్‌లోని సికార్ జిల్లాకు చెందిన ఆ ఇద్దరూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. 


సికార్‌కు చెందిన ఓంప్రకాశ్, అభా దంపతులకు విశాల్ ఒక్కడే కొడుకు. మూడేళ్ల క్రితం కిరణ్ అనే మహిళను వివాహం చేసుకున్న అతనికి ఓ కూతురు ఉంది. 2020లో కరోనాకు గురైన విశాల్ అదే ఏడాది మే నెలలో చనిపోయాడు. దీంతో అందరూ విషాదంలో కూరుకుపోయారు. కొడుకు పోయాడనే బాధ నుంచి కోలుకున్న తల్లిదండ్రులు కోడలి గురించి ఆలోచించారు. 16 నెలల బిడ్డతో ఒంటరి అయిపోయిన కోడలికి మళ్లీ పెళ్లి చేయాలనుకున్నారు. అరుణ్ కుమార్‌ అనే యువకుడితో పెళ్లి నిశ్చయించారు. 


కోడలికి తల్లిదండ్రులుగా మారి వారిద్దరూ దగ్గరుండి పెళ్లి జరిపించారు. గురువారం ఈ పెళ్లి జరిగింది. కూతురికి ఇచ్చినట్టే బహుమతులు కూడా ఇచ్చారు. అంతేకాదు నూతన దంపతులిద్దరినీ తమతో పాటే తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. ఆ వృద్ధ దంపతులు చేసిన పనిని ఎంతో మంది ప్రశంసిస్తున్నారు. తమ పెద్ద మనసుతో వీరు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. 

Updated Date - 2021-12-04T19:38:00+05:30 IST