ఓటమితోనే బీజేపీకి కళ్ళెం

ABN , First Publish Date - 2021-11-27T08:03:04+05:30 IST

ధనికులు ప్రభువులు అవుతారు. పాలకులు సంపద్వంతులవుతారు. ఎప్పుడైతే వారు అధికార శక్తిమంతులు, ఐశ్వర్య రారాజులు అవుతారో అప్పుడు వారికిక తిరుగు ఉండదు. ఎవరికీ జవాబుదారీ కారు...

ఓటమితోనే బీజేపీకి కళ్ళెం

ధనికులు ప్రభువులు అవుతారు. పాలకులు సంపద్వంతులవుతారు. ఎప్పుడైతే వారు అధికార శక్తిమంతులు, ఐశ్వర్య రారాజులు అవుతారో అప్పుడు వారికిక తిరుగు ఉండదు. ఎవరికీ జవాబుదారీ కారు. కావడానికి ససేమిరా అంటారు. ఇది, ప్రజాస్వామ్యానికి అరిష్టం . 


‘రాజకీయ రంగంలో రాజరికాన్ని భరించకూడదు, వ్యాపార రంగంలో ఏక వ్యక్తి ఆధిపత్యాన్ని సహించకూడదు’ అని అమెరికా సెనేటర్ జాన్ షెర్మన్ (1890 నాటి మొదటి యాన్టీ ట్రస్ట్ ఆక్‌్టను సాధారణంగా షెర్మన్ చట్టంగా ప్రస్తావిస్తుంటారు) అంటాడు. అమెరికాలో స్టాండర్డ్ ఆయిల్, ఎటి అండ్ టి కంపెనీలు విభజితమయ్యాయి. అలీబాబా, టెన్సెంట్ , డిడి కంపెనీలపై చైనా కఠిన చర్యలు చేపట్టింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్‌బుక్‌లు చాలా దేశాల్లో తీవ్ర ప్రతికూల పరిస్థితుల నెదుర్కొంటున్నాయి. ఎందుకు? అవి, విశ్వవ్యాప్త సంస్థలూ, కుబేరుని తలదన్నే భాగ్యస్రష్టలు, ఎవరికీ జవాబుదారీ కావల్సిన అగత్యం లేనివిగా వెలుగొందుతుండడం వల్లే కాదూ? మనం ఒక రాజును పాలకుడిగా భరించలేనప్పుడు చక్రవర్తి కాదలచుకున్న పాలకుడినీ మనం సహించకూడదు. అపరిమిత అధికారాలను చెలాయిస్తారనే భావనతోనే చాలా దేశాలు తమ అధ్యక్షుడు లేదా ప్రధానమంత్రి పదవికి ఒక నాయకుడు, నాయకురాలు ఎన్నిసార్లు ఎంపిక కావచ్చనే విషయమై స్పష్టమైన పరిమితి విధించారు. 


