పండుగ చేసుకున్నారు!

ABN , First Publish Date - 2021-01-18T08:24:30+05:30 IST

సంక్రాంతి పండగ అధికార పార్టీ నేతలకు కాసుల వర్షం కురిపించింది. ‘సాంస్కృతిక’ కార్యక్రమాల పేరిట కోడిపందేలు, పేకాటలు నిర్వహించి రూ.కోట్లు జేబులో వేసుకొని నిజంగానే పండగ చేసుకున్నారు.

పండుగ చేసుకున్నారు!

  • సంక్రాంతి పేరిట వైసీపీ నేతల దందా
  • కాసులు కురిపించిన కోడిపందేలు, పేకాట 
  • నేరుగా రంగంలోకి దిగిన అధికార నేతలు 
  • రూ.లక్షల పెట్టుబడులు పెట్టి బరులు సిద్ధం 
  • కోడిపందేల్లో 20%, పేకాటలో 70% కమీషన్‌ 
  • గుంటూరు, కృష్ణా, పశ్చిమల్లో భారీగా బరులు 
  • చేతులు మారిన కోట్ల రూపాయల నగదు 
  • ‘అమ్మఒడి’ నగదు పందేల్లో సమర్పయామి

మా ఊరికి జబర్దస్త్‌ కామెడీ యాక్టర్లు, పాటలు పాడేవారిని తీసుకొస్తున్నామన్నారు. చివరికి కోడిపందేలు పెట్టారు. పేకాట ఆడించారు. ఇలాంటివి మేం పుట్టినాక ఎప్పుడూ చూడలేదు. మా కళ్ల ముందే లక్షలకు లక్షలు పందేల్లో పోగొట్టుకున్నారు. ఈ ఏడు పంటలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ సమయంలోనే ఇలాంటివి పెట్టి మిగిలిన కాసిని డబ్బులూ ఎత్తుకుపోయారు. పైగా ఇలాంటివి పెట్టడం పెద్ద గర్వకారణం అంటున్నారు.కొత్తగా కోడి పందేలు చూసిన గుంటూరు జిల్లా వాసి ఆవేదన ఇది


(అమరావతి-ఆంధ్రజ్యోతి) : సంక్రాంతి పండగ అధికార పార్టీ నేతలకు కాసుల వర్షం కురిపించింది. ‘సాంస్కృతిక’ కార్యక్రమాల పేరిట కోడిపందేలు, పేకాటలు నిర్వహించి రూ.కోట్లు జేబులో వేసుకొని నిజంగానే పండగ చేసుకున్నారు. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఇలాంటి కార్యక్రమాలు యథేచ్ఛగా కొనసాగాయి. కొన్నిచోట్ల ఇవన్నీ కొత్త కాకపోయినా ఈసారి దర్జాగా కోట్లు చేతులు మార్చుకునే సంస్కృతికి అధికార నేతలు తెర తీశారు. గతంలో ఎప్పుడూ లేనిచోట్లకు కూడా పందేల సంస్కృతి విస్తరించింది. ఈసారి పందేలను అనధికారికంగా ‘అధికారికం’ చేసేశారు.


సాంస్కృతిక కార్యక్రమాలకు రావాలంటూ పోస్టర్లు వేసి మరీ ఆహ్వానించి పందేల రుచి చూపించారు. గుంటూరు జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రజలు లక్షల్లో బెట్టింగులు కాసే కోడిపందేలు, క్షణాల్లో వేలకు వేలు చేతులు మారే పేకాటల గురించి వినడమే తప్ప పెద్దగా చూసింది లేదు. మన ప్రజలు ఇవన్నీ ఆడకపోతే ఎలా అనుకున్నారో ఏమో... ఆ జిల్లాలోని వైసీ పీ నేతలు లక్షలకు లక్షలు పోసి పొలాలన్నీ చదును చేసి, బరులు సిద్ధం చేశారు. కోడిపందేలు, పేకాట సంస్కృతిని సొంతూరికి తీసుకొచ్చేశారు. భోగి రోజు అంగరంగ వైభవంగా పోటీలు ప్రారంభించారు. మూడు రోజులు తిరిగే సరికి చుట్టుపక్కల గ్రామాల్లోని చాలామంది రెండు, మూడు నెలలు కష్టపడి సంపాదించుకున్నదంతా పందేల్లో పోగొట్టుకుని బిక్కమొహం వేశారు. చివరికి కనుమ రోజు పండుగ చేసుకోవడానికి కూ డా చేతిలో డబ్బులు మిగల్లేదు. అదే సమయానికి అధికార నేతలకు మాత్రం పెట్టిన పెట్టుబడికి రెట్టింపు నగదు చేతికొచ్చింది. 


