థీమ్‌.. సాధించెన్‌

ABN , First Publish Date - 2020-09-15T09:51:02+05:30 IST

ఎట్టకేలకు వరల్డ్‌ మూడో ర్యాంకర్‌ డొమినిక్‌ థీమ్‌ గ్రాండ్‌స్లామ్‌ కల నెరవేరింది.

థీమ్‌.. సాధించెన్‌


తొలి యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ కైవసం 

పోరాడి ఓడిన జ్వెరెవ్‌


న్యూయార్క్‌: ఎట్టకేలకు వరల్డ్‌ మూడో ర్యాంకర్‌ డొమినిక్‌ థీమ్‌ గ్రాండ్‌స్లామ్‌ కల నెరవేరింది. ఆస్ట్రియాకు చెందిన ఈ రెండో సీడ్‌ యూఎస్‌ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచాడు. సోమవారం తెల్లవారుజామున హోరాహోరీగా జరిగిన ఫైనల్లో అతడు 2-6, 4-6, 6-4, 6-3, 7-6 (8-6) తేడాతో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)పై గెలిచాడు. ఇలా మొదటి రెండు సెట్లు కోల్పోయినా యూఎస్‌ ఓపెన్‌ను గెలుచుకోవడం 71 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. అంతేకాకుండా ఆస్ర్టియా నుంచి ఈ టోర్నమెంట్‌ గెలిచిన ఏకైక ఆటగాడయ్యాడు. 2018, 2019 ఫ్రైంచ్‌ ఓపెన్‌లోనూ, ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లోనూ అతడు ఆఖరి మెట్టుపై తడబడ్డాడు. చివరకు నాలుగో గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో ఊపిరి పీల్చుకున్నాడు. విజేతగా నిలిచిన 27 ఏళ్ల థీమ్‌కు రూ.22 కోట్లు, జ్వెరెవ్‌కు రూ.11 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది.


సీన్‌ రివర్స్‌: సెమీ్‌సలో బుస్టాపై తొలి రెండు సెట్లు కోల్పోయినా గెలిచిన జ్వెరెవ్‌కు అంతిమ పోరులో మాత్రం సీన్‌ రివర్స్‌ అయింది. ఈ మ్యాచ్‌లో పదునైన ఏస్‌లతో బెంబేలెత్తిస్తూ థీమ్‌పై 6-2, 6-4తో మొదట పైచేయి సాధించాడు. ఇక మరో సెట్‌ గెలిస్తే అతడి కల నెరవేరినట్టేనని అంతా భావించగా.. థీమ్‌ అద్భుతంగా పుంజుకున్నాడు. తన బలమైన గ్రౌండ్‌స్ట్రోక్స్‌తో మూడు, నాలుగు సెట్లను వశం చేసుకున్నాడు. 


హోరాహోరీ: ఇక ఫలితాన్ని తేల్చే ఐదో సెట్‌ యుద్ధాన్నే తలపించింది. ఏ ఒక్కరూ తగ్గకుండా నువ్వా.. నేనా అనే రీతిలోనే గేమ్‌లను గెలుచుకుంటూ ఒకరి సర్వీ్‌సను మరొకరు బ్రేక్‌ చేస్తూ రావడంతో టైబ్రేక్‌ అనివార్యమైంది. దీంట్లోనూ జ్వెరెవ్‌ పట్టు వీడకున్నా 6-7 దగ్గర వైడ్‌ ఆడడంతో థీమ్‌ గట్టెక్కాడు. జ్వెరెవ్‌ మొత్తం 15 ఏస్‌లు, 15 డబుల్‌ఫాల్ట్‌లు చేయగా థీమ్‌ 8 ఏస్‌లు, 8 డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు.


ఇటు థీమ్‌.. అటు జ్వెరెవ్‌. ఇద్దరికీ ఇదే తొలి యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌. ఒక్కరి ఖాతాలోనూ ఇప్పటిదాకా గ్రాండ్‌స్లామ్‌ లేదు. అందుకే.. సువర్ణావకాశాన్ని వదలకూడదనే ఇద్దరి పట్టుదల కారణంగా నాలుగు గంటలపాటు సాగిన ఈ మ్యాచ్‌ ఏకంగా ఐదు సెట్ల వరకు వెళ్లింది. అయితే తొలి రెండు సెట్లు చేజారినా ఆత్మవిశ్వాసం.. పట్టుదల.. సంయమనం కోల్పోని డొమినిక్‌ థీమ్‌ టైటిల్‌ దక్కించుకుని చరిత్ర సృష్టించాడు. దీంతో ఆరేళ్ల తర్వాత టెన్నిస్‌ ప్రపంచం సరికొత్త చాంపియన్‌ను చూసింది..  

1949లో పాంచో గొంజాలెజ్‌ (అమెరికా) తర్వాత తొలి రెండు సెట్లు కోల్పోయిన ఆటగాడు యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌గా నిలవడం ఇదే తొలిసారి. అలాగే యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో టైబ్రేక్‌ ద్వారా గెలవడం ఇదే మొదటిసారి


90వ దశకంలో పుట్టి గ్రాండ్‌స్లామ్‌ గెలిచిన ఆటగాడిగా థీమ్‌ రికార్డు


టెన్నిస్‌ చరిత్రలో వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌ (2019లో వింబుల్డన్‌, యూఎస్‌ ఓపెన్‌, 2020లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, యూఎస్‌ ఓపెన్‌) ఐదు సెట్ల పాటు సాగడం ఇదే తొలిసారి


ఆస్ట్రియా తరఫున థామస్‌ మస్టర్‌ (1995, ఫ్రెంచ్‌ ఓపెన్‌) తర్వాత రెండో గ్రాండ్‌స్లామ్‌ నెగ్గిన ప్లేయర్‌ థీమ్‌


2009లో డెల్‌ పొట్రో (యూఎస్‌ ఓపెన్‌) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌ గెలిచిన అత్యంత పిన్న వయస్కుడు 27 ఏళ్ల థీమ్‌ 


తొలి రెండు సెట్లను గెలిచి కూడా మ్యాచ్‌ని ఓడిపోవడం అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌కు  కెరీర్‌లో ఇదే తొలిసారి


ఓవరాల్‌గా గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో తొలి రెండు సెట్లు కోల్పోయినా విజేతగా నిలిచిన ఐదో ప్లేయర్‌ థీమ్‌. గతంలో బోర్న్‌ బోర్గ్‌ (1974), ఇవాన్‌లెండిల్‌ (1984), ఆండ్రీ అగస్సీ (1999), గస్టోన్‌ గాడియో (2004) ఉన్నారు. వీరంతా ఫ్రెంచ్‌ ఓపెన్‌లోనే ఈ ఫీట్‌ సాధించడం విశేషం

Updated Date - 2020-09-15T09:51:02+05:30 IST