పాడుతూ ఉండాలి తియ్యగా...

ABN , First Publish Date - 2020-08-30T05:35:50+05:30 IST

చాలా కాలం క్రితం గంధర్వులు ఆకాశంలో విహరిస్తుంటే.. ఒక గాన గంధర్వుడు తప్పిపోయి భూలోకానికి వచ్చేశాడు. ఎలాగా వచ్చాం కదా అని మానవ రూపం ధరించి అందరికీ గానామృతం పంచటం మొదలుపెట్టాడు. బాలును చూస్తే నాకెందుకో ఈ కథ నిజమేనేమో.. ఆ గంధర్వుడు బాలునేనేమో అనిపిస్తుంది...

పాడుతూ ఉండాలి తియ్యగా...

చాలా కాలం క్రితం గంధర్వులు ఆకాశంలో విహరిస్తుంటే.. ఒక గాన గంధర్వుడు తప్పిపోయి భూలోకానికి వచ్చేశాడు. ఎలాగా వచ్చాం కదా అని మానవ రూపం ధరించి అందరికీ గానామృతం పంచటం మొదలుపెట్టాడు. బాలును చూస్తే నాకెందుకో ఈ కథ నిజమేనేమో.. ఆ గంధర్వుడు బాలునేనేమో అనిపిస్తుంది.


శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యంతో నాది ఐదు పదుల స్నేహం. బాలునే కాదు.. ఆయన తండ్రిగారు కూడా నాకు బాగా తెలుసు. బాలు గురించి నేను తొలిసారి విన్నది 1960లలో. తను తిరుపతి శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్‌ కళాశాలలో ప్రీ యూనివర్సిటీ తరగతిలో చదువుతుండేవారు. నేను శ్రీ వేంకటేశ్వర హైయర్‌ సెకండరీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదివేవాడిని. మా పక్క (మిట్ట) వీధిలో తను ఉండేవారు. మా కొత్త వీధిలో బాలుకు కొందరు చుట్టాలుండేవారు. వారి ఇంటికి వస్తూ పోతూ ఉండేవారు. పాటలు బాగా పాడతాడని బాలుకు అప్పుడే పెద్ద పేరు. ఆ తర్వాత నాకు ప్రత్యక్ష పరిచయం చెన్నపట్నంలోనే. బాలు పాటలు పాడటం ప్రారంభించి గాయకుడిగా స్థిరపడుతున్న సమయంలో నేను మద్రాసులో ఎంఏ చదువుతూ ఉండేవాడిని. తిరుపతి పరిచయం వల్ల అప్పుడప్పుడు వాళ్లింటికి వెళ్తూ ఉండేవాడిని. అలా వారి తండ్రిగారు కూడా నాకు తెలుసు. బాలులాగానే ఆయన కూడా మృదుస్వభావి. ఆయనకు అనేక విషయాలపై ఆసక్తి. వాళ్లింటికి వెళ్లినప్పుడు వాటిని నాకు చెబుతూ ఉండేవారు. ఈ లక్షణాలు తండ్రి నుంచి బాలుకు సంక్రమించి ఉండవచ్చు. వారిద్దరి మాటలోను, పాటలోను చిన్న అపశ్రుతి కూడా ఉండేది కాదు. అలా మా పరిచయం పెరిగింది. ఒక దశలో మేము ప్రతి రోజూ కలుసుకుంటూ ఉండేవాళ్లం. 1969 అక్టోబర్‌ నుంచి 1975 చివరిదాకా మేం కలుసుకోని రోజు లేదు. ఆ రోజుల్లో బాలుకు ఒక స్కూటర్‌ ఉండేది. ఆ స్కూటర్‌ వెనక సీట్లో కూర్చుని.. ఆయన, నేను అద్దె ఇళ్ల కోసం వేటాడిన రోజులు ఎన్నో! పాటల రికార్డింగులకు వెళ్లిన రోజులు ఇంకెన్నో! వయస్సులో కొద్దిగానే పెద్దయినా- ఆయనను నేను అన్నగారు అని పిలిచేవాడిని. ఆయన నన్ను తమ్ముడు అని పలకరించేవారు. ఈ మధ్యలో కలుసుకున్నప్పుడు కూడా అదే పిలుపు. మొదటి రోజు చూపించిన అప్యాయతలో ఏ లేశం కూడా తగ్గలేదు. 


