వాటిపైనే.. మన‘సంత’!

ABN , First Publish Date - 2021-07-29T05:01:58+05:30 IST

వారపు సంతలపై దళారుల కన్ను పడింది. జిల్లాలో ప్రధాన సంతల నుంచి పశుసంపద ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిపోతోంది. చెన్నై, ముంబై కేరళ తదితర రాష్ట్రాల కబేళాలకు అక్రమ రవాణా సాగుతోంది. రాజాం సంతలో ప్రతి గురువారం వందలాది పశువుల విక్రయాలు సాగుతున్నాయి.

వాటిపైనే.. మన‘సంత’!
రాజాంలోని పశువుల సంత

- సంతలపై దళారుల కన్ను

- జిల్లా నుంచి భారీగా పశువుల అక్రమ రవాణా

రాజాం రూరల్‌: వారపు సంతలపై దళారుల కన్ను పడింది. జిల్లాలో ప్రధాన సంతల నుంచి పశుసంపద ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిపోతోంది. చెన్నై, ముంబై కేరళ తదితర రాష్ట్రాల కబేళాలకు అక్రమ రవాణా సాగుతోంది. రాజాం సంతలో ప్రతి గురువారం వందలాది పశువుల విక్రయాలు సాగుతున్నాయి. రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి, జి.సిగడాం, పొందూరు మండలాలతో పాటు విజయనగరం జిల్లా చీపురుపల్లి, గరివిడి, తెర్లాం, మెరకముడిదాం మండలాల రైతులు పశువులను ఈ సంతలోనే విక్రయిస్తారు. విజయనగరం జిల్లా అలమండ ప్రాంతానికి చెందిన రైతులు ఇక్కడ ఎక్కువగా కొనుగోలు చేస్తారు. పాలకొండ డివిజన్‌లోని నవగాం, భామిని, బత్తిలి, శ్రీకాకుళం సమీపంలోని చింతాడ, జలుమూరు మండలం నారాయణవలస, కొత్తూరు మండలం మాతల సంతల్లో కూడా పశువుల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మూగజీవాలు జిల్లా సరిహద్దులు దాటుతున్నాయి. చెక్‌పోస్టుల వద్ద పోలీసులు, అధికారులు తనిఖీలు చేయకపోవడంతో పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. 


 అమలుకాని నిబంధనలు

పశుసంరక్షణ చట్టం 1977 ప్రకారం పాడి పశువులను.. దూడలను చంపినా, కబేళాలలకు విక్రయించినా నేరం. అలా చేసిన వారికి చట్ట ప్రకారం జరిమానా, ఆర్నెళ్లు జైలుశిక్ష విధించాలి. కానీ జిల్లాలో ఈ చట్టం అమలు కావడం లేదు. పశువుల రవాణాలోనూ నిబంధనలు కానరావడం లేదు. వాహనాల్లో పశువులను తరలిస్తే.. నిబంధనల ప్రకారం ముందుగా వ్యాధి నిరోధక టీకాలు వేయాలి. పశువైద్యాధికారి ఇచ్చిన ధ్రువీకరణ పత్రం వాహనం డ్రైవర్‌ దగ్గర ఉండాలి. ఒక లారీలో పెద్ద పశువులు అయితే ఆరు, గొర్రెలు.. మేకలు అయితే 40కి మించి ఉండరాదు. తరలింపు సమయంలో వాటి తలలు ఇంజన్‌ వైపు ఉండాలి. ఆరు అంగుళాల మందంతో వరి గడ్డి వాహనంలో వేయాలి. పశువులకు సరిపడా దాణా, నీళ్లు,  ప్రథమ చికిత్సకు అవసరమైన మందులు వాహనంలో ఉంచాలి. వంద కిలోమీటర్లు ప్రయాణించాక వాహనాన్ని కనీసం మూడు గంటలు నిలపాలి. పశువులకు నీరు, మేత పెట్టి ముందుకు సాగాలి. ఈ నిబంధనలేవీ జిల్లాలో అమలు కావడం లేదు. 


 కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతరు

పశువులను సంరక్షించాల్సిన అవసరం ఉంది. రాజాం సంతలో పశువులకు కలుగుతున్న అసౌకర్యాలపై గతంలో అప్పటి కలెక్టర్‌ నివాస్‌కు ఫిర్యాదు చేశాను. దీనిపై పై శాండీ లెవెల్‌ మానిటరింగ్‌ కమిటీ చైర్మన్‌గా దర్యాప్తు చేసి వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని రాజాం మునిసిపల్‌ కమిషనర్‌ను ఆయన ఆదేశించారు. కానీ, కమిషనర్‌ ఇప్పటివరకూ కలెక్టర్‌కు నివేదిక అందజేయలేదు. ఇదే విషయాన్ని ఆర్టీఐ ద్వారా కోరగా, కలెక్టర్‌ కార్యాలయం నుంచి తమకు లేఖ రాలేదని కమిషనర్‌ స్పష్టం చేశారు.

- లోగిస రామకృష్ణ, గో సంరక్షణ సమాఖ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, విజయనగరం

 ..............................................


పోషణ భారమై!

పశువులను విక్రయిస్తున్న రైతులు

కబేళాలకు తరలిస్తున్న దళారులు

(ఎల్‌.ఎన్‌.పేట)

సర్వదేవతా స్వరూపం..గోమాత. సనాతన ధర్మంలో ఆవుది విశిష్ట స్థానం. అటువంటి గోవు ప్రస్తుతం కబేళాలకు తరలుతుండడం ఆందోళన కలిగిస్తోంది. యాంత్రీకరణ పుణ్యమా అని పశువుల అవసరాలు తగ్గిపోగా.. పోషణ భారంగా మారడంతో ఆవులు, గేదెలను సైతం రైతులు విక్రయిస్తున్నారు. ఇదే అదనుగా దళారులు పశువులను కొనుగోలుచేసి కబేళాలకు తరలిస్తున్నారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో పశువులు విరివిగా కనిపించేవి. ప్రస్తుతం మచ్చుకైనా కానరాని దుస్థితి నెలకొంది. చిన్న, సన్నకారు రైతులు సీజన్లలో వ్యవసాయ పనులు చేసి..మిగతా సమయాల్లో ప్రత్యామ్నాయ ఉపాధి పనులు చేసుకుంటున్నారు. యాంత్రీరణతో సాగులో పశువుల వినియోగం తగ్గింది. గతంలో దుక్కులు, దమ్ము, నూర్పులు, వ్యవసాయ ఉత్పత్తులు, గత్తాల తరలింపు, ఇంటి అవసరాల రవాణా ఇలా అన్నింటికీ పశువుల అవసరం ఉండేది. కానీ యంత్రాలు అందుబాటులోకి వచ్చిన తరువాత క్రమేపీ వాటి అవసరాలు తగ్గాయి. దీనికితోడు పశుగ్రాసం లభ్యత తగ్గుముఖం పట్టింది. నూర్పుల్లో యంత్రాలు వినియోగించడంతో వరిగడ్డి ఎందుకూ పనికి రాకుండా పోయింది. చిన్న రైస్‌మిల్లులు లేకపోవడంతో దాణా తగినంతగా లభించడం లేదు. పెద్ద రైస్‌మిల్లుల నుంచి లభించే దాణా (తవుడు) ధర అధికంగా ఉండడంతో రైతులు కొనుగోలు చేయలేని పరిస్థితి. గతంలో చెరువులు, ఖాళీ ప్రదేశాలు ఎక్కువగా ఉండేవి. ఇళ్ల నిర్మాణంతో పాటు చెరువులు కబ్జాకు గురికావడంతో పశువుల మేతకు వీలు లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో ఎక్కువ మంది పశువులు విక్రయించేందుకు మొగ్గుచూపుతున్నారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. కబేళాలకు వాటిని తరలిస్తున్నారు. జిల్లాలో అంపురం, నారాయణవలస, చింతాడ, బుడుమూరు సంతల్లో పశువుల విక్రయాలు అధికంగా సాగేవి. కానీ ఏడాదిగా కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో వారపు సంతలు నిలిచిపోయాయి. దీంతో దళారులు నేరుగా గ్రామాల్లోకి వచ్చి పశువులను కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ, రాజమండ్రి వంటి ప్రాంతాలకు కబేళాల నిమిత్తం తరలిస్తున్నారు.  

Updated Date - 2021-07-29T05:01:58+05:30 IST