Abn logo
Oct 17 2021 @ 01:30AM

పండుగ ఖర్చు రూ.3.87కోట్లు

మందు, ముక్కకే అత్యధిక ఖర్చు

మాంసానికి రూ.1.15కోట్ల ఖర్చు

ఒక్క రోజులో రూ.2.72కోట్ల విలువైన మద్యం అమ్మకాలు


కోదాడ, అక్టోబరు 16: ఉమ్మడి జిల్లా ప్రజలు ఘనంగా నిర్వహించే పండుగల్లో దసరా ఒకటి. ఈ పండుగకు మద్యం, మాంసం విక్రయాలు అధికంగా ఉంటాయి. ఉమ్మడి జిల్లాలో దసరా సందర్భంగా శుక్రవారం ఒక్క రోజే రూ.2.72కోట్ల విలువైన మద్యాన్ని మందుబాబులు లాగేశారు. ఇక మాంసానికి రూ.1.15కోట్లు ఖర్చు చేశారు. మొత్తం మందు, ముక్కకే రూ.3.87కోట్లు ఖర్చయ్యాయి.


మందుకే అధికంగా..

ఉమ్మడి జిల్లాలో 272 వైన్‌షాపులు, 23 బార్లు ఉన్నాయి. దసరాకు ముందు సాధారణంగా ఒక్కో వైన్‌షాపులో రోజుకు సుమారు రూ.2.50లక్ష విలువైన మద్యం విక్రయించేవారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 272దుకాణాలలో రూ.6.80కోట్ల మద్యం విక్రయించేవారు. దసరా పం డుగకు ముందు ఈనెల 14న మద్యం విక్రయాలు ఒక్కో వైన్స్‌లో రూ.4లక్షలకు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.10.88కోట్లకు చేరింది. ఇక దసరా నాడు విక్రయాలు ఒక్కో దుకాణంలో రూ.5లక్షలకు, ఉమ్మడి జిల్లాలో రూ.13.60కోట్ల అమ్మకాలు కొనసాగాయి. దీంతో ఒక్కరోజులోనే అదనంగా రూ.2.72కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. దీనికి తోడు బార్లలో అమ్మకాలు అదనం.


పెరిగిన 27శాతం అమ్మకాలు

గత ఏడాది అక్టోబరు నెల 1 నుంచి 15వ తేదీ వరకు 46,247 లిక్కర్‌ కేసులను ఎక్సైజ్‌ శాఖ విక్రయించింది. అదే విధంగా బీర్లు 31,753 మద్యం దుకాణాలకు సరఫరా చేసింది. దీంతో రూ.35.73కోట్ల అమ్మకాలు కొనసాగాయి. ఈఏడాది అదే నెలలో 58,316 లిక్క ర్‌,43,534 బీర్ల కేసులను ఎక్సైజ్‌శాఖ సరఫరా చేసింది. దీంతో అమ్మకాలు రూ.45. 41కోట్ల విక్రయాలు కొనసాగాయి. గత ఏడాదితో పోల్చితే లిక్కర్‌ అమ్మకాలు 26శాతం, బీర్లు 37శాతం పెరిగాయి. మొత్తంగా అక్టోబరు మా సంలో 27శాతం అమ్మకాలు పెరిగాయి. దీంతో ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది.


మాంసందీ అదే దారి

ఉమ్మడి జిల్లాలో 240 చికెన్‌ దుకాణాలు ఉన్నాయి. పండుగ నేపథ్యంలో ఈ నెల 14న రూ.2,92,800 కిలో ల చికన్‌ విక్రయాలు (ఒక్కో దుకాణంలో 1,220కిలోల)చొప్పున అమ్మకాలు సాగాయి. కిలో రూ.210చొప్పున రూ.6,14,88,000 చికన్‌ విక్రయాలు జరిగాయి. పండుగనాడు 3.36లక్షల చికన్‌ విక్రయాలు (ఒక్కో దుకాణంలో 1,400కిలో చొప్పున) కొనసాగాయి. దీంతో రూ.7,05,60,000 వ్యాపారం కొనసాగిం ది. దసరాకు ముందు రోజుతో పోల్చితే రూ.90.72లక్షల అదనం. చికెన్‌తో పాటు మటన్‌, చేపలకు మరో రూ.25లక్షలు ఉమ్మడి జిల్లా ప్రజలు ఖర్చు చేశారు. మొత్తంగా మాంసానికి రూ.1.15కోట్ల ఖర్చయింది. కరోనా తగ్గుముఖం పట్టడం, యువత ఎక్కవగా మద్యంపై ఆసక్తి కనబర్చడం, కరోనా వైరస్‌ కట్టడికి రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు అంతా మాంసంపై మొగ్గుచూపడంతో అమ్మకాలు పెరిగాయి. ప్రస్తుతం చికెన్‌ ధర కిలో రూ.230 ఉండగా, సోమవారం నుంచి మరో రూ.10అదనంగా పెరగనుందని వ్యాపారులు చెబుతున్నారు.