సంక్షేమ పాలనలో ఢిల్లీ నమూనా

ABN , First Publish Date - 2020-03-10T06:36:58+05:30 IST

ఉచితాల ఉపకారమే ఆమ్ ఆద్మీ పార్టీ అధికార వైభవమా? 2018-–19 ఆర్థిక సంవత్సరంలో ఢిల్లీ పౌరుల తలసరి వార్షికాదాయం రూ.3,65,000. కాగా, యూపీలో రూ.61,000, బిహార్‌లో రూ.49,000. రాష్ట్ర ప్రభుత్వ తలసరి బడ్జెట్...

సంక్షేమ పాలనలో ఢిల్లీ నమూనా

ఉచిత విద్యుత్తు, ఉచిత నీటి సరఫరా, సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం..- ఈ సంక్షేమ ప్రదానాలే, ఇటీవల ఢిల్లీ విధాన సభ ఎన్నికలలో ఆప్‌కు మళ్ళీ విజయాన్ని సమకూర్చాయని భావిస్తున్నారు. అయితే ఈ సంక్షేమ నమూనాను ఇతర రాష్ట్రాలలో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బిహార్ లాంటి పెద్ద రాష్ట్రాలలో యథాతథంగా అమలుపరచడం సాధ్యమవుతుందా?


ఉచితాల ఉపకారమే ఆమ్ ఆద్మీ పార్టీ అధికార వైభవమా? 2018-–19 ఆర్థిక సంవత్సరంలో ఢిల్లీ పౌరుల తలసరి వార్షికాదాయం రూ.3,65,000. కాగా, యూపీలో రూ.61,000, బిహార్‌లో రూ.49,000. రాష్ట్ర ప్రభుత్వ తలసరి బడ్జెట్ రూ.37,000 (ఢిల్లీ), రూ.26,000 (యూపీ), రూ.19,000 (బిహార్). ఈ అంకెలు వాస్తవ వ్యత్యాసాలను వెల్లడించడం లేదు.ఎందుకంటే ఢిల్లీ పోలీసు విభాగం వ్యయాలను కేంద్ర పభుత్వమే భరిస్తుంది. పైపెచ్చు ఢిల్లీ ఒక నగర -రాజ్యమే. దూరాభారాలు పెద్దగా వుండవు గనుక రహదారులు తదితర సదుపాయాలపై తప్పక చేయవల్సిన వ్యయాలూ స్వల్పస్థాయిలోనే వుంటాయి. ఈ యథార్థాల దృష్ట్యా, ఆ మూడు రాష్ట్రాల తలసరి బడ్జెట్ రూ.50,000 (ఢిల్లీ), రూ.26,000 (యూపీ), రూ.19,000 (బిహార్)గా మాత్రమే ఉంటుందని చెప్పవచ్చు. కనుక, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం వలే, వివిధ ఆవశ్యక సేవలను పేద రాష్ట్రాలు ఉచితంగా అందించేందుకు ఆస్కారం ఎంత మాత్రం లేదు. 


ఇటువంటి ఉచితాల వల్ల ఎన్నికలలో సమకూరే లబ్ధి సైతం స్థిరమైనది కాదు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది; రైతు రుణాలను మాఫీ చేసింది. -ఈ సంక్షేమ చర్యల ఫలితంగా 2009 సార్వత్రక ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించింది. కానీ, 2014 లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోయింది. కాంగ్రెస్ ఓటమికి ఇతర కారణాలు కూడా ఉన్నాయనుకోండి. అయితే సంక్షేమ కార్యక్రమాలు ఏ ప్రభుత్వానికి రాజకీయ భరోసాలు కాబోవు. కాంగ్రెస్ ఓటమి చాటిన సత్యమిది. 2014 నుంచి ఇంతవరకు పది రాష్ట్రాలు పంట రుణాలను మాఫీ చేశాయి. ఇంకా చాలా రాష్ట్రాలు రైతులకు ఉచిత విద్యుత్తును సరఫరా చేశాయి. అయినప్పటికీ పాలక పార్టీలు ఎన్నికలలో ఓడిపోతూనే వున్నాయి. ఉచితాల లబ్ధి పొందిన ప్రజలు ప్రత్యుపకారం చేస్తారనే భరోసా రాజకీయ పార్టీల భ్రాంతి మాత్రమే. 


ఉచిత విద్యుత్, ఉచిత నీరు, ఉచిత ప్రయాణం ఇత్యాది సంక్షేమాలు పంట రుణాల మాఫీకి పూర్తిగా భిన్న మైనవి. రుణమాఫీ నుంచి ఒక రైతు వాస్తవంగా పొందే లబ్ధి ఏమీ వుండదు. ఒక రుణ భారం నుంచి మాత్రమే అతను ఉపశమనం పొందుతాడు. రుణ భారం తొలగిపోవడమనేది, ఉచిత విద్యుత్ సదుపాయం వలే అతని చైతన్యశీలతను ప్రభావితం చేయదు. స్థూల దేశియోత్పత్తి(జీడీపీ)లో వ్యవసాయ రంగం వాటా ఇప్పుడు కేవలం 17 శాతం మాత్రమే . దేశ జనాభాలో సగం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివశిస్తున్నప్పటికీ వారందరికీ వ్యవసాయమే జీవనాధారం కాదు. నేత, వడ్రంగం, కుండల తయారీ మొదలైన వృత్తులపై ఆధారపడిన వారి సంఖ్య తక్కువేమీ కాదు. వారి ఆర్థిక జీవనం పట్టణాలు, నగరాలతో ముడివడి వున్నది. ఉచిత విద్యుత్తు, పంట రుణాల మాఫీ నుంచి ఈ చేతి వృత్తుల వాళ్ళు పొందే లబ్ధి ఏమీ వుండదు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే ఉచిత విద్యుత్, ఉచిత నీరు, ఉచిత ప్రయాణ సదుపాయం అనేవి లబ్ధిదారుల కుటుంబ సభ్యులను కూడా అమితంగా ప్రభావితం చేస్తాయి. వాటిని సమకూర్చిన పాలకులకు రాజకీయ మద్దతు నిచ్చేందుకు సైతం వారిని అవి పురిగొల్పుతాయి. అయితే పంట రుణాల మాఫీ అనేది దాని నుంచి లబ్ధి పొందుతున్న రైతులలో మాత్రమే కృతజ్ఞతా భావాన్ని జనింప చేస్తుంది. మరి కుటుంబ పోషకుడు అతడే కదా. 


