అప్పులు.. గిమ్మిక్కులు!

ABN , First Publish Date - 2021-05-19T09:15:21+05:30 IST

బడ్జెట్‌ అంటే కొత్త పథకాలు, ఉన్న వాటికి కేటాయింపులు, పెండింగ్‌ బిల్లులకు కేటాయింపులు, ఇతరత్రా జమా ఖర్చులు.. ఇలా ఎన్నెన్నో లెక్కల సమాహారంగా ఉంటుంది. కానీ రానురాను లెక్కల గిమ్మిక్కులు తప్ప ఆచరణీయమైన అంశాలకు...

అప్పులు.. గిమ్మిక్కులు!

  • నెలకు రూ.7,000 కోట్ల అప్పు లేనిదే గడవదు
  • ఏ నెలలో అప్పు పుట్టకపోతే ఆ నెలలో దివాలా
  • లక్ష కోట్ల బిల్లులు గాలికి.. బడ్జెట్‌పై ఎవరికీ లేని ఆసక్తి!!


ఒకప్పుడు రాష్ట్ర బడ్జెట్‌ అంటే.. అందరికీ ఎంతో కొంత ఆసక్తి. సామాన్య ప్రజలతో పాటు కాంట్రాక్టర్లు, సరఫరాదారులు అందరూ ఆసక్తిగా దాని కోసం ఎదురుచూసేవారు. కానీ, రెండేళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌పై ఎవరికీ ఆసక్తి లేకుండా పోయింది. ఎందుకిలా..?


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

బడ్జెట్‌ అంటే కొత్త పథకాలు, ఉన్న వాటికి కేటాయింపులు, పెండింగ్‌ బిల్లులకు కేటాయింపులు, ఇతరత్రా జమా ఖర్చులు.. ఇలా ఎన్నెన్నో లెక్కల సమాహారంగా ఉంటుంది. కానీ రానురాను లెక్కల గిమ్మిక్కులు తప్ప ఆచరణీయమైన అంశాలకు అందులో మెల్లగా చోటులేని పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా గత రెండేళ్లుగా ఆర్థిక పరిస్థితి దినదినగండంగా మారడం బడ్జెట్‌పై ఆసక్తిని మరింత దూరం చేసింది. ముఖ్యంగా కాంట్రాక్టర్లు, సరఫరాదారుల విషయం చూస్తే లక్ష కోట్ల పెండింగ్‌ బిల్లులకు బడ్జెట్‌లో పైసా పెట్టని పరిస్థితి. దాంతో వాళ్లంతా అదనపు నిధుల కోసం ఫైలు పెట్టుకుంటే అది అన్ని గండాలూ దాటుకుని ఆమోదం పొంది వచ్చేసరికి ఏడు నుంచి 8 నెలల సమయం పట్టడం తథ్యం. ఆ తర్వాత అది బిల్లుగా మారి చెల్లింపుల సమయానికి వచ్చేసరికి ఆర్థిక సంవత్సరం ముగిసిపోవడం కీలకాంశం. ఒకవేళ అరకొరగా బడ్జెట్‌లో పెట్టినా పేమెంట్‌ జరుగుతుందనే గ్యారంటీ లేక వాళ్లు ఆసక్తి కనబర్చడం లేదు. బ్యాంకుల్లో మొండి పద్దులు పేరుకుపోయినట్టు ప్రభుత్వం వద్ద పెండింగ్‌ బిల్లులు పేరుకుపోతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయానికొస్తే ఏ నెల అప్పు పుట్టకపోతే ఆ నెలలో దివాలా తీసే దుస్థితిలో ఉంది. ఏదైనా నెలలో కనీసం రూ.6,000 కోట్ల నుంచి 7,000 కోట్లు అప్పు పుట్టకపోతే ఆ నెలలో రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర స్థితి దాపురించే పరిస్థితి.


ఎన్నెన్ని గిమ్మిక్కులో..  

