శాశ్వత స్నేహితుడు

ABN , First Publish Date - 2021-07-16T05:30:00+05:30 IST

మన జీవితాల్లో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అయితే వాటిని మనం క్రమంగా మరచిపోతాం. కానీ చిన్ననాటి స్నేహితులతో గడిపిన మధురమైన క్షణాలను మాత్రం మరచిపోలేం...

శాశ్వత స్నేహితుడు

మన జీవితాల్లో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అయితే వాటిని మనం క్రమంగా మరచిపోతాం. కానీ చిన్ననాటి స్నేహితులతో గడిపిన మధురమైన క్షణాలను మాత్రం మరచిపోలేం. రక్తసంబంధం లేకుండానే ఏర్పడేది స్నేహ బంధం. ఒక్కొక్కసారి మన కుటుంబ సభ్యులకూ, సన్నిహితులకూ చెప్పుకోలేని విషయాలు ప్రాణ స్నేహితులతో పంచుకుంటాం. మంచి వ్యక్తుల స్నేహ సాంగత్యం మన సంస్కారాలలో మార్పు తెస్తుంది. ‘మీ స్నేహితుడు ఎవరో చెబితే మీరు ఎలాంటి వారో చెబుతాను’ అనే సామెత ఉంది. సహవాస దోషం వల్ల ఏర్పడే చెడ్డ అలవాట్లతో దిగజారిపోయేవారు ఉంటారు. మంచి వ్యక్తుల స్నేహంతో సంస్కారవంతులుగా తయారయ్యేవారూ ఉంటారు. ఏదైనా కష్టం వస్తే.. తన ఆప్త స్నేహితుడు ఆదుకుంటాడనే నమ్మకం మనిషికి ధైర్యాన్నిస్తుంది. అయితే ఏ స్నేహితుడైనా ఎల్లకాలం తోడుగా ఉండడు కదా! ఎంతో నమ్మిన స్నేహితులు మోసం చెయ్యవచ్చు, దూరం కావచ్చు. ఆ సమయంలో చాలామంది తమలోని విశ్వాసాన్నీ, ధైర్యాన్నీ కోల్పోతారు. మరి సదా తోడుగా ఉండే సత్యమైన, నిత్యమైన స్నేహితుడు ఎవరు? అలాంటి నిస్వార్థమైన, ప్రేమ పూర్వకమైన సహయోగాన్ని నిరంతరం ఇవ్వగలిగేది ‘ఖుదా దోస్త్‌’.. పరమాత్మ కాక మరెవరు?


ఆ దివ్యమైన స్నేహితుడి సహచర్యం వేయి ఏనుగుల బలాన్ని ఇస్తుంది. ఎంత పెద్ద సమస్య ఎదురైనా తేలికగా దాటేలా చేస్తుంది. భాగవతంలో శ్రీకృష్ణుడు తన చిన్ననాటి స్నేహితుడైన కుచేలుడికీ, మరెందరో భక్తులకూ చేసిన సాయం గురించి చదివినా, విన్నా... జీవితంలో ఇలాంటి స్నేహితుణ్ణి పొందగలగడం ఎంత అదృష్టం అనిపిస్తుంది. 

ఇప్పుడు ఈ కలియుగ అంతిమ సమయంలో మన సంబంధాలన్నీ  స్వార్ధ పూర్వకంగా మారిపోయినపుడు స్వయంగా పరమాత్మే సఖుడై మనకు తన స్నేహ పూర్వక హస్తం అందిస్తున్నారు. భగవద్గీత లో చేసిన ప్రతిజ్ఞ అనుసారంగా ఈ సంగమ యుగంలో భరత భూమిపై అవతరించారు.  రాజయోగ విధానంతో స్నేహసాగరుడైన భగవంతునితో మానసిక సంబంధం ఏర్పరుచుకొని... సర్వశక్తులను, దివ్య గుణాలను వరదానంలాగా చాలా సహజంగా పొందమని కోరుతున్నారు.

తాళం తయారు చేసిన వారు తప్పకుండా తాళం చెవి కూడా చేస్తారు. అలాగే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. పరమ పవిత్రుడైన పరమాత్మ స్నేహంతో మన మనసు బుద్ధి స్వచ్ఛంగా  మారిపోతుంది కాబట్టి  కొండంత సమస్య కూడా దూది పింజలా మారిపోతుంది. సర్వ శక్తిమంతుడు, సర్వగుణసాగరుడు, జ్యోతి బిందు స్వరూపుడైన పరమాత్మ  విశ్వాత్మలందరికీ తల్లీ తండ్రినే కాక మిత్రుడు కూడా. మన జీవితాంతం నీడలా వెన్నంటి.. మన తోడుగా ఉండేవాడు ఒక్క పరమాత్ముడే! ‘మనుషులు కష్టంలోనే భగవంతుడిని గుర్తు చేసుకుంటారు. సుఖంగా ఉన్నప్పుడు మరచిపోతారు. కానీ కష్టంలోనైనా, సుఖంలోనైనా... ఎల్లవేళలా ఆయనను స్మరిస్తూ ఉంటే కష్టం మన దగ్గరకు రాదు’ అన్నారు ఒక కవి. భగవంతుడి నుంచి ఆ సాయం పొందడానికి మనం దేన్నీ త్యాగం చెయ్యనవసరం లేదు. మన దైనందిన కార్యక్రమాలను... అంటే ఉద్యోగ వ్యవహారాలనూ, వ్యాపారాలను యథావిధిగా చేసుకుంటూనే.. ఆయన పేరును మననం చేసుకోవచ్చు. ఈ స్మృతికి ఎంతో శక్తి ఉంది. అది జన్మజన్మల పాపాలను కరిగిస్తుంది. దోషాలను తొలగిస్తుంది. భవిష్యత్తులో ఏర్పడే బంగారు ప్రపంచంలో దివ్యమైన జన్మను పొందే యోగ్యతను అందిస్తుంది.

- బ్రహ్మ కుమారీస్‌ , 7032410931

Updated Date - 2021-07-16T05:30:00+05:30 IST