Abn logo
Sep 25 2021 @ 00:22AM

ల్యాబ్‌ టెక్నీషియన్ల ఇష్టారాజ్యం

రక్త పరీక్షల పేరిట అడ్డగోలు దోపిడీ

అడిగినంత ఇస్తేనే రిపోర్టులు చేతికి

కన్సల్‌టెంట్‌ వైద్యులకు పర్సంటేజీలు

టీ హబ్‌పై అవగాహన కల్పించని అధికారులు

పట్టించుకోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ

జిల్లాలో 12 ఇండిపెండెంట్‌ ప్రైవేట్‌ ల్యాబ్‌లు

ఆదిలాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోగ నిర్ధారణ పరీక్షల పేరిట ప్రైవేట్‌ ల్యాబ్‌ల నిర్వాహకులు అడ్డగోలు వసూలు దందాకు ఎగబడుతున్నారు. కొద్ది రోజులుగా సీజనల్‌ వ్యాధులు విజృంభించడంతో రోగులు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఏ చిన్న పాటి జ్వరం వచ్చినా రక్త పరీక్షలు తప్పని సరి అంటూ వైద్యులు చెప్పడంతో రోగ నిర్ధారణ పరీక్షలు చేయించక తప్పడం లేదు. ప్రతి ప్రైవేట్‌ ఆసుపత్రిలోనే ల్యాబ్‌లను ఏర్పాటు చేసుకుంటూ కొందరు వైద్యులు అడ్డగోలుగా నిర్ధారణ పరీక్షలకు రెఫర్‌ చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో 12 ఇండిపెండెంట్‌ ప్రైవేట్‌ ల్యాబ్‌లు ఉండగా ఆసుపత్రుల పరిధిలో 60కి పైగానే ల్యాబ్‌లు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖాధికారులు పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆవరణలో టీ హబ్‌ ద్వారా ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నా అవగాహన లేని రోగులు ప్రైవేట్‌ ల్యాబ్‌లను ఆశ్రయిస్తూ తీవ్రంగా నష్టపోతున్నారు. అవసరం ఉన్నా.. లేక పోయినా రక్త, మూత్ర పరీక్షలు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. ప్రధానంగా టైఫాయిడ్‌, మలేరియా, డెంగ్యూ, వైరల్‌ జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు. ప్రతి ల్యాబ్‌లో పరీక్షలకు అవసరమయ్యే ఫీజుల వివరాల పట్టికను ప్రత్యేక బోర్డుపై ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో ఏ ఒక్క ల్యాబ్‌లో నిబంధనలు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.

అడిగినంత ఇస్తేనే రిపోర్టు..

రోగ నిర్ధారణ పరీక్షలు పూర్తయిన తర్వాత అడిగినంత ఇస్తేనే  రోగికి నిర్ధారణ పరీక్షల రిపోర్టును ఇస్తున్నారు. లేదంటే బేరం ఆడవద్దంటూ తిప్పి పంపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చే రోగులకు ఏ మాత్రం ఫీజుల వివరాలపై అవగాహన లేక పోవడంతో మోసపోతున్నారు. అసలు మలేరి యా, టైఫాయిడ్‌, డెంగ్యూ, వైరల్‌ ఫివర్స్‌ లాంటి పరీక్షలకు రూ.1000 లోపే తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కొందరు ల్యాబ్‌ నిర్వాహకులు పరిస్థితిని బట్టి రూ.1500 నుంచి రూ.2500 వరకు వసూలు చేస్తూ జేబులో వేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ల్యా బ్‌ నిర్వాహకులు ఎంఎల్‌టీ, డీఎంఎల్‌టీ ఇందులో ఏదైనా కోర్సును పూర్తిచేసి ఉండాలి. అలాగే వైద్యుల ధ్రువీకరణ పొందాలి. కానీ ఇలాంటి నిబంధనలు పట్టించుకోకుండానే ల్యాబ్‌ల్లో పనిచేసే సిబ్బందితోనే రోగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. నిర్ధారణ పరీక్షలపై ఎలాంటి అవగాహన లేని సిబ్బంది ఇచ్చే రిపోర్టుల ద్వారా లేని రోగాలు అంటగడుతున్నారంటూ బాధితులు ఆందోళనకు గురవుతున్నారు. 

వైద్యులకు కమీషన్‌..

వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన రోగులకు రోగ నిర్ధారణ పరీక్షల కోసం రెఫర్‌ చేస్తున్న వైద్యులు ప్రతి రక్త పరీక్ష వెంట కమీషన్‌ గుంజుతున్నారు. దీంతో వైద్యుల కమీషన్‌తో సహా రోగి నుంచి అధిక ఫీజుల ను ముక్కుపిండి మరి వసూలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన బిల్లులను కూడా ఇవ్వకుండానే పంపుతున్నారు. ముందే రక్త, మూత్ర పరీక్షలు చేయించుకుని ఆసుపత్రికి వెళ్తే మళ్లీచేయాలంటూ వైద్యులు తిరకాసు పెడుతున్నారు. బయట ల్యాబుల్లో పరీక్షలు చేస్తే తమకేమి గ్యారంటీ అంటూ సమాధానం ఇస్తున్నారు. ఒక్కో పరీక్ష ఫీజుపై రూ.200 నుంచి రూ.500 వరకు వైద్యులు జేబుల్లో వేసుకుంటున్నారు. ఓపీ ఫీజుతో పాటు అదనంగా రక్త పరీక్షలతో కమీషన్‌ను దండుకుంటున్నారు. ఒక్కో రోజుకు పరీక్షల పైనే కనీసం రూ.5వేల నుంచి రూ.10వేల వరకు ఆదాయం వస్తున్నట్లు తెలుస్తోంది. పరీక్షల నాణ్యత, ఖచ్చితత్వాన్ని దేవుడెరుగు కాని తమకు రావాల్సిన ఆదాయం పైనే కొందరు వైద్యులు దృష్టి సారిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.