పండుగ ముగిసింది..నగరం పిలిచింది!

ABN , First Publish Date - 2021-01-18T08:13:32+05:30 IST

సంక్రాంతి పండుగ ముగిసింది. సొంతూళ్లకు వెళ్లిన జనం తిరుగు పయనమయ్యారు. సొంత వాహనాలు, ప్రైవేటు, ఆర్టీసీ బస్సుల్లో వెళ్లిన జనం.. క్రమంగా భాగ్యనగరం వైపుగా సాగుతున్నారు

పండుగ ముగిసింది..నగరం పిలిచింది!

భాగ్యనగరం దిశగా వాహనాల బారులు

టోల్‌ప్లాజాల వద్ద కిక్కిరిసిన వాహనాలు

విజయవాడ నుంచి ఒక్కరోజే 100 బస్సులు

కార్లు, బస్సులు, రైళ్లు, విమానాలన్నీ ఫుల్లే!


ఈ ఫొటో చూశారా! కుడి వైపు రోడ్డు.. సంక్రాంతి నాటి హైదరాబాద్‌ను సూచిస్తుంటే.. మరోవైపు రోడ్డు.. పండుగ తర్వాత నగరాన్ని చూపిస్తోంది. పండక్కి వారం ముందే ఊరెళ్లిన నగరవాసులు.. సరదాగా గడిపి.. పండుగ సంబురాన్ని ఆస్వాదించి.. ఆ అనుభూతులను మూటగట్టుకుని.. రెట్టించిన ఉత్సాహంతో తిరిగి నగరబాట పడుతున్నారు. ఉద్యోగులందరూ సోమవారం విధులకు హాజరు కావాల్సి ఉండడంతో.. ఆదివారం నాడే ఒక్కసారిగా రోడ్డెక్కారు. దీంతో విజయవాడ నుంచి హైదరాబాద్‌ వచ్చే మార్గం ఇలా వాహనాలతో కిక్కిరిసి పోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని పంతంగి టోల్‌గేట్‌, నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌ టోల్‌గేట్ల వద్ద వాహనాలు బారులుతీరాయి. 


విజయవాడ/నల్లగొండ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ ముగిసింది. సొంతూళ్లకు వెళ్లిన జనం తిరుగు పయనమయ్యారు. సొంత వాహనాలు, ప్రైవేటు, ఆర్టీసీ బస్సుల్లో వెళ్లిన జనం.. క్రమంగా భాగ్యనగరం వైపుగా సాగుతున్నారు. ఆర్టీసీ కృష్ణా రీజియన్‌ ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు 100 ప్రత్యేక బస్సులను నడిపింది. చాలామంది ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్‌ చేసుకోవడంతో.. డిమాండ్‌ను బట్టి అధికారులు అదనంగా బస్సులు నడిపారు. ఇవి కూడా చాలకపోవడంతో.. క్యాబ్‌లకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. సొంత వాహనాల్లో వెళ్లిన వాళ్లు కూడా ఆదివారమే తిరుగు ప్రయాణం కావడంతో.. కీసర టోల్‌గేట్‌ వద్ద కార్లు బారులు తీరాయి. ఫాస్టాగ్‌తో నిమిషాల్లోనే టోల్‌ క్లియర్‌ చేస్తున్నా.. టోల్‌ప్లాజా వద్ద రద్దీ మాత్రం తగ్గడంలేదు.


మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 20 వేల వాహనాలు కీసర టోల్‌ప్లాజా దాటాయి. ఇక రాత్రి వెళ్లే వాహనాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. విజయవాడ విమానాశ్రయం నుంచి ఆదివారం 30 విమానాలు ఫుల్‌ రష్‌తో నడిచాయి. శనివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 36 విమానాలు విజయవాడ నుంచి బయలుదేరాయి. రైళ్లు పరిమిత సంఖ్యలో ఉండటం వల్ల జనం ఎక్కువగా కార్లు, విమానాలు, బస్సులను ఆశ్రయించారు. ఇప్పటి వరకు వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తున్న టెకీలకు ఆయా సంస్థల నుంచి ఆఫీసులకు రావాలంటూ మెయిల్స్‌ రావడంతో.. వారు కూడా బయలుదేరారు. అధిక రద్దీకి ఇది కూడా ఓ కారణంగా భావిస్తున్నారు.

Updated Date - 2021-01-18T08:13:32+05:30 IST