ఈసారి కోడిపందేలను పూర్తిగా వ్యాపా రం చేసేశారు. ఎంత పెట్టుబడి పెడితే ఎం త లాభమో అంచనాలు వేసుకుని మరీ రం గంలోకి దిగారు. గుంటూరులో ఓ నాయకు డు కోడిపందేలు, ప్రముఖులతో పాటల కచేరీలు, కామెడీ స్కిట్‌లు అంటూ అక్షరాలా రూ.70 లక్షలు ఖర్చు చేశాడు. 5ఎకరాల భూమిని చదును చేయించి, చుట్టూ బారికే డ్లు కట్టించి మరీ భారీ ఎత్తున కార్యక్రమాలు చేశారు. వాటిని చూసేందుకు ఉత్సాహంగా వెళ్లిన స్థానికులకు పార్కింగ్‌ నుంచే బాదు డు మొదలైంది. ద్విచక్ర వాహనానికి రూ.20, కారుకు రూ.40 చొప్పున వసూలు చేశారు. అయితే ఇక్కడో విశేషం ఉంది. పేదలకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాల్లోనే పార్కింగ్‌ పెట్టి లక్షలు దండుకున్నారు. మా కు ఇక్కడ ప్లాటు ఉంది అనుకున్నవారు త మ స్థలంలోనే బండి పెట్టుకున్నా టికెట్‌కు డబ్బు చెల్లించాల్సి రావడం గమనార్హం. ఇక అక్కడ పెట్టిన ప్రతి షాపునకూ వేలం పెట్టి మరీ సొమ్ము చేసుకున్నారు. గుంటూరులో ఈ కార్యక్రమాలు నిర్వహించిన ఒకచోట కేవ లం బిర్యానీ అమ్ముకోడానికే రూ.2లక్షలు వసూలు చేశారు. మద్యం, కూల్‌డ్రింక్స్‌ షాపులు పెట్టినవారికి లక్షలు వచ్చిపడ్డాయి. 


జేబులు ఖాళీ 

ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో కోడిపందేలు నిర్వహించిన అధికార నేతలు పేకాట సంస్కృతినీ తీసుకొచ్చారు. స్వయంగా ప్రజాప్రతినిధులు, పోలీసులు ఉన్నచోటే లోపలా, బయట అంటూ క్షణాల్లో రూ.వేలు చేతులు మారాయి. పేకా ట, రంగుల బంతాట అంటూ రకరకాల ఆటలతో జనం జేబులు ఖాళీ చేశారు. వచ్చి న లాభంలో నిర్వాహకుల వాటా 30శాతం కాగా, వైసీపీ నేతల వాటా 70శాతం. ఇక కోడిపందేల్లో కత్తి కట్టినందుకు 20శాతం కమీషన్‌ వసూలు చేశారు. ఒక్కచోటే రోజుకు సగటున రూ.2-3 కోట్ల పందేలు జరగ్గా నేతలకే రూ.50లక్షలు ముట్టింది.  


పందేలకు ‘అమ్మఒడి’ నగదు 

ఈ సంవత్సరం పంటలు అంతంతమాత్రంగానే ఉండటంతో సంక్రాంతికి గ్రామీణ ప్రాంతాల ప్రజల చేతిలో పెద్దగా నగదు లేదు. కానీ సరిగ్గా పండుగకు రెండు రోజుల ముందే అమ్మఒడి నగదు రూ.14వేలు ఖా తాల్లో పడింది. అదికాస్తా కోడిపందేలు, పే కాటలకు సమర్పించుకున్నారు. పిల్లల కోసం వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన నగదు కా స్తా అధికార పార్టీ నేతల జేబుల్లోకి వెళ్లింది. 

Updated Date - 2021-01-18T08:24:30+05:30 IST