వైసీపీకి రోజులు దగ్గరపడ్డాయి

ABN , First Publish Date - 2021-10-18T05:13:52+05:30 IST

వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్య ప్రకాష్‌ రెడ్డి అన్నారు.

వైసీపీకి రోజులు దగ్గరపడ్డాయి
మాట్లాడుతున కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల

  1. రైతులు నష్టపోతుంటే ఏం చేస్తున్నారు..? 
  2. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై కోట్ల ఆగ్రహం


గూడూరు, అక్టోబరు 17: వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్య ప్రకాష్‌ రెడ్డి అన్నారు. గూడూరులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అనుభవం లేని వ్వక్తికి పట్టం కట్టామని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని అన్నారు. నాసిరకం పత్తి విత్తనాలతో రైతాంగం నష్టపోతుంటే ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు లేక అల్లాడుతున్నారని, టీడీపీ హయాంలో వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులు తీసుకువస్తే వైసీపీ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని ఆరోపించారు. వేదవతి, గుండ్రేవులతోనే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని అన్నారు. ఉల్లి, టమోటా దిగుబడులకు గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోతున్నారని అన్నారు. నివాసయోగ్యం కానిచోట ఇంటి స్థలాలు ఇచ్చి ఏం ప్రయోజనమని, లబ్ధిదారులు ఇళ్లు ఏలా నిర్మించుకుంటారని ప్రశ్నించారు. ఇసుక, ఎర్రమట్టి అక్రమ రవాణా, నాటు సారా తయారీ సాగుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఓ పక్క కరెంటు బిల్లుల మోత, మరో పక్క కరెంటు కోతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగించడం ద్వారా ఉచిత విద్యుత్‌ పథకానికి తూట్లు పొడుస్తున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, రానున్నది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. టీడీపీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, టీడీపీతోనే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ కోడుమూరు నియోజక వర్గ ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్‌, టీడీపీ మండల, పట్టణ అధ్యక్షులు ఎల్‌ సుధాకర్‌ రెడ్డి, గజేంద్ర గోపాల్‌, టీడీపీ నాయకులు విజయరాఘవ రెడ్డి, కేవీ కృష్ణారెడ్డి, రాజారెడ్డి, తిరుమల రెడ్డి, చెట్టుకింద మద్దిలేటి, చరణ్‌ కుమార్‌, సలీం, దండు సుందరరాజు, కౌన్సిలర్‌ సురేష్‌, తులసీకృష్ణ, మన్నన్‌ బాషా, కోడుమూరు షాషావళి, మూలగేరి లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-18T05:13:52+05:30 IST