నేను ఎంఏ చదువుకుంటూనే ఆసక్తి కొద్ది మద్రాసులోని తెలుగు పత్రికలకు వ్యాసాలు రాయటానికి ప్రయత్నిస్తూ ఉండేవాడిని. ‘సినిమారంగం’ పత్రిక ‘అసోసియేట్‌ ఎడిటర్‌’ జి.వి.జి. కృష్ణ (గడియారం వేణుగోపాలకృష్ణ)గారు - సినిమా సంగీతం గురించి నన్ను రాయమని కోరారు. అది బాలు గురించి. ఆయన గురించి వీలైనంత పెద్ద వ్యాసం రాస్తే ప్రచురిస్తామన్నారు. అది భిన్నంగా ఉంటే బావుండనిపించింది. దీనితో నేను ఆయనను అనేక సార్లు కలిశాను. ఆయన తమ అనుభవాలు చెబుతూ ఉండేవారు. వీటన్నింటితో నేను రాసిన వ్యాసం-  ‘సినిమారంగం’ పత్రిక 1970, జూలై నెల సంచికలో ‘గోష్ఠి’ అనే శీర్షికన వెలువడింది. తమ నోట పాటలు పాడించిన పదముగ్గురు సంగీత దర్శకులతో ఆయన అనుభవాలను ఆ శీర్షికలో ప్రచురించాం. అప్పట్లో అదొక వినూత్న ప్రక్రియ. ఈ వ్యాసం ప్రచురించిన తర్వాత ఆయనతో నాకున్న సాన్నిహిత్యం మరింత పెరిగింది.


ఇతరులు చెప్పే విషయాలను వినటం.. మంచిని గ్రహించటం.. చెడును వదిలేయటం బాలు వ్యక్తిత్వంలో ఒక ప్రధాన పార్శ్వం. దీనితో మా మధ్య అనేక అంశాలపై చర్చలు జరుగుతూ ఉండేవి. పాటల గురించి నాకు పెద్దగా తెలియకపోయినా- నా అభిప్రాయాలను ఆయన పరిగణనలోకి తీసుకొనేవారు. దీనిని వివరించటానికి ఒక ఉదాహరణ ఉటంకిస్తా. మానవుడు-దానవుడు సినిమా పాటల రికార్డింగ్‌కు బాలుతో పాటుగా నేను వెళ్లా. సీనియర్‌ సంగీత దర్శకుడు అశ్వత్థామ ఆ సినిమాకు సంగీతం అందించారు. సుశీలతో కలిసి బాలు - ‘అణువూ అణువున వెలసిన దేవా’ పాటను పాడారు. నేను బయట కూర్చుని వింటున్నా. రికార్డింగ్‌ పూర్తయిపోయింది. బాలు పాట పాడి బయటకు వచ్చి ‘‘పాట ఎలా ఉంది’’  అని అడిగారు. సంగీతానికి నేను శ్రోతనే కానీ మంచి విమర్శకుడిని కాను. అయినా మనసులో ఏదో వెలితి. పాట శ్రుతి సరిపోయినట్లు అనిపించటం లేదు. దాంతో బాలుతో కాస్త సందిగ్దంగా- ‘‘ఎక్కువ శ్రుతిలో పాడితే బావుంటుందేమో! ’’ అన్నా. 


మమల్ని దూరం నుంచి సంగీత దర్శకులు అశ్వత్థామ గమనిస్తున్నారు. మా దగ్గరకు వచ్చి విషయమేమిటని అడిగారు. బాలు నా అభిప్రాయం చెప్పారు. అప్పటికే వాద్య కళాకారులు వెళ్లిపోవటానికి సరంజామా సర్దేసుకుంటున్నారు. సాధారణంగా అయితే రికార్డింగ్‌ పూర్తయిన తర్వాత మార్పులు చేయటానికి సంగీత దర్శకులు ఇష్టపడరు. గాయకులు కూడా ఇబ్బంది పడతారు. కానీ బాలు ఏ మాత్రం సంకోచం లేకుండా శ్రుతి పెంచి అశ్వత్థామగారికి పాట పాడి వినిపించారు. ఆ వెర్షన్‌ అశ్వత్థామ గారికి నచ్చింది. వెంటనే ఆయన రికార్డింగ్‌ ముగించి వెళ్లిపోతున్న వాద్యకళాకారులనూ, సుశీలగారినీ మళ్లీ రికార్డింగ్‌ థియేటర్‌కి పిలిచారు. మరో వెర్షన్‌ రికార్డు చేశారు. ఆ పాట ఎప్పుడు విన్నా- బాలు అణుకువ.. అశ్వత్థామ గారి సౌజన్యం గుర్తుకొస్తాయి. 


