తెలంగాణ అమరుల కుటుంబాలపై నిర్లక్ష్యం తగదు

ABN , First Publish Date - 2021-11-30T04:48:24+05:30 IST

తెలంగాణ సాధనకోసం ప్రాణత్యాగానికి పాల్పడిన అమరుల కుటుంబాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదని ప్రజా ఉద్యమకారుల వెల్ఫేర్‌ సొసైటీ ప్రతినిధి గాదె ఇన్నయ్య అన్నారు.

తెలంగాణ అమరుల కుటుంబాలపై నిర్లక్ష్యం తగదు
కొమురవెల్లిలో అమరుల కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న ఇన్నయ్య

ప్రజా ఉద్యమకారుల వెల్ఫేర్‌ సొసైటీ ప్రతినిధి గాదె ఇన్నయ్య

చేర్యాల, నవంబరు 29 : తెలంగాణ సాధనకోసం ప్రాణత్యాగానికి పాల్పడిన అమరుల కుటుంబాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదని ప్రజా ఉద్యమకారుల వెల్ఫేర్‌ సొసైటీ ప్రతినిధి గాదె ఇన్నయ్య అన్నారు. ఆలింగన యాత్ర పేరిట సోమవారం చేర్యాల, కొమురవెల్లి మండలాలకు చెందిన పలు అమరుల కుటుంబాలను ఆయన పరామర్శించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎంతోమంది ఆత్మబలిదానాల వల్లే తెలంగాణ సిద్ధించిందే తప్ప సీఎం కేసీఆర్‌, అతడి కుటుంబీకులు చేసింది శూన్యమన్నారు. తొలి, మలిదశ ఉద్యమంలో 42 వేలమందిపై కేసులు నమోదై ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి పట్టకపోవడం తగదన్నారు. రాష్ట్రపతి గెజిట్‌ విడుదలైన మార్చి 1న ప్రతియేటా తెలంగాణ రాష్ట్రసాధన అమరుల దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలన్నారు. కళాకారులు, ఉద్యమకారులు, సబ్బండవర్ణాల త్యాగానికి గుర్తుగా మార్చి 4న రాష్ట్ర సాధన త్యాగధనుల దినోత్సవంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లావ్యాప్తంగా 11 రోజులపాటు యాత్ర కొనసాగించనున్నట్లు ఇన్నయ్య తెలిపారు. 

Updated Date - 2021-11-30T04:48:24+05:30 IST