పాత్రికేయుడిపై కక్ష సాధింపు అప్రజాస్వామికం

ABN , First Publish Date - 2020-06-06T08:37:55+05:30 IST

పాత్రికేయుడిపై కక్షసాధింపు చర్యలు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మాదినేని

పాత్రికేయుడిపై కక్ష సాధింపు అప్రజాస్వామికం

కళ్యాణదుర్గం: పాత్రికేయుడిపై కక్షసాధింపు చర్యలు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మాదినేని ఉమామహేశ్వర్‌ నాయుడు ధ్వజమెత్తారు. ఆయనతోపాటు టీడీపీ నాయకులు నారాయణ, మురళి, వైపీ రమేష్‌, బిక్కి గోవిందప్ప, కొల్లప్ప, శ్రీనివాసరెడ్డి, సత్యప్ప, రామాంజనేయులు, ధనుంజయ, ప్రజాసంఘాల నాయకులు.. విలేకరి శంకర్‌నాయక్‌ ఇంటిని పరిశీలించారు. భార్య లక్ష్మీదేవి, కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. నియోజకవర్గంలో ఎన్నడూ లేనివిధంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అరాచకాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు లోనుచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


 ఎక్సైజ్‌ పోలీ్‌సస్టేషన్‌ ఎదుట ఉద్రిక్తత

అనంతరం టీడీపీ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులు స్థానిక ఎక్సైజ్‌ పోలీ్‌సస్టేషన్‌ ఎదుట బైఠాయించి, పెద్దఎత్తున నిరసన చేపట్టారు. కార్యాలయ ఆవరణలో రెండు గంటలపాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఉమామహేశ్వర్‌ నాయుడు మాట్లాడారు. అధికార పార్టీ నేతల అవినీతి, అక్రమాలను వెలికితీస్తున్న పాత్రికేయుడిపై అక్రమ కేసులు బనాయించటం సిగ్గుచేటని విమర్శించారు. వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.


మద్యం అక్రమంగా తీసుకువచ్చి ఇంటి ప్రహరీలో ఉంచిన వ్యక్తులపై క్రిమినల్‌ కేసులు బనాయించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సీఐ హరికృష్ణకు వినతిపత్రాన్ని అందజేశారు. సీఐ మాట్లాడుతూ విలేకరి శంకర్‌నాయక్‌ ఇంట్లో సోదాలు చేయలేదన్నారు. ఇంటి ప్రహరీలో అనుమానాస్పదంగా కర్ణాటక మద్యం ఉన్నట్లు గుర్తించామన్నారు. విలేకరిపై కేసు బనాయించలేదని చెప్పుకొచ్చారు. దీంతో నిరసనకారులు శాంతించారు.

Updated Date - 2020-06-06T08:37:55+05:30 IST