కోర్టుల్ని కామెంట్ చేయడం శూరత్వం అనుకున్నారా?

ABN , First Publish Date - 2020-05-27T01:39:47+05:30 IST

‘సోషల్ వీరులకు సుమోటో షాక్. అడ్డమైన కామెంట్లపై కోర్టు సీరియస్. కోర్టుల్ని కామెంట్ చేయడం శూరత్వం అనుకున్నారా?. ..

కోర్టుల్ని కామెంట్ చేయడం శూరత్వం అనుకున్నారా?

హైదరాబాద్: ‘సోషల్ వీరులకు సుమోటో షాక్. అడ్డమైన కామెంట్లపై కోర్టు సీరియస్. కోర్టుల్ని కామెంట్ చేయడం శూరత్వం అనుకున్నారా?. జడ్జీలను బూతులు తిడితే పడి ఉంటారనుకున్నారా?. పూర్తిగా స్టడీ చేశాక కోర్టు సీరియస్. ఎంపీ సురేష్‌తో పాటు 49 మందికి నోటీసులు’. అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్‌లో మాజీ న్యాయమూర్తి శ్రావణ్‌కుమార్‌, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తులసిరెడ్డి, బీజేపీ నేత పాతూరి నాగభూషణం, విశ్లేషకులు విక్రమ్‌, ఐటీ నిపుణుడు నల్లమోతు శ్రీధర్‌ పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా మాజీ న్యాయమూర్తి శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ ‘‘హైకోర్టు నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నా. అత్యున్నత న్యాయవ్యవస్థపై దాడి సరికాదు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఎంపీ ఇలా మాట్లాడడం క్షమించరాని అంశం. లాక్‌డౌన్‌ లేకపోతే హైకోర్టు ముందు ధర్నా చేసేవాడినని మాజీ ఎమ్మెల్యే మాట్లాడడం సిగ్గుచేటు. జడ్జిమెంట్లకు రాజకీయరంగు పులమడం సరికాదు. రాజకీయాల కోసమే సోషల్‌ మీడియాను వాడుకుంటున్నారు.‌’’ అని అన్నారు. 


టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ ‘‘రాజ్యాంగ వ్యవస్థల్ని జగన్‌ ధ్వంసం చేస్తున్నాడు. దళిత మేధావిని ఈ ప్రభుత్వం పిచ్చివాడిని చేసింది. మాస్క్‌లు అడిగితే డా.సుధాకర్‌ను సస్పెండ్‌ చేశారు. రమేష్‌కుమార్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. నియంతృత్వ మనస్తత్వంతో జగన్‌ వ్యవహరిస్తున్నాడు. సీఎం జగన్‌ అనేక తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి. రాష్ట్రంలో రాజకీయ పైశాచికత్వం రాజ్యమేలుతోంది. ప్రశ్నించేవారిపై కేసులు పెట్టడం సరికాదు. ఈ ప్రభుత్వం వ్యవస్థలను ఛిద్రం చేస్తోంది. న్యాయవ్యవస్థపై నేరుగా దాడి చేయడం ఉన్మాదమే.’’ అని చెప్పారు. 


కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తులసిరెడ్డి మాట్లాడుతూ ‘‘జగన్‌ సీఎం అయితే రాష్ట్రం రావణకాష్టం అవుతుందని ఎప్పుడో చెప్పా. వైసీపీకి ఓట్లు వేయనివాళ్లను గ్రామ బహిష్కరణ చేశారు. నామినేషన్లు వేయకుండా అభ్యర్థులపై దాడులు చేశారు.’’ అని తెలిపారు. 


బీజేపీ నేత పాతూరి నాగభూషణం మాట్లాడుతూ ‘‘పోలీస్‌ వ్యవస్థ వైసీపీ నేతల చేతిలో కీలుబొమ్మ అయింది. ఆమంచి ఏ పార్టీలో ఉన్నా రౌడీయిజం చేస్తాడు. జడ్జిల పవర్‌ ఏంటో వైసీపీ వాళ్లకు అర్థంకావడం లేదు.’’ అని అన్నారు. 



విశ్లేషకులు విక్రమ్‌ మాట్లాడుతూ ‘‘ఆటవిక రాజ్యంలో కూడా కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. తీర్పులు ఎందుకు వ్యతిరేకంగా వస్తున్నాయో వైసీపీ సమీక్షించుకోవాలి. ప్రభుత్వానిది తప్పులేదని ప్రజల్లో భావన కల్పించే ప్రయత్నం.’’ అని చెప్పారు. 


ఐటీ నిపుణుడు నల్లమోతు శ్రీధర్‌ మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో కొన్ని కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ ఉంటాయి. సోషల్‌ మీడియా పోస్టులపై చాలా మందికి ప్రాథమిక అవగాహన లేదు. నాయకుడి దృష్టిలో పడటానికే కొందరు పోస్టులు పెడుతున్నారు. కోర్టుకు ఉద్దేశాలు ఆపాదించడం సరికాదు. ప్రజలకు వ్యవస్థలపై నమ్మకంపోయేలా చేస్తున్నారు.’’ అని తెలిపారు. 

Updated Date - 2020-05-27T01:39:47+05:30 IST