రైతు అన్యాయమైపోయాడు!

ABN , First Publish Date - 2021-12-04T05:18:49+05:30 IST

కడక గడపన నవంబరు 17 నుంచి 19వ తేది వరకు జవాద్‌ తుఫాన కారణంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిసాయి. నవంబరు జిల్లా సాధారణ వర్షపాతం 89.3 మి.మీలు అయితే 332.7 మి.మీల వర్ష్షపాతం నమోదు అయ్యింది. పింఛా, అన్నమయ్య ప్రాజెక్టులు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి.

రైతు అన్యాయమైపోయాడు!
వరదతో పొలాల్లో వేసిన ఇసుకమేటలు

అన్నమయ్య ప్రాజెక్ట్టు తెగిపోయి అన్నదాతకు ఉహించని నష్టం

గతేడాది నివర్‌.. తాజాగా జవాద్‌ తుఫాన నిలువునా ముంచాయి

2 లక్షల హెక్టార్లలో దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలు 

అధికారిక లెక్కల ప్రకారం నష్టం రూ.467.16 కోట్లు

రైతు అంచనా మేరకు రూ.2,730 కోట్ల దిగుబడి నష్టం

ఎకరాకు రూ.25 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని రైతుల డిమాండ్‌


జూదంగా మారిన వ్యవసాయంలో రైతులు అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నారు. గతేడాది నివర్‌ తుఫాన చేతికొచ్చిన పంటను నీటిపాలు చేసింది. ఆ కష్టాలు.. నష్టాల నుంచి తేరుకోకనే తాజాగా జవాద్‌ తుఫాన.. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంతో నిలువునా ముంచేసింది. అధికారిక లెక్కల ప్రకారమే వ్యవసాయ, ఉద్యాన పంటలు రెండు లక్షల హెక్టార్లలో దెబ్బతిని రూ.467.17 కోట్ల నష్టం జరిగింది. రైతుల అంచనా మేరకు దిగుబడి రూపంలో సరాసరి రూ.2,500 కోట్లకు పైగానే నష్టం అంటున్నారు. అన్నమయ్య ప్రాజెక్టు సృష్టించిన వరద బీభత్సానికి వందల హెక్టార్ల పచ్చని పొలాలు సాగుకు పనికిరాకుండా ఇసుక మేటలు వేసాయి. అడ్డంగా కోతకు గురయ్యాయి. జవాద్‌ తుఫాన, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి అన్నదాతకు జరిగిన నష్టంపై ప్రత్యేక కథనం.


(కడప-ఆంధ్రజ్యోతి): కడక గడపన నవంబరు 17 నుంచి 19వ తేది వరకు జవాద్‌ తుఫాన కారణంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిసాయి. నవంబరు జిల్లా సాధారణ వర్షపాతం 89.3 మి.మీలు అయితే 332.7 మి.మీల వర్ష్షపాతం నమోదు అయ్యింది. పింఛా, అన్నమయ్య ప్రాజెక్టులు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. వరదలు, ప్రాజెక్టులు తెగిపోవడంతో అన్నదాతలకు అపార నష్టం జరిగింది. జిల్లా అంతటా 1,81,973.56 హెక్టార్లలో ఖరీఫ్‌, రబీకి చెందిన వరి, పత్తి, మినుము, బడ్డశనగ వంటి పంటలు పూర్తిగా దెబ్బతిని రూ.356.95 కోట్లు నష్టపోయారని అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం హెక్టారుకు రూ.15 వేలు నష్ట పరిహారం కోరుతూ.. నేషనల్‌ డ్రాట్‌ రిలీఫ్‌ ఫండ్‌ (ఎనడీఆర్‌ఎఫ్‌) కింద రూ.156.68 కోట్లు, స్టేట్‌ డ్రాట్‌ రిలీఫ్‌ ఫండ్‌ (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) కింద రూ.215.32 కోట్లు ఇనపుట్‌ సబ్సిడీ (నష్ట పరిహారం) చెల్లించాలని ప్రభుత్వానికి నివేదిక పంపారు. అలాగే.. ఉద్యాన పంటలు 17,708.80 హెక్టార్లలో దెబ్బతిని రూ.110.22 కోట్ల  నష్టం జరిగిందని అంచనా వేశారు. ఎనడీఆర్‌ఎఫ్‌ కింద రూ.24.18 కోట్లు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కింద రూ.30.03 కోట్లు నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి నివేదిక పంపారు. వివిధ పంటలు 33 శాతానికి పైగా దిబ్బతిన్నాయని నివేదికలో పేర్కొన్నారు. కాగా.. 70 శాతానికి పైగా పంటలు దెబ్బ తినడం వల్ల ఒక్క గింజ కూడా చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు అంటున్నారు. 