2020-21 ఆర్థిక సంవత్సరంలో దాదాపు నెలకు సగటున రూ.10,000 కోట్ల ఆదాయం వచ్చింది. సంవత్సరానికి దాదాపు రూ.1,20,000 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. కానీ, ఆర్థిక శాఖ రాష్ట్ర ఆదాయాన్ని రూ.1,06,000 కోట్లకు మాత్రమే పరిమితం చేసింది. మిగిలిన ఆదాయాన్ని బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకోవడం కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు నేరుగా వచ్చే ఆదాయం కింద చూపించింది. దీంతో రాష్ట్ర ఖజానా ఆదాయం తగ్గిపోయింది. రాష్ట్ర ఖజానాలోని ఆదాయాన్ని ఏపీ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌, ఏపీ రాష్ట్ర రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్‌ ఆదాయంగా చూపించారు. వాస్తవానికి ఆ ఆదాయం నేరుగా రాష్ట్ర ఖజానాకు వస్తోంది. ఆ తర్వాత ఆ మొత్తాన్ని ఆయా కార్పొరేషన్లకు గ్రాంటుగా చూపిస్తున్నారు. అలాగే కొన్ని కార్పొరేషన్లను చూపించి బ్యాంకుల్లో రాష్ట్ర అవసరాల కోసం అప్పులు తెచ్చి ఆ కార్పొరేషన్‌కే ఖర్చు చేసినట్టు చూపిస్తున్నారు. ఇలాంటి వాటిని రాష్ట్ర ఖాతా కింద చూపడం లేదు. ఉదాహరణకు వాటర్‌ కార్పొరేషన్‌. వాటర్‌ సెస్‌, పండిన పంటలో కొంత మొత్తం వసూలు చేస్తామని పేపర్లపై రాసి, దాన్నే ఆదాయంగా చూపి బ్యాంకుల నుంచి వేల కోట్లు అప్పులు తెస్తున్నారు. కానీ, వాస్తవంగా వాటర్‌ సెస్‌, పంటల్లో కొంత ఆదాయం తీసుకోవడం లాంటివి క్షేత్రస్థాయిలో జరగడం లేదు. అప్పుల కోసం ఆర్థిక శాఖ చేస్తున్న మాయ ఇది.


తేడా వస్తే ఆర్‌బీఐ చేతిలోకే.. 

కొవిడ్‌ ప్రభావం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు సగటున రూ.10,000 కోట్ల ఆదాయం వస్తోంది. ఇది కాకుండా ప్రతి నెలా సగటున రూ.6,000 కోట్ల నుంచి 7,000 కోట్ల అప్పు లేనిదే రాష్ట్రానికి జరగడం లేదు. ఈ మొత్తం డబ్బును అప్పుల రీపేమెంట్లు, వడ్డీ చెల్లింపులు, పథకాలు, కార్యాలయాల నిర్వహణ, ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లకు మాత్రమే వినియోగిస్తున్నారు. పెండింగ్‌ బిల్లులు చెల్లించడం లేదు. నెలకు ఆదాయం అప్పులు కలిపి రూ.17,000 కోట్లు వస్తున్నప్పటికీ బిల్లులు చెల్లించలేకపోతున్నారు. ఏదైనా నెలలో అప్పు పుట్టకపోతే ఉద్యోగుల వేతనాలా? సంక్షేమ పథకాల అమలా? దేనికో ఒక దానికే ఎంచుకునే పరిస్థితి తలెత్తుతోంది. ఉద్యోగుల వేతనాలు ఇవ్వలేని పక్షంలో రాష్ట్రం దివాలా తీసినట్టే. ఈ పరిస్థితి వస్తే రాష్ట్ర ఖజానా నిర్వహణ పూర్తిగా ఆర్‌బీఐ చేతుల్లోకి వెళ్లిపోతుంది. అప్పుడు రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని మొదట అప్పుల తిరిగి చెల్లింపు, వడ్డీల చెల్లింపునకే ఆర్‌బీఐ వినియోగిస్తుంది. ఆ తర్వాత ఏమైనా మిగిలితే రాష్ట్రంలో ఆస్పత్రుల నిర్వహణ లాంటి అత్యవసర సేవలకు వినియోగిస్తుంది. ఇంకా మిగిలితే ఉద్యోగులకు ఎంతో కొంత వేతనాలిస్తుంది. ఆదాయానికి తగ్గ విధంగా ఖర్చులు తగ్గించుకోని పక్షంలో ఏపీ ఆ పరిస్థితికి వెళ్లడమనేది ఎంతో దూరంలో లేదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Updated Date - 2021-05-19T09:15:21+05:30 IST