అధ్యక్షుడుగా ఉన్నా లేక ప్రధానమంత్రిగా ఉన్నా నిజమైన అధికారాలను చెలాయించే పాలకుడిగా ఉండే ఉపాయమేమిటో వ్లాదిమిర్ పుతిన్‌కు బాగా తెలుసు. క్సి జిన్ పింగ్ తన అధికారాన్ని పటిష్ఠం చేసుకున్నారు. పదవీ కాలంపై పరిమితిని రద్దు చేశాడు. వచ్చే ఏడాది ఆయన మూడో టర్మ్ ప్రారంభం కానున్నది. రష్యా, చైనా ఏ విధంగా చూసినా ప్రజాస్వామ్య దేశాలు కావు. ప్రపంచ సంపన్న దేశాలలో అగ్రగాములూ కావు. తలసరి ఆదాయం ప్రకారం ప్రపంచంలో మొదటి పది సంపన్న దేశాలు : లక్సెంబర్గ్, ఐర్లండ్, స్విట్జర్లాండ్, నార్వే, అమెరికా, ఐస్‌లాండ్, డెన్మార్క్, సింగపూర్, ఆస్ట్రేలియా, ఖతార్. రాచరిక పాలనలో ఉన్న ఖతార్, ప్రజాస్వామ్య వ్యవస్థగా పరిగణనకు అర్హత ఉన్న సింగపూర్ మినహా ఇతర ఎనిమిది దేశాలూ సమగ్ర, సంపూర్ణ ప్రజాస్వామ్య దేశాలు. వీటిలో అమెరికా అధ్యక్షుడు ఎవరో ఖచ్చితంగా చెప్పగలను. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఎవరో కొంచెం ప్రయత్నించి చెప్పగలను. మిగతా ఆరు దేశాల అధ్యక్షుడు లేదా ప్రధానమంత్రి ఎవరో చెప్పలేను. ఇలా అనడంలో నా ఉద్దేశమేమిటో అర్థమయిందా? గొప్ప రాజనీతిజ్ఞులు కాని నాయకుల నేతృత్వంలో ఉన్నప్పటికీ ఒక దేశం, దాని ప్రజలు సంపన్నులూ, ప్రజాస్వామ్యవాదులూ కావడం సాధ్యమే. ప్రస్తావిత ఆరు దేశాల పరిపాలకులు, నాకు తెలిసినంతవరకు దురహంకారులు, అధికార దర్పం కలవారు కాదు. 


నిరంకుశ నేతల ఏలుబడి, పార్లమెంటుపై తీవ్ర అయిష్టత, మీడియా పట్ల తిరస్కార భావంతో ప్రజాస్వామ్యానికి చుక్కెదురు. ‘నాకు అన్నీ తెలుసు’, ‘నేనే ప్రజల రక్షకుడిని’ అనే అభిజాత్యాలకు ప్రజాస్వామ్యంలో చోటు లేదు. ఒక రాజకీయ పార్టీ ఒక బృహత్, సంపద్వంత, జవాబుదారీతనం లేని పార్టీగా పరిణమించినప్పుడు దాని నాయకులను, ముఖ్యంగా అధినేతను పైన పేర్కొన్న అహంకారాలు ఆవహిస్తాయి. ప్రపంచంలోనే తాము అతి పెద్ద రాజకీయ పక్షమని భారతీయ జనతా పార్టీ చెప్పుకుంటుంది. భారత్‌లో బీజేపీయే మహా సంపన్నమైన రాజకీయ పక్షమని మనకు తెలుసు. లోక్‌సభలో ఆ పార్టీకి 300 స్థానాలు ఉన్నాయి (మొత్తం సీట్లు 543); రాష్ట్ర శాసనసభల్లో మొత్తం 4036 స్థానాలకుగాను 1435 స్థానాలు బీజేపీయే. దేశంలోని మొత్తం 29 రాష్ట్రాలలో 17 బీజేపీ పాలనలో ఉన్నాయి. ఈ రాజకీయ, అధికార ప్రాబల్యాలు బీజేపీని ఒక ప్రపంచ అగ్రగామి రాజకీయ పక్షంగా చేశాయి. బీజేపీ ఒక మహాసంపద్వంతమైన రాజకీయ సంస్థ. ‘అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రైట్స్’ (ఎడిఆర్) ప్రకారం 2019–20లో బీజేపీకి విరాళాల రూపేణా రూ.2,642 కోట్లు లభించాయి. రాజకీయ పక్షాలకు వచ్చిన మొత్తం విరాళాలు రూ.3,577 కోట్లు మాత్రమే. ఈ విరాళాలన్నీ అజ్ఞాత వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చినవే. అప్రతిష్ఠాకర ఎన్నికల బాండ్ల ఆదాయం కూడా ఇందులో భాగం కావడం ఒక విశేషం. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ మొత్తం రూ.252 కోట్లు ఖర్చు పెట్టింది. ఇందులో రూ.151 కోట్లను ఒక్క పశ్చిమ బెంగాల్‌లోనే వినియోగించింది. ఈ అతిపెద్ద, మహా సంపన్న రాజకీయ పక్షం తిరుగులేని విజేత ఏమీ కాదు. ఓడిపోయిన రాష్ట్రాలలో ఇతర పార్టీల శాసనసభ్యులను వివిధ ప్రలోభాలతో వశపరచుకుని, విధేయ గవర్నర్ల తోడ్పాటుతో ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తోంది! ఈ చట్ట విరుద్ధ రాజకీయ విన్యాసాన్ని ‘ఆపరేషన్ లోటస్’ అని బీజేపీ శ్రేణులు సగర్వంగా చెప్పుకుంటున్నాయి!


