మాది ముమ్మాటికీ రైతు ప్రభుత్వమే

ABN , First Publish Date - 2020-07-09T08:58:53+05:30 IST

తమది ముమ్మాటికీ రైతు పక్షపాత ప్రభుత్వమేనని సగర్వంగా చెబుతున్నానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల మదిలో

మాది ముమ్మాటికీ రైతు ప్రభుత్వమే

  • గత ప్రభుత్వ బకాయిలన్నీ చెల్లిస్తున్నాం
  • రైతుల కోసం వడ్డీ లేని రుణాలిస్తున్నాం
  • 3050 కోట్లతో పంటలు కొనుగోలు: సీఎం
  • ప్రజల మదిలో నిలిచిన మహానేత వైఎస్‌
  • అన్ని వర్గాలను మెప్పించారు: సీఎం జగన్‌
  • క్యాంపు ఆఫీసులో రైతు దినోత్సవం ప్రారంభం
  • ఇడుపులపాయలో ఘనంగా వైఎస్‌ జయంతి
  • ‘నాలో.. నాతో వైఎస్సార్‌’ పుస్తకావిష్కరణ

అమరావతి/కడప, జూలై 8 (ఆంధ్రజ్యోతి): తమది ముమ్మాటికీ రైతు పక్షపాత ప్రభుత్వమేనని సగర్వంగా చెబుతున్నానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల మదిలో చెరగని స్థానం సంపాదించుకున్న మహానేత వైఎస్సార్‌ అని కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని రాష్ట్రప్రభుత్వం తలపెట్టిన రైతు దినోత్సవాన్ని ఆయన బుధవారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. అంతకుముందు కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. గత ప్రభుత్వం రైతులకు పెట్టిన బకాయిలన్నిటినీ తన ప్రభుత్వం తీర్చు తూ వస్తోందని ఆయా సందర్భాల్లో జగన్‌ అన్నారు. ‘గత ప్రభుత్వం వ్యవసాయ రుణాలకు రూ.1,150 కోట్ల వడ్డీ బకాయి పెట్టింది. రుణాలను సకాలంలో చెల్లించిన రైతులకు చెల్లించాల్సిన వడ్డీలను కూడా బకాయి పెట్టింది.


సున్నా వడ్డీ పథకంపై రైతుల బకాయిలన్నిటినీ పూర్తిగా చెల్లిస్తున్నాం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నాన్నగారి పేరు గొప్పగా కనిపిస్తుంది. 2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటిగా సంత కం చేసిన ఫైలు దాదాపు రూ.1,200 కోట్ల రైతుల కరెంటు బకాయిలు రద్దు చేయడం. ఆ తర్వాత గతం లో ఎప్పుడూ జరగని విధంగా రైతులకు ఉచితంగా విద్యుత్‌ ఇచ్చే ఫైలుపై సంతకం వైఎస్‌ చేశారు. నా ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్‌తో రైతుకు సగటును రూ.50 వేలు ఆదా అవుతోంది. అప్పట్లో సీఎంగా చంద్రబాబు ఉండేవారు.. ఉచిత విద్యుత్‌ ఇస్తే ఆ కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవడానికే పరిమితమవుతుందని అపహాస్యం చేశార’ని విమర్శించారు.


సైరన్‌ వినిపిస్తే అవే గుర్తుకొస్తాయి..

‘కుయ్‌ కుయ్‌ కుయ్‌ మంటూ 108, 104 అంబులెన్సుల సైరన్‌ వినిపించినప్పుడల్లా వైఎస్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, జలయజ్ఞం గుర్తుకొస్తాయి. అందుకే ఆయన జన్మదినం నాడు రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా కొన్ని కార్యక్రమాలను చేపడుతున్నాం. రైతుల కోసం వడ్డీ లేని రుణాలను అమలు చేస్తున్నాం. వారి కోసం 1907 కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. సహకార రంగంలోని చక్కెర రైతులకు గత ప్రభుత్వంలోని రూ.88 కోట్ల బకాయిల్లో 34 కోట్లు ఇప్పటికే చెల్లించాం. రాష్ట్రంలో నాలుగు ఫిషింగ్‌ హార్బర్లను రూ.1,300 కోట్లతో నిర్మిస్తున్నాం. రూ.13,500 చొప్పున ప్రతి రైతు కుటుంబానికీ పెట్టుబడి సాయం అందించాం. 10,240 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం.


