Abn logo
Jul 1 2020 @ 01:52AM

సైబర్ గోడ

గొలుసుకట్టు పరిణామాలు ఎటు దారితీస్తాయో చెప్పలేము కానీ, 59 చైనా మొబైల్ అప్లికేషన్లను నిషేధించడంలో భారతదేశం తన చాతుర్యాన్ని ప్రదర్శించిందనే చెప్పాలి. సరిహద్దుల్లో చైనా వ్యవహరిస్తున్న తీరుపై భారత్ తీసుకున్న ప్రతీకార చర్య ఏమంత కఠినమైనదిగా కనిపించకపోయినా, శత్రువుకు మాత్రం గట్టి దెబ్బే తగిలింది. నిజానికి, సరిహద్దుల్లో జరిగినదానికీ ఈ నిషేధానికీ సాంకేతికంగా ఏ సంబంధమూ లేదు. సైబర్ స్పేస్‌లో దేశ భద్రతకు, సమాచార గోప్యతకు హాని కలిగిస్తున్నాయనే ఆరోపణపై ఆ అప్లికేషన్లను నిషేధించారు. ఏ ఇతర భౌతిక వస్తువుల దిగుమతిపైనా, వ్యాపారాల మీద చర్య తీసుకోవడానికి, లేదా అంతర్జాతీయ వేదికల మీద ఒక వ్యాజ్యం నడపడానికి ఇది అనువుగాని వేళ అని భావించిన భారత్, మరో మార్గం ద్వారా చైనాకు తన అయిష్టాన్ని, నిరసనను తెలిపిందనుకోవాలి. ఆ చర్య మరీ తీవ్రంగా కనిపించకుండా ఉండడానికి అనేక కీలకమయిన చైనా అప్లికేషన్లను, ముఖ్యంగా పేటిఎం వంటి చెల్లింపు వేదికలను, చైనా పెట్టుబడులున్న బైజూ వంటి విద్యావేదికలను నిషేధ జాబితాలో చేర్చలేదు. పరిమితమైన ప్రభావం వేయడం, లేదా నమూనా ప్రభావం వేయడం మాత్రమే భారత్ ఉద్దేశ్యంగా కనిపిస్తున్నది. అంతేకాక, జాతీయావేశంతో, ఏదో ఒక చర్య తీసుకోవాలని కోరుకుంటున్నవారిని ఎంతో కొంత సంతృప్తిపరచడం కూడా ఈ చర్య లక్ష్యం కావచ్చు. 


డొంకతిరుగుడు పద్ధతిలో భారత్ చర్య తీసుకున్నా, దాని భావమేమిటో స్పష్టంగానే తెలిసినందున చైనా విదేశాంగ శాఖ వెంటనే స్పందించింది. అప్లికేషన్ల నిషేధం మీద తీవ్రమైన ఆందోళనను వ్యక్తం చేస్తూ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల న్యాయమైన, చట్టపరమైన హక్కులను కాపాడవలసిన బాధ్యత భారత్ మీద ఉన్నదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఏ దేశంలో వ్యాపారం చేస్తున్నా, ఆ దేశంలోని చట్టాలను, పద్ధతులను గౌరవించాలని మా పెట్టుబడిదారులకు చైనా ఎప్పుడూ చెబుతుందని కూడా ఆ ప్రతినిధి గుర్తుచేశారు. భారత-–చైనా దేశాల మధ్య సహకారం ఇద్దరికీ లాభదాయకమైనదని, దాన్నుంచి వైదొలగడం భారత్‌కే నష్టదాయకమని ఆ ప్రతినిధి మెత్తగా హెచ్చరించారు కూడా. నిషేధానికి సంబంధించి ఇచ్చిన నోటీసుకు సంబంధిత సంస్థలు సమాధానం ఇవ్వడానికి 48 గంటల వ్యవధి ఇస్తారు. టిక్‌టాక్ సంస్థ భారతీయ ప్రతినిధి మాత్రమే ఇప్పటిదాకా బహిరంగంగా స్పందించారు. ఈ నిషేధం తాత్కాలికమేనని, తాము తమ పారదర్శకతను నిరూపించుకుని తిరిగి రంగంలోకి వస్తామని అనేక అప్లికేషన్ల సంస్థలు అంటున్నాయి కానీ, ఇది చాలా కాలం కొనసాగే ఘట్టమని పరిశీలకులు భావిస్తున్నారు.


