జాతరను తలపించిన ఏడుపాయల

ABN , First Publish Date - 2020-09-21T07:23:03+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గా భవానీమాత సన్నిధి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి

జాతరను తలపించిన ఏడుపాయల

భక్తులతో కిటకిటలాడిన భవానీ సన్నిధి

మంజీర పరవళ్లలో భక్తుల పుణ్యస్నానాలు 

సౌకర్యాలు కరువై భక్తుల ఇక్కట్లు


పాపన్నపేట, సెప్టెంబరు 20: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గా భవానీమాత సన్నిధి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇటీవల భారీ వర్షాలకు అమ్మవారి పరిసర ప్రాంతంలో ఉన్న వనదుర్గా ప్రాజెక్టు పొంగిపొర్లుతున్నది. దీంతో ఆలయం ముందున్న మంజీర నది పరవళ్లు తొక్కుతూ ప్రవహించడంతో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి, అమ్మవారిని దర్శించుకున్నారు. వేకువజామున పూజారులు శంకరశర్మ. నరసింహాచారి, పార్థివశర్మ, రాముశర్మ, రాజశేఖర్‌శర్మ, నాగరాజుశర్మలు అమ్మవారికి అభిషేకంతో పాటు సహస్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, వివిధ రకరకాల పుష్పాలతో అమ్మవారి విగ్రహాన్ని అలంకరించారు. లాక్‌డౌన్‌ అనంతరం అమ్మవారి ఆలయం తెరుచుకున్నప్పటి నుంచి మొదటిసారిగా భక్తులు జాతరను తలపించేలా క్షేత్రాన్ని చేరుకున్నారు. 


కరువైన సౌకర్యాలు

సరైన సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని భక్తులు ఆరోపించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో అధికారులు థర్మల్‌ స్ర్కీనింగ్‌, శానిటైజర్లు చేయకుండా ఆలయంలోకి భక్తులకు అనుమతిస్తున్నారని పలువురు వాపోయారు. వనదుర్గా ప్రాజెక్టు వద్ద మంజీర నది ఒడ్డున ఎలాంటి నీటి ప్రమాదాలు జరుగకుండా, ఏడుపాయలలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పాపన్నపేట ఎస్‌ఐ ఆంజనేయులు తమ సిబ్బందితో బందోబస్తు చర్యలు చేపట్టారు.

Updated Date - 2020-09-21T07:23:03+05:30 IST