ఆరుబయటే మందు...విందు!

ABN , First Publish Date - 2022-01-17T04:59:26+05:30 IST

అసలే పండుగ రోజులు.. దీనికి తోడు ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించడంతో మందుబాబులు రెచ్చిపోతున్నారు. బహిరంగ ప్రదేశాలను తమ ‘సిట్టింగ్‌’కు వేదికలుగా మార్చేస్తున్నారు. కొవిడ్‌ నిబంధనలు గాలికొదిలేస్తున్నారు.

ఆరుబయటే మందు...విందు!
శ్రీకాకుళంలో ఒక మద్యం దుకాణం వద్ద భౌతిక దూరం పాటించని దృశ్యం

- ఎక్కడికక్కడే మందుబాబుల చిందులు

- బెంబేలెత్తుతున్న జనాలు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

అసలే పండుగ రోజులు.. దీనికి తోడు ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించడంతో మందుబాబులు రెచ్చిపోతున్నారు. బహిరంగ ప్రదేశాలను తమ ‘సిట్టింగ్‌’కు వేదికలుగా మార్చేస్తున్నారు. కొవిడ్‌ నిబంధనలు గాలికొదిలేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు మద్య నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పిన సీఎం జగన్‌... ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. తాజాగా ధరలు తగ్గించి మరీ మందుబాబులకు ఇష్టమొచ్చినంత తాగే అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. మరోవైపు మందుబాబులు ఆరుబయటే తాగడం, వీరంగం సృష్టించడం పరిపాటిగా మారింది. అధికారుల గణాంకాల ప్రకారం జిల్లాలో 158 మద్యం రిటైల్‌ దుకాణాలతో పాటు ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో 19 ఔట్‌లెట్స్‌, 17 బార్లు కొనసాగుతున్నాయి. సంక్రాంతి పండగ రోజులు కావడంతో దుకాణాలు మందుబాబులతో కిటకిటలాడుతున్నాయి. గతంలో మాదిరిగా వీటి వెనుక భాగంలో తాగేందుకు ఏర్పాట్లు ఉండడం లేదు. దీంతో మందుబాబులు ఆరుబయటే తాగి... ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. శ్రీకాకుళం నగరంలోని అనేక వీధుల్లో మందుబాబులు మూసి ఉన్న దుకాణాల వరండాల్లోనూ, పాన్‌షాపుల వద్ద బహిరంగంగా తాగుతున్నారు. స్థానిక ఏడురోడ్ల కూడలి, డే అండ్‌ నైట్‌, రామలక్ష్మణ, బలగ కూడలి, మార్కెట్‌, రైతు బజారు, జీటీ రోడ్డు, అరసవిల్లి వెళ్లే కూడళ్ల వద్ద ఆరుబయటే మందు తాగుతూ వీరంగం సృష్టిస్తున్నారు. వీరి వల్ల మహిళలు, చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. కొన్నిసార్లు శాంతిభద్రతల సమస్యలూ తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఆరుబయట మద్యం తాగడాన్ని అరికట్టాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.


కానరాని కొవిడ్‌ నిబంధనలు...

మద్యం దుకాణాల వద్ద విధిగా భౌతిక దూరాన్ని పాటించాల్సి ఉన్నా, ఎక్కడా పాటించడం లేదు. కరోనా మొదటి దశ సమయంలో మద్యం దుకాణాలకు వచ్చేవారు విధిగా గొడుగు పట్టుకొని, మాస్క్‌ ధరించాల్సి వచ్చేది. ఈ నిబంధన ఇప్పుడు అమలుకు దూరమయ్యింది. వీటితో పాటు బారికేడ్లూ ఎక్కడా కానరావడం లేదు. మందుబాబుల వీరంగంపై ప్రొహిబిషన్‌, ఎక్జైజ్‌ శాఖ సూపరింటెండెంట్‌ సీహెచ్‌ దాసు వద్ద ’ఆంధ్రజ్యోతి’ ప్రస్థావించగా... ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద సీసాలు మాత్రమే విక్రయిస్తున్నామని తెలిపారు. ఆరు బయట మద్యం తాగితే తమకు సంబంధం ఉండదన్నారు. అలాంటి వ్యక్తులతో ఎవరికైనా ఇబ్బంది కలిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. దుకాణాల వద్ద కోవిడ్‌ నిబంధనలు అమలు చేయాల్సిందేనని తెలిపారు. 

Updated Date - 2022-01-17T04:59:26+05:30 IST