వీటి ద్వారా పశువులకు కూడా ఉచిత వైద్యం అందిస్తున్నాం. ఉద్యానవన పంటలను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసింది. పొగాకు రైతులకూ అండగా ఉంటాం. గత ప్రభుత్వం బకాయిలుగా పెట్టేసిన రూ.960 కోట్లను చెల్లించాం. విత్తన బకాయి రూ.384 కోట్లు, 2018-19 రబీ బీమా ప్రీమియం రూ.120 కోట్లు చెల్లించాం. కంపెనీలతో మాట్లాడి రూ.590 కోట్ల పంటల బీమా డబ్బులు రైతులకు ఇప్పించాం. దేశ చరిత్రలో  తొలిసారిగా పంట బీమా మొత్తం రైతులకు ఇప్పించాం. గత ప్రభుత్వం పెట్టిన రూ.8,665 కోట్ల వ్యవసాయ విద్యుత్‌ బకాయిలను చెల్లించాం. రూ.3,050 కోట్లతో రైతుల పంటలు కొనుగోలు చేశాం. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్‌ టాక్స్‌ను రద్దు చేశాం. ఆరు జలయజ్ఞం ప్రాజెక్టులను వేగంగా  పూర్తి చేస్తున్నాం’ అని సీఎం తెలిపారు.


వైఎ‌స్‌కు ఘననివాళులు

వైఎస్‌ రాజశేఖరరెడ్డి 71వ జయంతి వేడుకలను ఇడుపులపాయ ఎస్టేట్‌లో ఘనంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి వైఎస్సార్‌ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌ్‌సలో బసచేసిన జగన్‌.. బుధవారం ఉదయం 8.50 గంటలకు వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకున్నారు. తల్లి విజయలక్ష్మి, సతీమణి భారతి, చెల్లెలు షర్మిల, మామ ఈసీ గంగిరెడ్డి, కుటుంబసభ్యులతో కలసి వైఎ్‌సకు ఘనంగా నివాళులు అర్పించారు. సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచారు. అరగంట పాటు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వైఎస్‌ విజయలక్ష్మి రచించిన ‘నాలో.. నాతో వైఎస్సార్‌’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. నాన్నతో కలసి అమ్మ సాగించిన సుదీర్ఘ ప్రయాణం ఓ మధుర ఘట్టమని, నాన్న జీవనయానంలో ప్రతి పాత్రను అమ్మ ప్రత్యక్షంగా గమనించారని, ఆ అనుభవాలతోనే తమ మదిలో నిలిచేలా మంచి పుస్తకాన్ని రచించారని అన్నారు. 


ట్రిపుల్‌ ఐటీలో ప్రగతి పనులకు శ్రీకారం

ఇడుపులపాయలోని రాజీవ్‌గాంధీ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ యూనివర్సిటీ, ట్రిపుల్‌ ఐటీ కళాశాలలో పలు ప్రగతి పనులకు జగన్‌ శ్రీకారం చుట్టారు. రూ.140 కోట్లతో నిర్మించిన ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ భవనాలు, రెస్కో కొలాబరేషన్‌తో నిర్మించిన మూడు మెగావాట్స్‌ సోలార్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. రూ.10.10 కోట్లతో నిర్మించనున్న కంప్యూటర్‌ సెంటర్‌కు, రూ.40 కోట్లతో నిర్మించే వైఎ్‌సఆర్‌ ఆడిటోరియంకు శంకుస్థాపన చేశారు. ఆర్‌కే వ్యాలీ క్యాంపస్‌ సర్కిల్‌లో వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌, కలెక్టర్‌ సి.హరికిరణ్‌, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్‌ కొరముట్ల శ్రీనివాసులు, కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, ఆర్జీయూకేటీ వైస్‌ చాన్సలర్‌ కేసీ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం అంజద్‌ బాషా జిల్లాలోనే ఉన్నా సీఎం పర్యటనలో పాల్గొనకపోవడం కొసమెరుపు. అనంతరం షెడ్యూల్‌ కంటే రెండు గంటలు ముందే జగన్‌ విజయవాడకు బయల్దేరారు.

Updated Date - 2020-07-09T08:58:53+05:30 IST