మళ్లీ మొదటికే!

ABN , First Publish Date - 2021-09-12T05:43:54+05:30 IST

ఇంటర్‌ అడ్మిషన్ల ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. ఆన్‌లైన్‌ అడ్మిషన్లను కోర్టు రద్దు చేసింది. పాత పద్ధతిలోనే చేపట్టాలని సూచించింది. ఇప్పటికే వేలాది మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అడ్మిషన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కోర్టు తీర్పుతో నచ్చిన కాలేజీలో విద్యార్థులు చేరవచ్చు. అయితే దీనిపై ఎటువంటి ఆదేశాలు రాలేదని ఇంటర్‌ బోర్టు జిల్లా అధికారులు చెబుతున్నారు. గత రెండేళ్లుగా ప్రభుత్వం, ఇంటర్‌ బోర్డు అస్పష్ట విధానాలతో విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు. గత ఏడాది ఇదే పరిస్థితి ఎదురైనా ప్రభుత్వం మేల్కొనకపోవడం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు తమ పిల్లలను కాలేజీల్లో ఎలా చేర్పించాలి? ఎక్కడ చేర్పించాలి? అన్నది తెలియక గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు సతమతమవుతున్నారు.

మళ్లీ మొదటికే!
రాజాం : ప్రభుత్వ జూనియర్‌ కళాశాల

ఆన్‌లైన్‌ అడ్మిషన్ల ప్రక్రియను రద్దు చేసిన కోర్టు

పాత పద్ధతిలో నిర్వహించాలని ఆదేశం

ప్రభుత్వం, ఇంటర్‌ బోర్డు అస్పష్ట విధానాలతో గందరగోళం

వేలాది మంది విద్యార్థుల ఎదురుచూపు

(రాజాం)

ఇంటర్‌ అడ్మిషన్ల ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. ఆన్‌లైన్‌ అడ్మిషన్లను కోర్టు రద్దు చేసింది. పాత పద్ధతిలోనే చేపట్టాలని సూచించింది. ఇప్పటికే వేలాది మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అడ్మిషన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కోర్టు తీర్పుతో నచ్చిన కాలేజీలో విద్యార్థులు చేరవచ్చు. అయితే దీనిపై ఎటువంటి ఆదేశాలు రాలేదని ఇంటర్‌ బోర్టు జిల్లా అధికారులు చెబుతున్నారు. గత రెండేళ్లుగా ప్రభుత్వం, ఇంటర్‌ బోర్డు అస్పష్ట విధానాలతో విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు. గత ఏడాది ఇదే పరిస్థితి ఎదురైనా ప్రభుత్వం మేల్కొనకపోవడం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు తమ పిల్లలను కాలేజీల్లో ఎలా చేర్పించాలి? ఎక్కడ చేర్పించాలి? అన్నది తెలియక గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు సతమతమవుతున్నారు.

జిల్లాలో 42 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు ఉన్నాయి. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 3, సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 10 కళాశాలలు కొనసాగుతున్నాయి. మరో 32 కేజీబీవీ పాఠశాలల్లో బాలికలకు ఇంటర్‌ గ్రూపులతో కాలేజీలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు జిల్లా వ్యాప్తంగా 61 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. జిల్లాలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు 37,589 మంది సన్నద్ధమయ్యారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విద్యార్థులందరినీ పాస్‌ చేసినట్టు ప్రకటించింది. సమ్మెటివ్‌ పరీక్షల ఆధారంగా గ్రేడు పాయింట్లు ప్రకటించింది. ఈ విధానంలో జిల్లాలో 11,349 మంది పదికి పది గ్రేడ్‌ పాయింట్లు సాధించారు. ఇందులో ఎక్కువమంది ప్రైవేటు పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఉండడం విశేషం. దీనిపై విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు ఆన్‌లైన్‌ అడ్మిషన్ల ప్రక్రియ తెరపైకి వచ్చింది. దీనిపై అవగాహన లేక చాలామంది విద్యార్థులు, తల్లిదండ్రులు గందరగోళానికి గురయ్యారు. నచ్చిన కాలేజీలో నేరుగా చేర్పించే అవకాశం లేకపోవడంతో ఆందోళన చెందారు. కేవలం ఆప్షన్‌లో చూపిన కాలేజీల్లో చేర్పించాల్సి ఉంటుందని భయపడ్డారు. ఆన్‌లైన్‌ అడ్మిషన్ల విధానాన్ని ఎందుకు తెచ్చారో కూడా స్పష్టత లేదు.  ఫీజుల నియంత్రణ కోసం చేపట్టారని అనుకున్నా.. ఫీజులకు, ఆన్‌లైన్‌ అడ్మిషన్లకు సంబంధమే లేదు. గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల్లోని ఇంటర్‌ కళాశాలలకు ఫీజును ఇప్పటికే నిర్ణయించారు. అడ్మిషన్లు ఏ రకంగా చేపట్టినా నిర్ణీత ఫీజులనే చెల్లించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మరి ఆన్‌లైన్‌ ప్రవేశాలకు అనుమతించడంలో ఆంతర్యం ఏమిటన్నది అంతుబట్టని విషయం. ఆన్‌లైన్‌ అడ్మిషన్లను రద్దు చేసి.. పాత పద్ధతిలోనే ప్రవేశాలు కల్పించాలని కోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో అడ్మిషన్ల ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. 

 ఉన్నతాధికారుల ఆదేశాలతో

ఇంటర్‌ అడ్మిషన్లకు సంబంధించి కోర్టు ఆన్‌లైన్‌ ప్రక్రియను రద్దుచేసింది. పాత పద్ధతిలోనే చేపట్టాలని సూచించింది. ఇంకా ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో అన్నిరకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.

- శివ్వాల తవిటినాయుడు ప్రాంతీయ సమన్వయ అధికారి, ఇంటర్‌బోర్డు, శ్రీకాకుళం

Updated Date - 2021-09-12T05:43:54+05:30 IST