వెలుగు వెనుక చీకటి.. బీటీపీఎస్‌తో కలుషితమవుతున్న గోదావరి జలాలు

ABN , First Publish Date - 2022-01-17T05:20:05+05:30 IST

మణుగూరు డివిజన వాసులకు స్వచ్ఛమైన గోదావరి జలాలు మళ్లీ దూరమవుతున్నాయి. ఒక్కప్పుడు కమలాపురం పేపర్‌బోర్డు వల్ల కలుషితంగా మారిన గోదావరి జలాలతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనగా ప్రజా ఉద్యమాల తరువాత ఆ పరిశ్రమ మూతపడడంతో సమస్య తీరిందని భావించగా మళ్లీ బీటీపీఎస్‌ రూపంలో మణుగూరు వాసులకు కలుషిత జలాల సమస్య మొదటికొచ్చింది.

వెలుగు వెనుక చీకటి.. బీటీపీఎస్‌తో కలుషితమవుతున్న గోదావరి జలాలు
గోదావరిలో ఇనటేక్‌ వెల్‌ వద్ద కాలుష్య నురుగు

బీటీపీఎస్‌తో కలుషితమవుతున్న గోదావరి జలాలు 

నదీ పాయల్లో దర్శనమిస్తున్న కాలుష్య నురగలు 

పది రోజులుగా తాగునీటి నాణ్యతలో తేడా  

మళ్లీ మొదటికొచ్చిన మణుగూరువాసుల నీటి సమస్య

మణుగూరు, జనవరి 16: మణుగూరు డివిజన వాసులకు స్వచ్ఛమైన గోదావరి  జలాలు మళ్లీ దూరమవుతున్నాయి. ఒక్కప్పుడు కమలాపురం పేపర్‌బోర్డు వల్ల కలుషితంగా మారిన గోదావరి జలాలతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనగా ప్రజా ఉద్యమాల తరువాత ఆ పరిశ్రమ మూతపడడంతో సమస్య తీరిందని భావించగా మళ్లీ బీటీపీఎస్‌ రూపంలో మణుగూరు వాసులకు కలుషిత జలాల సమస్య మొదటికొచ్చింది. ఇప్పటివరకు మణుగూరు మునిసిపాలిటీతో పాటు మండలంలోని పరిసర ప్రాంతాలకు సింగరేణి ద్వారా తాగునీరు సరఫరా జరిగేది. కానీ ఇప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. 

గోదావరిలో కలుస్తున్న బీటీపీఎస్‌ వ్యర్థ జలాలు

మణుగూరులో నిర్మాణం పూర్తి చేసుకున్న బీటీపీఎస్‌ పరిశ్రమ ద్వారా వెలువడే వ్యర్థ జలాలు గోదావరిలో కలుస్తుండడం వల్ల నదీ జలాలు కలుషితమవుతున్నాయి. తెల్లటి నురగ గోదావరి పాయల్లో ప్రవహిస్తూ మల్లేపల్లి వద్ద ఉన్న సింగరేణి తాగునీటి ఇనటెక్‌వెల్‌తో పాటు బీటీపీఎస్‌ నుంచి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న రావిగూడెం వద్ద ఉన్న మణుగూరు గ్రామీణ తాగునీటి పథకాల ఇనటేక్‌ వెల్‌లకు చేరుకుంటున్నాయి. పట్టణ తాగునీటి పథకం ద్వారా సరఫరా అయ్యే నీరు మునిసిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో సమారు 70వేల మంది తాగునీటికి వినియోగిస్తున్నారు. సింగరేణి ద్వారా చేరే నీరు పీవీ కాలనీ బాంబేకాలనీ, కూనవరం గ్రామాలతో పాటు పరిసర పంచాయతీల్లో సుమారు 30వేల మందికి సరఫరా అవుతోంది. గత 10రోజులుగా మునిసిపాలిటీ, పంచాయతీ, సింగరేణిల ద్వారా నల్లాల్లో ఇళ్లకు సరఫరా అవుతున్న నీరు కలుషితమై వస్తోంది. అయితే గోదావరి ఎగువనుంచే ఇలా కలుషిత నీరు వస్తోందని ప్రజలు భావించారు. కానీ ఈ విషయంపై ‘ఆంధ్రజ్యోతి’ క్షేత్రస్థాయిలో ఆరా తీయగా కలుషిత నీరు  బీటీపీఎస్‌నుంచే గోదావరిలో కలుస్తున్న విషయం బహిర్గతమైంది. బీటీపీఎస్‌ నుంచి సాంబాయిగూడెం మీదుగా కాలువ ద్వారా వచ్చే వ్యర్థ జలాలు గోదావరిలో కలుస్తున్నాయి. 

పది రోజులుగా నీటి నాణ్యతలో తేడా..

గత 10రోజులుగా నల్లాల నుంచ్చి వచ్చేనీరు తాగడం వల్ల తమ ఆరోగ్యంలో స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని, ప్రస్తుతం నల్లాల ద్వారా వచ్చేనీరు తాగేందుకు ఉపయోగకరంగా లేదని మణుగూరు పట్టణ పరిసరప్రాంత వాసులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా పొలాలకు కూడా ఈ నీరు సరఫరా అవుతుండటంతో పంటలపై ఎలాంటి ప్రభావం చూపుతోందనని రైతులు ఆందోళన చెందుతున్నారు. కలుషిత నీటి సమస్యపై బీటీపీఎస్‌ అధికారులతో పాటు జిల్లా అధికారులు సత్వరమే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై స్థానిక బీటీపీఎస్‌ అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదు.  


Updated Date - 2022-01-17T05:20:05+05:30 IST