బాలు అంటే నాకు గుర్తుకొచ్చే మరో అంశం జ్ఞాపకశక్తి. ఒకసారి కలిసిన వ్యక్తిని కానీ.. ఒకసారి పాడిన పాటను కానీ ఆయన మర్చిపోయేవారుకారు. చదువు పూర్తయిన తర్వాత నేను ఆకాశవాణిలో చేరా. బాలు 25 ఏళ్ల సినీప్రస్థానం పూర్తయిన సందర్భంగా ఆకాశవాణిలో ఒక ఇంటర్వ్యూ ప్రసారం చేశాం. దీని కోసం నాతో పాటుగా తమిళ భాష ప్రొడ్యూసర్‌ ఒకరు వచ్చారు. మాటామంతి పూర్తయిన తర్వాత ఆయన- ‘‘పదేళ్ల క్రితం నేను మీ చేత తమిళంలో కుటుంబ సంక్షేమం కార్యక్రమం కోసం పాటలు రికార్డు చేశాను’’ అన్నారు. అంతటితో ఆగకుండా ఒక పల్లవి కూడా వినిపించారు. వెంటనే బాలు పదేళ్ల క్రితం పాడిన మొత్తం పాటను పాడి మాకు వినిపించారు. పదేళ్ల క్రితం పాటను గుర్తు పెట్టుకోవటం.. దానిని మళ్లీ పాడటం అంత సులభం కాదు. ఆయన జ్ఞాపకశక్తి అలాంటిది. మద్రాసుకు వచ్చిన తొలిరోజుల్లో అనేక సంఘటనలు ఆయన ఇప్పటికీ పూసగుచ్చినట్లు అందంగా చెప్పగలరు. 




1976 తర్వాత బాలు చాలా బిజీ అయిపోయారు. నేను కూడా ఉద్యోగరీత్యా హైదరాబాద్‌ వచ్చేసా. కొద్ది కాలం అప్పుడప్పుడు తప్పితే- తరచూ కలుసుకోవటం కుదిరేది కాదు. కానీ ఎప్పుడు కలిసినా ఆయన అంతే ఆప్యాయంగా మాట్లాడేవారు. ఏ మాత్రం భేషజం కనిపించేది కాదు. మళ్లీ 1991 తర్వాత ఆయనతో కలిసి ప్రయాణం చేసే అవకాశం లభించింది. ఆ సమయంలోనే నేను ఘంటసాల మాస్టారి జీవిత చరిత్ర- ‘‘మన ఘంటసాల’’ రాయటం మొదలుపెట్టాను. దానిని రాయమని ప్రోత్సహించింది.. ఆర్థికంగా.. హార్దికంగా సాయం చేసింది బాలునే! ఇక్కడ ఘంటసాల మాస్టారుకు, బాలుకు ఉన్న అనుబంఽధం గురించి కొద్దిగా చెప్పాలి. ఎన్నో సార్లు బాలు అనేక వేదికల్లో ఆ అనుబంధాన్ని చెబుతూ వచ్చారు. అయినా ఈ అనుబంధాన్ని తప్పనిసరిగా ప్రస్తావించాలి. వారిద్దరిది ఆత్మీయ బంధం. ఏ మాత్రం పొరపొచ్చాలు ఉండేవి కావు. అయినా వారిద్దరి మధ్య పోటీ ఉందని కొందరు నమ్మేవారు. వదంతులు సృష్టించేవారు. ఇక్కడ ఒక తమాషా సంఘటన చెప్పాలి.  ఏదో ఒక పత్రికలో - వాహినీ స్టూడియోలో మాస్టారును బాలు కత్తితో పొడిచాడని వార్త వచ్చింది. దీనిని చూసి నేను, బాలు నవ్వుకున్నాం. ఘంటసాల మాస్టారికి బాలు అంటే చాలా ఇష్టం. తన తర్వాత వారసుడు బాలునే అని ఒక సందర్భంలో చెప్పారు. అదే నిజమైంది కూడా! మాస్టారి వాక్శుద్ధి అలాంటిది. దాని గురించి కూడా కొంత చెబుతా!  ఒక సారి నేను మాస్టారు దగ్గరకు వెళ్లి మాట్లాడుతున్నా. ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ  నా వైపు చూసి- ‘‘నాయనా.. నువ్వు పెద్ద అధికారి అవుతావు..’’ అన్నారు. అప్పటికి నాకు ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే ఆసక్తి లేదు. సినిమాల్లోనో, పత్రికల్లోనే ప్రవేశించాలనుకుంటూ ఉండేవాడిని. మాస్టారు అన్నట్లే నేను రేడియోలో చేరా. ఆ సంస్థలో పెద్ద ఉద్యోగం అయిన డైరక్టర్‌గా రిటైర్‌ అయ్యాను. అలాంటిదే మరో ఉదాహరణ చెబుతాను.