వాస్తవంగా దిగుబడి నష్టం రూ.2,500 కోట్లు పైమాటే

జిల్లాలో 48 మండలాల్లో 2,79,636 మంది రైతులు వ్యవసాయ, ఉద్యాన పంటలను కోల్పోయారు. వ్యవసాయ పంటలే 1.81,973.56 హెక్టార్లలో దెబ్బతిన్నాయని అధికారిక అంచనా. ప్రభుత్వ నిబంధనల ప్రకారం హెక్టారుకు రూ.15 వేలు మాత్రమే ఇనపుట్‌ సబ్సిడీ ఇస్తారు. అంటే ఎకరాకు రూ.6 వేలు మించదు. వాస్తవంగా ఎకరాకు పెట్టుబడి పంటను బట్టి రూ.35 వేల నుంచి రూ.40 వేలకు పైగా వస్తుంది. పసుపు, ఉల్లి, మిరప, టమోటా వంటి పంటలకు రూ.75 వేలకు పైగానే ఖర్చు చేస్తున్నారు. దిగుబడి ఎకరాకు ఎంత తక్కువ కాదన్నా రూ.50 వేల చొప్పున రూ.1.50 లక్షలు వస్తుంది. పత్తి, మిరప, పసుపు వంటి పంటలు దిగుబడి రెట్టింపు ఉంటుంది. ఈ లెక్కన హెక్టారుకు సగటున రూ.1.50 లక్షలు, ఉద్యాన పంటలకు రూ.2 లక్షల ప్రకారం రూ.2,500 కోట్లకు పైగా నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు. వ్యవసాయ పంటలకు ఎకరాకు రూ.25 వేలు, ఉద్యాన పంటలకు రూ.లక్ష ఇనఫుట్‌ సబ్సిడీ ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఎనడీఆర్‌ఎఫ్‌ ఇనపుట్‌ సబ్సిడీ అందేలా కేంద్రంపై పాలకులు ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


రూ.12 వేలతో ఇసుక మేటలు తొలగించడం సాధ్యమా..?

అన్నమయ్య ప్రాజెక్టు ఆనకట్ట కొట్టుకుపోవడంతో రాజంపేట మండలం పులపత్తూరు, మందపల్లి, తొగూరుపేట, గుండ్లూరు, పాటూరు, నందలూరు తదితర నదితీర గ్రామాల్లో వందల హెక్టార్ల పచ్చని పంట పొలాలు ఇసుక దిబ్బలుగా మారాయి. పాపాఘ్ని, చిత్రావతి, పెన్నా నదితీరాల్లోనూ భూములు కోతకు గురయ్యాయి. జిల్లాలో 483.16 హెక్టార్లలో ఇసుక మేటలు, 424.37 హెక్టార్లలో పంట పొలాలు కోతకు గురయ్యాయని అంచనా. రెండు కలిపి 907.53 హెక్టార్లు సాగుకు పనికిరాకుండా పోయాయి. పులపత్తూరు, మందపల్లి, తోగూరుపేట, సాలిపేట, రాచంద్రాపురం, గుండ్లూరు గ్రామాల్లో ఐదారు అడుగు మేర ఇసుక మేటలు వేశాయి. వరి పొలాలు, మామిడి, ససోటా వంటి ఉద్యాన పంటల పొలాలు ఆరేడు అడుగుల లోతులో భూమి కోతకు గురయ్యాయి.  పులపుత్తూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచి ప్రతాప్‌రెడ్డికి చెందిన 25 ఎకరాల పంట పొలాలు ఏ మాత్రం సాగుకు పనికిరాకుండా కోతకు గురయ్యాయి. కొంత పొలంలో ఇసుక మేటలు వేశాయి. అందులో పదెకరాల మామిడి తోట ఉంది. ఎక్కడ పొలం ఉందో కూడా గుర్తించ లేని విధంగా పొలం, ఏరు ఏకమయ్యాయి. మందపల్లిలో వరదకు తొమ్మిది మంది కుటుంబ సభ్యులను కోల్పోయిన పూజారి కుటంబానికి చెందిన రెండెకరాల్లో ఐదు అడుగులకు పైగా ఇసుక మేటలు వేసింది. ఆ ఇసుక తీస్తేగానీ పొలం సాగుకు పనికి వస్తుందా.. రాదా? అన్నది తేలదు. రామచంద్రాపురంలో నాగా హర్షవర్ధనరెడ్డి కువైతకు వలస వెళ్లి కష్టపడి సంపాదించిన సొమ్ముతో 5 ఎకరాలు కొనుగోలు చేసి మామిడి తోట పెంచారు. అక్కడ మామిడి తోట ఉందని గుర్తించడానికి ఏ మాత్రం వీలు లేకుండా చెట్లతో సహా భూమిని కోసేసింది. ఏ రైతును కదిపినా ఈ భూములను మళ్లి సాగు యోగ్యంలోకి తీసుకురావాలంటే ఎకరాకు రూ.5-6 లక్షల వరకు ఖర్చు వస్తుంది. అప్పటికైనా సాగుకు పనికి వస్తుందా..? అదీనమ్మకం లేదని అంటున్నారు. ఇసుక మేటలు తొలగించేందుకు హెక్టారుకు రూ.12 వేలు ఇస్తామని సీఎం జగన గురువారం పులపత్తూరులో ప్రకటించారు. ఈ మొత్తం ఏమాత్రం సరిపోదని, ప్రభుత్వమే ఉపాధి హామీ పథకం కింద ఇసుక మేటలు, కోతకు గురైన భూములను బాగు చేసి ఇవ్వాలని కోరుతున్నారు. 

Updated Date - 2021-12-04T05:18:49+05:30 IST