అనుమానిస్తున్నాడని మామను హతమార్చిన కోడలు

ABN , First Publish Date - 2021-12-01T04:57:43+05:30 IST

పక్కా పథకంతో కోడలు తన అక్క కొడుకు సహకారంతో మామను కొట్టి, తాడుతో గొంతునులిమి హత్య చేసిన సంఘటన శంకరపట్నం మండలం కాచాపూర్‌లో చోటు చేసుకుంది.

అనుమానిస్తున్నాడని మామను హతమార్చిన కోడలు
వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ వెంకట్‌రెడ్డి

శంకరపట్నం, నవంబరు 30: పక్కా పథకంతో కోడలు తన అక్క కొడుకు సహకారంతో మామను కొట్టి, తాడుతో గొంతునులిమి హత్య చేసిన సంఘటన శంకరపట్నం మండలం కాచాపూర్‌లో చోటు చేసుకుంది. మంగళవారం హుజూరాబాద్‌ ఏసీపీ కోట్ల వెంకట్‌రెడ్డి హత్య వివరాలను వెల్లడించారు. మండలంలోని కాచాపూర్‌ గ్రామానికి చెందిన మాతంగి కొమురమ్మ-తిరుపతి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. భర్త తిరుపతి నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కొడుకు, పెద్ద కూతురు హాస్టల్‌లో ఉండి చదువుకుం టున్నారు. కొమురమ్మ తన చిన్న కూతురు, మామ కనుకయ్యతో కాచాపూర్‌లోనే ఉంటూ తమకున్న భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి తోడుగా వ్యవసాయ పనుల్లో సాయం కోసం మానకొండూర్‌ మండలం కెళ్లేడు గ్రామానికి చెందిన తన అక్క కొడుకైన మాతంగి ప్రవీణ్‌ను తీసుకొచ్చుకొని వారితోనే ఉంచుకుంటున్నారు. కొద్దీ నెలలుగా మామ కనుక య్య మద్యం, కల్లు తాగివస్తూ కొడలైన కొమురమ్మను అనుమానిస్తూ ఎవరెవరో ఇంటికి వస్తున్నా రని, అందరితో అక్రమ సంబంధం ఉందని కొడుకు చనిపోయాక మీరు ఇక్కడ ఎందుకు ఉంటున్నారని నానా భూతులు తిడుతుండేవాడు. ఇదే క్రమంలో ఈ నెల 27న రాత్రి మద్యం తాగి వచ్చిన కనుకయ్య అన్నం పెట్టమని అడగగా, నన్ను అనుమానిస్తూ తిడుతున్నప్పుడు నేనెందుకు పెట్టాలని కొమురమ్మ నిలదీసింది. వారిద్దరి మధ్య గొడవ జరిగింది. కాసేపటికి గొడవ సద్దుమనిగి కనుకయ్య తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు. మామ బతికుంటే అనుమానిస్తూ బాధ పెడుతాడని, అలాగే తన ఆస్తి తనకు దక్కకుండా పోతుందన్న ఆలోచనతో మామను కడతేర్చటానికి కోడలు కొమురమ్మ తన అక్క కొడుకైన ప్రవీణ్‌తో కలిసి పథకం ప్రకారం తాడు తీసుకొని కనుకయ్య గదిలోకి వెళ్లి అతను నిద్రిస్తున్న సమయంలో కర్రతో కొట్టారు. అతను ప్రతిఘటించడంతో ప్రవీణ్‌ అతని కాళ్లు, చేతులు అదిమిపట్టగా, కొమురమ్మ అతని మెడకు నైలాన్‌ తాడు చుట్టి ఉరి వేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రంతా మృతదేహాన్ని అలాగే ఉంచి నిందితులు ఏమీ తెలియనట్లు ఉన్నారు. మరుసటి రోజు ఉదయం పక్కింటి మాతంగి శాంతమ్మ వచ్చి చూడగా, హత్య ఉదంతం వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. కనుకయ్య హత్యకు కారణమైన నిందితుల కోసం వెతుకుతున్న క్రమంలో మంగళవారం నిందితులైన మాతంగి కొమురమ్మ, మాతంగి ప్రవీణ్‌లను కొత్తగట్టులోని మత్స్యగిరీంద్రస్వామి గుడి దగ్గరలో అదుపులోకి తీసుకొని విచారించగా, నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు. వారు హత్య చేయడానికి ఉపయోగించిన నైలాన్‌ తాడు, కర్రలను కాచాపూర్‌లోని వారి ఇంటి పరిసరాలలో స్వాధీనం చేసుకొని, వారిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నిందితులను పట్టుకొని రిమాండ్‌కు తరలించడంలో శ్రమించిన హుజూరాబాద్‌ రూరల్‌ సీఐ ఎర్రల కిరణ్‌, కేశవపట్నం ఎస్‌ఐ బండ శ్రీనివాస్‌రావు, సిబ్బందిని ఏసీపీ వెంకట్‌రెడ్డి అభినందించారు.

Updated Date - 2021-12-01T04:57:43+05:30 IST