ఇక గాయకుడిగా బాలు సంగీతదర్శకులకు ఒక వరమనే చెప్పాలి. ఆయన గాత్రాన్ని అందరూ ఇష్టపడేవారు. పాట పెద్దదయినా.. చిన్నదైనా.. సంస్థ పెద్దదయినా.. చిన్నదయినా.. తన వంతు వందశాతాన్ని ఇవ్వాలనే నిబద్ధతతో బాలు పనిచేస్తారు. అందుకే ఇంతకాలం ఆయన ఆ రంగంలో కొనసాగగలిగారు. ‘‘బాల సుబ్రహ్మణ్యం గాత్రం- పి.బి. శ్రీనివాస్‌, ఏసుదాసు గార్ల గాత్రాలకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తున్నది’’ అని ఒకసారి రాజేశ్వరరావు గారితో చెబితే, ఆయన ఏ మాత్రం తడుముకోకుండా- ‘‘అతని గాత్రం విడిగా ఉంది. విడిగానే ఉంటుంది’’ అని సమాధానమిచ్చారు. అదే నిజమయింది. మన భారత దేశంలో అనేక మంది గాయకులు ఉన్నా- బాలు అందరి కన్నా భిన్నమైన గాయకుడిగా ముద్ర వేయించుకున్నారు. మన దేశం గర్వించదగిన సంగీత దర్శకుల్లో ఒకరైన నౌషాద్‌- ‘‘తేరే పాయల్‌ మేరే గీత్‌’’ అనే సినిమాలో పాడించటానికి బాలును బొంబాయికి పిలిచారు. అప్పటికే బాలు వేల పాటలు పాడి ఉన్నా అంత గొప్ప సంగీత దర్శకుడిని సంతృప్తిపరచగలనా లేదా? అనే సందేహం బాలు మనసులో ఉంది. బొంబాయి వెళ్లి నౌషాద్‌గారి ఇంట్లో పాట రిహార్సల్స్‌ చేశారు. ఆ రాత్రి హోటల్‌కు వచ్చి మూడు గంటల దాకా ప్రాక్టీసు చేశారు.


ఉదయం రికార్డింగ్‌కు వెళ్లారు. వాస్తవానికి అది చాలా పెద్ద పాట. ఒక టేక్‌లో పాడటం చాలా కష్టం. నౌషాద్‌ పాటను విడదీసి రెండు టేకులు తీసుకుందామంటే బాలు వినలేదు. ఒక టేక్‌లోనే పాడతానన్నారు. పాడేశారు. ఒకే టేక్‌లో మొత్తం పాట ఓకే అయిపోయింది. కానీ ఆలాప్‌ సరిగ్గా రాలేదేమోననేది బాలు అనుమానం. నౌషాద్‌ గారి దగ్గరకు వెళ్లి మళ్లీ పాడతానని అడిగారు. ‘చాలా బాగా వచ్చింది’ అని ఆయన చెప్పేదాకా బాలుకు మనసొప్పలేదు. బాలు నిబద్ధతకు అద్దం పట్టే ఈ సంఘటన నౌషాద్‌ జీవితచరిత్ర ‘నౌషాద్‌ నామా’లో ఉంది. కోదండపాణి, అశ్వత్థామ, రాజేశ్వరరావు, విశ్వనాథన్‌, మహాదేవన్‌, సత్యం- ఇలా ఒకరేమిటి అందరూ బాలును ప్రేమించేవారు. విశ్వనాథన్‌ గారైతే బాలును బ్లాటింగ్‌ పేపర్‌ అని ముద్దుగా పిలిచేవారు. ‘‘ఒక సారి వింటే చాలు. మక్కికి మక్కి పాడేస్తాడు. ఏ మాత్రం తేడా రాదు’’ అనేవారు. పాట రికార్డింగ్‌ అయిన తర్వాత మళ్లీ విని బాలుకు రాత్రి ఫోన్‌ చేసి కన్నీళ్లు పెట్టుకున్న సంగీత దర్శకులెందరో.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక అనంత ప్రవాహమే అవుతుంది. 


