వీడనున్న ఉత్కంఠ

ABN , First Publish Date - 2021-09-17T05:45:05+05:30 IST

జిల్లా, మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజక వర్గాల (జడ్పీటీసీ, ఎంపీటీసీ) ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో అధికారులు సన్నాహాలు మొదలెట్టారు.

వీడనున్న ఉత్కంఠ

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

మండల కేంద్రాల్లోనే కౌంటింగ్‌

తగిన ఏర్పాట్లు చేసుకోవలసిందిగా అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు


విశాఖపట్నం, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి):

జిల్లా, మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజక వర్గాల (జడ్పీటీసీ, ఎంపీటీసీ) ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో అధికారులు సన్నాహాలు మొదలెట్టారు. ఈ మేరకు అమరావతి నుంచి ఆదేశాలు అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం మధ్యాహ్నం జడ్పీ సీఈవో వి.నాగార్జునసాగర్‌ 39 మంది ఎంపీడీవోలతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 


ఈ ఏడాది ఏప్రిల్‌ ఎనిమిదో తేదీన జిల్లాలోని 37 జడ్పీటీసీ, 612 ఎంపీటీసీ పదవులకు ఎన్నికలు జరిగాయి. జిల్లాలో మొత్తం 39 జడ్పీటీసీలకుగాను రోలుగుంట జడ్పీటీసీకి వైసీపీ అభ్యర్థి పోతల లక్ష్మి రమణమ్మ ఏకగ్రీవం కాగా, ఆనందపురంలో టీడీపీ అభ్యర్థి టి.ఆదినారాయణ మృతి చెందడంతో అక్కడ ఎన్నిక జరగలేదు. ఇక, మొత్తం 652 ఎంపీటీసీ స్థానాలకు 37 ఏకగ్రీవమయ్యాయి. కె.కోటపాడు, ఎస్‌.రాయవరం మండలాల్లోని రెండు స్థానాల్లో ఇద్దరు అభ్యర్థులు మృతిచెందడంతో ఎన్నికను రద్దు వేశారు. అలాగే భీమిలి మండలం రేఖవానిపాలెం ఎంపీటీసీ ఎన్నికను వాయిదా చేశారు. దీంతో 612 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అదే నెల పదో తేదీన ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. అయితే కోర్టు ఆదేశంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. అప్పటి నుంచి బ్యాలెట్‌ బాక్సులను మండల పరిషత్‌ కార్యాలయాల్లో భద్రపరచారు.


కౌంటింగ్‌కు ఏర్పాట్లు

జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల ఓట్లను మండల కేంద్రాల్లోనే చేపడతారు. ఇందుకోసం అనువైన ప్రదేశాన్ని గుర్తించనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ బ్యాలెట్లు వేరు చేసిన తరువాత లెక్కింపు చేపడతారు. ఓట్ల లెక్కింపునకు 2,500 మంది అధికారులు, సిబ్బంది అవసరమని అంచనా వేశారు. జిల్లాలో 17,96,130 మంది ఓటర్లకుగాను 11,73,601 మంది (65.34 శాతం) ఓటు వేశారు. అత్యధికంగా పెందుర్తి మండలంలో 84.1 శాతం, అత్యల్పంగా హుకుంపేటలో 41.95 శాతం పోలింగ్‌ జరిగింది. ఏజెన్సీలోని దాదాపు అన్ని మండలాల్లో ఓటింగ్‌ తక్కువగా జరగడంతో తొలి ఫలితం అక్కడ నుంచే వచ్చే అవకాశం వుందని అంచనా వేస్తున్నారు. ఇదిలావుండగా కోర్టు తీర్పుతో జడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులకు పోటీచేసిన అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. 


కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌

జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అధికారులు సిద్ధంగా వుండాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున ఆదేశించారు. గురువారం సాయంత్రం ఓట్ల లెక్కింపు ప్రక్రియపై అత్యవసరంగా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్వోలు, ఏఆర్వోలు స్ర్టాంగ్‌ రూమ్‌లను తనిఖీ చేసి, కౌంటింగ్‌ హాళ్లు, సామగ్రి సిద్ధం చేసుకోవాలన్నారు. కౌంటింగ్‌ సిబ్బందికి శిక్షణ తరగతుల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియ మొత్తం వీడియోగ్రఫీ చేయాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనుభవాలను పరిగణనలోకి తీసుకుని సిబ్బంది నియామకం చేపట్టాలని, తగిన వసతులు కల్పించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాడేరు పీవో గోపాలకృష్ణ, సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌, జడ్పీ సీఈవో వి.నాగార్జునసాగర్‌, జిల్లా పంచాయతీ అధికారి కృష్ణకుమారి, డీఆర్‌డీఎ పీడీ విశ్వేశ్వరరావు, డీఆర్వో శ్రీనివాసమూర్తి, ఎస్డీసీలు రంగయ్య, అనిత, అనిత, ఆర్డీవోలు పెంచల కిషోర్‌, సీతారామారావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-17T05:45:05+05:30 IST