నిషేధించిన అప్లికేషన్లలో టిక్‌టాక్ తో పాటు, ఆ కోవకు చెందిన హెలో, లైకి వంటివి మరికొన్ని ఉన్నాయి. ఈ అప్లికేషన్లు సినిమాపాటల భాగాలకు లేదా, సంభాషణలకు, నేతల ప్రసంగాలలోని చమత్కారాలకు వీక్షకులే ప్రదర్శనలు ఇవ్వడానికి పనికివచ్చేవి. వీటిని ఉపయోగించడం కూడా సులువు. మహానగరాలే కాదు, చిన్న పట్టణాలు, పల్లెటూళ్ల దాకా టిక్‌టాక్ వ్యాపించింది. ఎందరినో సెలబ్రిటీలను చేసింది. దిగువ మధ్యతరగతి, నిమ్నతరగతుల వారికి కూడా ‘స్క్రీన్ లైఫ్’ ఇచ్చింది. అసంఖ్యాకులకు ఆదాయాన్ని కూడా కల్పించింది. టిక్‌టాక్ దాని కోవలోని అప్లికేషన్లను నిషేధించడం వల్ల నష్టపోయే భారతీయుల సంఖ్య చిన్నదేమీ కాదు. వాటికి దీటైన అప్లికేషన్లు దొరికి, వాటికి అలవాటు పడే దాకా భారతీయ సమాజంలో ఒక ముఖ్యమైన వ్యాపకానికి గండి పడినట్టే. నిజానికి సాంస్కృతికంగా టిక్‌టాక్ తరహా అప్లికేషన్లు ఎక్కువ చెరుపే చేస్తున్నాయి. అదే సమయంలో, అవి జనంలోని నిగూఢ ఆకాంక్షలను నెరవేరుస్తున్నాయి.


ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం చేసిన ప్రసంగంలో ఈ అప్లికేషన్లు దేశ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి, భద్రతకు భంగకరమని వ్యాఖ్యానించారు. నిజానికి, ఈ అప్లికేషన్లలో వ్యక్తిగత సమాచారం కానీ, సామూహిక ధోరణుల సమాచారం కానీ, దేశరహస్యాలకు సంబంధించిన సమాచారం కానీ ప్రత్యేకంగా సేకరించే సామర్థ్యం ఏమీ లేదు. గూగుల్ వంటి బ్రౌజర్లు, మెయిలింగ్ వేదికలు వ్యక్తిగత సందేశాలలోకి కూడా జొరబడి వివరాలు సేకరిస్తాయి. అంతర్జాలాన్ని శోధించే అలవాట్లను, రీతులను, అభిరుచులను గమనిస్తూ, ఆ సమాచారాన్ని సంబంధిత వాణిజ్యసంస్థలకు విక్రయిస్తాయి. టిక్‌టాక్ వంటివి కానీ, క్లబ్ ఫ్యాక్టరీ కానీ, యుసీ బ్రౌజర్ కానీ అటువంటి ధోరణులను, క్రమాలను మాత్రమే పసిగట్టి కార్పొరేట్ రంగానికి చేరవేయగలవు. నిజానికి జూమ్ అప్లికేషన్ ప్రమాదకరమని, దానిని సమావేశాలకు వాడవద్దని ఆ మధ్య సలహాలు వెలువడ్డాయి. జూమ్ కానీ, భారతదేశ విద్యార్థులను, యువతను వ్యసనపరులను చేస్తున్న పబ్జీని కానీ నిషేధించకపోవడానికి కారణమేమిటో తెలియదు.


పది సంవత్సరాల కిందట, యుపిఏ హయాంలో కూడా 25 చైనా టెలికాం కంపెనీలను నిషేధజాబితాలో పెట్టారు. కానీ, క్రమంగా వాణిజ్యం ప్రాధాన్యం పెరిగి, ఆ నిషేధాలు కరిగిపోయాయి. నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత, తీవ్రజాతీయవాదం, మొదటి ఎన్‌డిఎ హయాం నుంచి వారసత్వంగా వచ్చిన చైనా విముఖత, 2017లో డోక్లామ్ వివాదం, చైనా వస్తువుల వ్యతిరేకత, ఇటీవలి పరిణామాలు కలిసి, నూతన వాతావరణాన్ని సృష్టించాయి. కరోనా జన్మస్థలం కావడంతో చైనాపై ప్రపంచవ్యాప్తంగా పెరిగిన వ్యతిరేకత, భారత్‌లో ఆత్మనిర్భరత నినాదం- అనివార్యంగా కొన్ని మాటలను చేతలలోకి దింపుతున్నాయి. రానున్న రోజులలో నిషేధాల క్రమం కొన్ని ఎంపిక చేసిన సరుకుల నుంచి మొదలై, తీవ్రమై వాణిజ్య అవరోధాల దాకా చేరుకునే అవకాశం ఉన్నది. ఇదంతా భారతీయ పరిశ్రమలకు, స్టార్టప్‌లకు మంచిది కాదని, వైరం ముదరకుండా జాగ్రత్త పడాలని హెచ్చరికలు కూడా కొన్ని వినిపిస్తున్నాయి. 


చైనా తమ దేశంలో ఫేస్‌బుక్‌ను, గూగుల్‌ను నియంత్రించడానికి ఏ పద్ధతులు ఉపయోగిస్తోందో, ఇప్పుడు భారత్ కూడా చైనా అప్లికేషన్లకు అనేక వరుసల అడ్డగోడలు కట్టడానికి అవే సాంకేతిక విధానాలను అనుసరించబోతున్నది. n

Advertisement
Advertisement
Advertisement