ఆయనతో నేను తరచుగా మాట్లాడుతూ ఉంటాను. బాలు కోరిక మేరకు నేను ఆయన జీవితచరిత్ర రాస్తున్నాను.  అందుకోసం ఆయనను చాలాసార్లు కలుసుకున్నాను. బాలుతో నేను ఈ మధ్యకాలంలో మాట్లాడింది కోవిడ్‌ రాక ముందు- మార్చిలో అనుకుంటా. బాలు తమ దగ్గర ఉన్న సమాచారాన్ని, ప్రెస్‌ కటింగ్స్‌ను, చిత్రాలను నాకు ఇచ్చారు. వాటన్నింటినీ గుదిగుచ్చి ఆయన అందమైన వ్యక్తిత్వాన్ని ప్రతిఫలించే జీవితచరిత్ర దాదాపు పూర్తయింది. దానికి ‘జీవనగానం’ అని తాత్కాలికంగా పేరు పెట్టుకున్నా. ఈ ఏడాది చివరకు విడుదల చేయాలనుకున్నాము. ఇద్దరమూ కలిసి రచనలో అవసరమైన కూర్పులు చేర్పులు చేద్దామని అనుకున్నాము. ఇంతలోనే అనుకోని అవాంతరం వచ్చి పడింది. అయినా ఆయన దాని నుంచి కోలుకుంటారని.. ముందు అనుకున్నట్లే ఈ ఏడాది చివరకు ఆయనే పుస్తకాన్ని విడుదల చేస్తారని గాఢంగా విశ్వసిస్తున్నా. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. మంచివాళ్లకు దేవుడు ఎప్పుడూ మంచే చేస్తాడు. నా ప్రియాతి ప్రియమైన అన్నగారు బాలు త్వరగా కోలుకొని మనందరి ముందుకు వస్తారు. తమ గంధర్వగానంతో అందరినీ అలరిస్తారు.


-డాక్టర్‌ పి.ఎస్‌.గోపాలకృష్ణ




ఒకసారి ఒక బాలుడు మాస్టారు దగ్గరకు వచ్చి ‘‘గాయకుడు కావాలనుకుంటున్నాను. మీ ఆశీర్వాదం కావాలి..’’ అని కోరాడు. ‘‘నీకు పాటలెందుకు నాయనా! కలెక్టర్‌ అవుతావు..’’ అని దీవించారు. ఆ బాలుడి పేరు చంద్రమౌళి. ఆ తర్వాత మంచి ఐఏఎస్‌ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఇలాంటి ఉదంతాలు ఎన్నో! బాలు విషయంలో కూడా ఆయన ఆశీర్వాదం పనిచేసిందనే చెప్పాలి. ఘంటసాల మాస్టారు తర్వాత అప్రతిహతంగా తన పాటల జైత్రయాత్ర కొనసాగించినా- బాలు ఎప్పుడూ ఆయనను మర్చిపోలేదు. హైదరాబాద్‌లో సొంత ఖర్చులతో ఆయన విగ్రహం పెట్టించారు. దక్షిణభారత దేశంలో ఉన్న సినీ సంగీత కళాకారులను.. సినీ నటులను పిలిచి ఒక సభ పెట్టారు. బహుశా ఒక గాయకుడు- మరో గాయకుడికి విగ్రహం నెలకొల్పిన సంఘటన భారత దేశ చరిత్రలో ఇదేనేమో!



Updated Date - 2020-08-30T05:35:50+05:30 IST