ఆర్థిక వనరులు పుష్కలంగా లేని రాష్ట్రాలు స్వల్పాదాయ వినియోగదారులకు ప్రతిపూర్వక ఆర్థిక సహాయం (క్రాస్- సబ్సిడీ) సమకూర్చి, సంపన్న వినియోగదారులపై పన్నులు, సుంకాలు పెంచాలి. సంక్షేమ వ్యయాలకు అయ్యే వ్యయాలను, సదరు పన్నులు, సుంకాలతో లభ్యమయ్యే రాబడి నుంచి సమకూర్చుకోవచ్చు. ఏతావాతా సంక్షేమ పాలనలో ఢిల్లీ నమూనాను ఇతర రాష్ట్రాలలో కూడా యథాతథంగా అమలుపరచడం సాధ్యమవుతుంది. అయితే అది ఈ కింది పరిస్థితులలో మాత్రమే సాధ్యమవుతుంది. క్రాస్ -సబ్సిడీలను సమకూరుస్తున్నప్పుడు; కొద్ది మంది రైతులకు గాక విస్తృత ప్రజానీకానికి ప్రయోజనాలు సమకూరే విధంగా సంక్షేమ పథకాలను రూపొందించినప్పుడు; సంవత్సరానికి ఒకసారి మాత్రమే సమకూరే ఏకకాలపు రుణ మాఫీ ప్రయోజనంతో కాకుండా కాకుండా ప్రతిరోజూ ప్రజలు నేరుగా లబ్ధి పొందే సేవలను సమృద్ధిగా అందించినప్పుడు మాత్రమే ఢిల్లీ సంక్షేమ నమూనా అమలు ఇతర రాష్ట్రాలలోనూ సాధ్యమవుతుంది. 


ఆమ్ ఆద్మీ పార్టీ విజయానికి దోహదం చేసిన రెండో అంశం మెరుగైన విద్యా వైద్యసేవలను అందించడం. రోగగ్రస్తులు, ఉపశమనానికి అవసరమైన ఔషధాలు అన్నిటినీ కాకపోయినప్పటికీ కొన్ని ఉచిత మందులు పొందగలుగుతున్నారు. డాక్టర్లు వారికి సకాలంలో అందుబాటులో ఉండి రోగనిదానం చేస్తున్నారు. పాఠశాల తరగతి గదుల్లో సదుపాయాలు మెరుగుపడ్డాయి. ఆటస్థలాలు, ఆడిటోరియంల పరిస్థితికూడా గణనీయంగా మెరుగుపడింది. ప్రభుత్వ నిర్ణయాలను అమలుపరచడంలో ఉప ముఖ్యమంత్రి సిసోడియా ఎటువంటి శషభిషలకు తావివ్వకుండా నిక్కచ్చిగా వ్యవహరించడం కూడా విద్యా వైద్య సదుపాయాల మెరుగుదలకు విశేషంగా తోడ్పడింది. ఫిర్యాదుదారులకు ఆయన నిరంతరం అందుబాటులో వుండి తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను వెన్వెంటనే పరిష్కరించేవారు. పాఠశాలలు, ఆస్పత్రులను తరచు సందర్శిస్తూ ఎవరు ఎలా పనిచేస్తుందీ గమనించేవారు. విధులను చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నవారిని వ్యక్తిగతంగా గుర్తించి ప్రోత్సహించేవారు. విధులపై శ్రద్ధ చూపని, సమర్థంగా నిర్వహించని వారిపై చర్యలు చేపట్టేవారు. యూపీ, బిహార్ లాంటి పెద్ద రాష్ట్రాలలో విద్యా వైద్య రంగాలలో వ్యక్తి స్థాయిలో సేవల మెరుగుదల ఢిల్లీలో వలే సాధ్యమయ్యే విషయం కాదు. సమస్యలకు క్రమబద్ధమైన, సమగ్ర పరిష్కారాలను అభివృద్ధిపరచుకోవడమే సుపరిపాలనకు ఉత్తమ మార్గం. స్వతంత్ర తనిఖీలు, గూఢచారుల నియామకం, ఆస్పత్రి సేవలను ఉపయోగించుకున్నవారి; పాఠశాల బాలల తల్లిదండ్రుల అజ్ఞాత మూల్యాంకనాలు మొదలైన పద్ధతుల ద్వారా సుపరిపాలనను సమకూర్చడం సాధ్యమవుతుంది. 


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2020-03-10T06:36:58+05:30 IST