మూడు సాగు చట్టాలను ఆమోదించడంలో, వాటిని మొండిగా సమర్థించడంలో మోదీ సర్కార్ దురహంకార ధోరణులు మనకు స్పష్టంగా కనిపించాయి. ఆ చట్టాలను తొలుత ఆర్డినెన్సులుగా జారీ చేసి, తరువాత బిల్లులుగా రూపొందించి, పార్లమెంటులో వాటిపై ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరిని రైతులు తీవ్రంగా నిరసించారు. ఢిల్లీ శివార్లలో పదిహేను నెలలుగా నిరసనోద్యమం నిర్వహిస్తున్నారు. ఉద్యమకారులతో మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధి లేని చర్చలు జరిపింది. ఆ చర్చలు రాజకీయ ప్రహసనాలుగా ప్రజలకు వినోదం కల్పించాయి. రైతులను, వారి నాయకులను అధికారంలో ఉన్న వారు నానా దుర్భాషలాడారు. పలు నిందలు మోపారు. ఉద్యమకారులు ఖలిస్థానీయులు, జాతి వ్యతిరేకులు అని ఆరోపించారు. రైతుల డిమాండ్లను పరిష్కరించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాన్ని కేంద్రం శిరసావహించలేదు. తన వాదనను మొండిగా సమర్థించుకుంది. వాస్తవాలను చూడ నిరాకరించింది. అయితే గూఢచర్య నివేదికలు ఎట్టకేలకు మోదీ సర్కార్ కళ్ళు తెరిపించాయి.


ఎన్నికలలో ఓటమి అనే దానికి మాత్రమే మోదీ ప్రభుత్వం భయపడుతుందని స్పష్టంగా రుజువయింది. దేశవ్యాప్తంగా 30 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు (బీజేపీకి కేవలం 7 మాత్రమే లభించాయి) వెలువడిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించారు. కేంద్ర కేబినెట్ ఆమోదం లేకుండానే సాగు చట్టాలను సైతం మోదీ నాటకీయంగా ఉపసంహరించుకున్నారు. లేనిపక్షంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా ఎన్నికలలో ఓడిపోవలసి వస్తుందని, పంజాబ్‌లో ఏకంగా ఉనికినే కోల్పోవలసివస్తుందని భయపడిపోవడం వల్లే మోదీ దిగివచ్చారు.


సరే, మోదీ ‘రాజనీతిజ్ఞత’ గురించి ఆయన మంత్రులు అదే పనిగా ప్రశంసిస్తూనే ఉన్నారు. సాగు చట్టాలకు ఆమోదం పొందినప్పుడు మోదీ రాజనీతిజ్ఞుడు అయితే, సాగు చట్టాలను రద్దుచేసినప్పుడు ఆయన ఒక మహా రాజనీతిజ్ఞుడు! భజనపరుల మాటల్లో ఔచిత్యముంటుందా? ఎన్నికలలో ఓడిపోతాననే భయం బీజేపీని వెన్నాడుతున్నంతవరకు భారత్‌లో ప్రజాస్వామ్యం మనుగడ సాగించగలదు. 2022 ఫిబ్రవరిలో జరిగే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఓడిపోతేనైనా బిజెపి పాలయితే ఆ పరాజయం తన దురహంకారాన్ని కొంతమేరకైనా విడనాడగలుగుతుందేమో!


పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2021-11-27T08:03:04+05:30 IST