నెరవేరనున్న సొంతింటి కల

ABN , First Publish Date - 2022-07-09T04:45:37+05:30 IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇళ్లు లేని నిరుపేదల సొంతింటి కల నెరవేరనుంది. ఇళ్ల నిర్మాణాలు చేపట్టి దాదాపు ఐదు సంవత్సరాలు కావస్తున్నా లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో ఆ ఇళ్లు నిరుపయోగంగా మారాయి. ఎట్టకేలకు ఇళ్ల నిర్మాణం పనులు పూర్తికావడంతో ఆ ఇళ్ల పంపిణీకి ఎట్టకేలకు మోక్షం లభించింది.

నెరవేరనున్న సొంతింటి కల
పంపిణీకి సిద్ధంగా ఉన్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు

- కామారెడ్డిలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీకి మోక్షం

- ఇళ్లను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్న అధికారులు

- కామారెడ్డిలో 720 ఇళ్ల నిర్మాణాలు పూర్తి

- ఈనెల 13 వరకు దరఖాస్తుల స్వీకరణ

- వార్డుల వారీగా దరఖాస్తులు తీసుకుంటున్న అధికారులు


కామారెడ్డి టౌన్‌, జూలై 8: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇళ్లు లేని నిరుపేదల సొంతింటి కల నెరవేరనుంది. ఇళ్ల నిర్మాణాలు చేపట్టి దాదాపు ఐదు సంవత్సరాలు కావస్తున్నా లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో ఆ ఇళ్లు నిరుపయోగంగా మారాయి. ఎట్టకేలకు ఇళ్ల నిర్మాణం పనులు పూర్తికావడంతో ఆ ఇళ్ల పంపిణీకి ఎట్టకేలకు మోక్షం లభించింది. పట్టణంలో పలు ప్రాంతాల్లో నిర్మించిన 720 డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తికావడంతో ఆ ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇళ్లు లేని నిరుపేదలు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఇదివరకే అధికారులు ప్రకటన జారీ చేశారు. ఈ నెల 4 నుంచి వార్డుల వారీగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 13వ తేదీ వరకు ఇళ్ల లేని నిరుపేదల నుంచి దరఖాస్తులు తీసుకోనున్నారు.

కామారెడ్డిలో పూర్తయిన 720 ఇళ్ల నిర్మాణ పనులు

కామారెడ్డి నియోజకవర్గంలోని పట్టణ కేంద్రంలో ఇళ్ల లేని నిరుపేదలకు డబుల్‌బెడ్‌రూం ఇళ్ల  కేటాయించేందుకు పలు ప్రాంతాల్లో జీ ప్లస్‌ 2,3 ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. పట్టణంలోని రాజీవ్‌నగర్‌కాలనీ, దేవునిపల్లి, టెక్రియాల్‌, అడ్లూర్‌, రామేశ్వర్‌పల్లి, ఇల్చిపూర్‌ తదితర ప్రాంతాల్లో మొత్తం 720 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. అయితే నిర్మాణం పూర్తయి ఏళ్లు గడుస్తున్నా అంతర్గత పనులు కాక పంపిణీకి నోచుకోవడం లేదు. ఎప్పుడు ఇళ్లు పంపిణీ చేస్తారోనని పేదలు నిరీక్షిస్తున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తవడంతో వీటిని అర్హులైన వారికి కేటాయించడంతో జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 4 నుంచి 13వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకోనున్నారు. దరఖాస్తుదారులు మున్సిపల్‌ పరిధిలోని వారై ఉండాలి. ఆధార్‌, రేషన్‌, ఓటరు ఐడీ కార్డులన్నీ మున్సిపల్‌ పరిధిలో ఉంటేనే దరఖాస్తులకు అర్హులు. వేరే గ్రామాల్లో గుర్తింపు కార్డులు ఉన్నవారు పట్టణ పరిధిలో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకొనే అవకాశం లేదు. సొంత స్థలం, సొంత ఇళ్లు లేని నిరుపేదలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డ్రా పద్ధతిన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లను కేటాయించనున్నారు.

వార్డుల వారీగా దరఖాస్తుల స్వీకరణ

కామారెడ్డి పట్టణంలో నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇళ్లను అర్హులైన పేదలకు కేటాయించేందుకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. వార్డుల వారీగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అడ్లూర్‌ గ్రామ పంచాయతీ భవనంలో 1వ వార్డులోని పేదల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రామేశ్వర్‌పల్లి పాత గ్రామ పంచాయతీ భవనంలో 2వ వార్డు, హరిజనవాడలోని ఓల్డ్‌ ఎస్సీ బాయ్స్‌ హాస్టల్‌లో 3,4,26,27 వార్డులకు చెందిన వారి నుంచి, ఇస్లాంపూర్‌లోని హసన్‌ ఫంక్షన్‌హాల్‌లో 5,29,30,31 వారి నుంచి, పాత రాజంపేట్‌ పాత గ్రామ పంచాయతీ భవనంలో 6వ వార్డు నుంచి, ఆర్‌బీ నగర్‌లోని ప్రైమరీ స్కూల్‌లో 7,8,32 వార్డుల వారి నుంచి లింగంపూర్‌లోని పాత గ్రామ పంచాయతీ భవనంలో 9,11 వార్డుల వారి నుంచి, దేవునిపల్లిలోని గ్రామ చావిడిలో 10,12 వార్డుల నుంచి, టెక్రియాల్‌ పాత గ్రామ పంచాయతీ భవనంలో 13వ వార్డుల వారి నుంచి, దేవునిపల్లిలోని కమ్యూనిటీ హాల్‌లో 14,34,.35వ వార్డు వారి నుంచి, మున్సిపల్‌ కార్యాలయంలో 15,16,17,38,39,40 వార్డుల వారి నుంచి, బతుకమ్మ కుంటలోని ఉర్దూ భవన్‌లో 18,41,42,48,49 వార్డుల వారి నుంచి, టీచర్స్‌ కాలనీలోని ముదిరాజ్‌ సంఘం భవనంలో 19,43 వార్డుల వారి నుంచి, ఇందిరానగర్‌లోని ఉర్దూ మీడియం ప్రైమరీ స్కూల్‌లో 20,21,22,23,24,25వ వార్డుల వారి నుంచి, గడిరోడ్డులోని ఓ ఫంక్షన్‌హాల్‌లో 28,44,45,46,47 వార్డుల వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

Updated Date - 2022-07-09T04:45:37+05:30 IST