రాజుకుంటున్న ఎన్నికల వేడి

ABN , First Publish Date - 2021-10-27T06:11:24+05:30 IST

దర్శి నగర పంచాయతీకి ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమౌతోంది. దీంతో టికెట్లు ఆశించే నాయకులు తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

రాజుకుంటున్న ఎన్నికల వేడి
దర్శి నగర పంచాయతీ కార్యాలయం

అధికార పార్టీకి ఆశావహుల తలనొప్పి 

పోటీకి సిద్ధపడుతున్న టీడీపీ 

పోలింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

దర్శి, అక్టోబరు 26 : దర్శి నగర పంచాయతీకి ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమౌతోంది. దీంతో టికెట్లు ఆశించే నాయకులు తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధికార పార్టీ టికెట్ల కోసం అధికసంఖ్యలో నాయకులు పోటీపడుతున్నారు. దర్శి నగర పంచాయతీ చైర్మన్‌ పదవిని కాపులకు కేటాయించాలని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైర్మన్‌ పదవి కోసం కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు తీవ్రంగా పయత్నిస్తున్నారు. వైసీపీ నాయకులు వైవీ.సుబ్బయ్య, ముక్తినీడి సాంబయ్య, తెలగంశెట్టి చంద్రశేఖర్‌, కట్టెకోట హరీష్‌ తదితరులు తీవ్రంగా పోటీ పడుతున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే వేణుగోపాల్‌ కాపు నాయకుల్లో ఎవరిని చైర్మన్‌అభ్యర్థిగా నియమిస్తారో అనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అదేవిదంగా వార్డు సభ్యులకు టికెట్ల కోసం అధికసంఖ్యలో నాయకులు తమవంతు ప్రమత్నాలు చేస్తున్నారు. పరోక్ష ఎన్నిక ద్వారా చైర్మన్‌ను ఎన్నుకునే విధానం అమల్లో ఉన్నందున వార్డు సభ్యులకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటికే అనేకమంది నాయకులు తమకు టికెట్లు కేటాయించాలని ఎమ్మెల్యే వేణుగోపాల్‌కు విన్నవించుకున్నట్లు సమాచారం. కొద్దిరోజుల్లో నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉన్నందున ఈలోపు నాయకులు టికెట్లు దక్కించుకునే ప్రయత్నాలు ముమ్మరం  చేస్తున్నారు.

పోటీకి సిద్ధమవుతున్న టీడీపీ

 నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ సిద్ధమౌతోంది. ఆ పార్టీ నాయకులు వార్డుల వారీగా పరిశీలించి బలమైన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నారు. పార్టీ అదిష్టానం బాధ్యతలను దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ పమిడి రమేష్‌, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావులకు అప్పగించినట్లు సమాచారం. దర్శి నగర పంచాయతీలో 20 వార్డులు ఉన్నాయి. 27674 మంది ఓటర్లు ఉన్నారు. అధికారులు ఇప్పటికే 40 పోలింగ్‌ కేంద్రాలను నిర్ధారించారు. నోటిఫికేషన్‌ ఎప్పుడు వెలువడినా ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - 2021-10-27T06:11:24+05:30 IST