ఇళ్లల్లోనే పండుగ జరుపుకోవాలి

ABN , First Publish Date - 2020-08-15T10:02:21+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఇళ్లల్లోనే వినాయకచవితి జరుపుకోవాలని కమిషనర్‌ లవన్న పేర్కొన్నారు.

ఇళ్లల్లోనే పండుగ జరుపుకోవాలి

వీధుల్లో విగ్రహాలు పెట్టేందుకు అనుమతి లేదు : కమిషనరు లవన్న 


కడప (ఎర్రముక్కపల్లె), ఆగస్టు 14: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఇళ్లల్లోనే వినాయకచవితి జరుపుకోవాలని కమిషనర్‌ లవన్న పేర్కొన్నారు. కడప కార్పొరేషన్‌ కార్యాలయంలోని కమిషనరు ఛాంబరులో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 22న జరిగే చవితి పండుగను కొవిడ్‌-19 దృష్ట్యా ఎవరి ఇళ్లల్లో వారు జరుపుకోవాలని, వీధుల్లో విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. సాధ్యమైనంత వరకు మట్టితో చేసిన వినాయక విగ్రహాలే తెచ్చుకోవాలని, కరోనా మహమ్మారి త్వరగా నాశనం కావాలని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాలన్నారు. కాగా శనివారం జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కడప పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించే శకటాలు కార్యక్రమ అనంతరం నగరంలో ప్రదర్శించాలని కలెక్టరు ఆదేశించారని, దీనికి సంబంధించి మున్సిపల్‌ టౌన్‌ప్లానింగ్‌ అధ్వర్యంలో రూట్‌మ్యాప్‌ రూపొందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వన్‌టౌన్‌ సీఐ సత్యనారాయణ పాల్గొన్నారు.


నియమ నిబంధనలు పాటించాలి..సబ్‌ కలెక్టర్‌ పృధ్వీతేజ్‌

కడప(కలెక్టరేట్‌): కరోనా నేపథ్యంలో ప్రతిఒక్కరూ ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని కడప సబ్‌కలెక్టర్‌ పృధ్వీతేజ్‌ పిలుపునిచ్చారు. కడప రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయంలో శుక్రవారం చవితి ఉత్సవాల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి పండుగను ప్రతిఒక్కరూ ఇళ్లలోనే భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలన్నారు. కార్యక్రమంలో నగర కమిషనరు లవన్న, డీఎల్‌పీవో మస్తాన్‌రావు, తహసీల్దార్లు శివరామిరెడ్డి, మహేశ్వరరెడ్డి, అనురాధ, సీఐలు సత్యనారాయణ, అశోక్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-15T10:02:21+05:30 IST