పిండాన్ని.. పిండేస్తున్నారు!

ABN , First Publish Date - 2022-09-22T05:54:00+05:30 IST

అమ్మ కడుపు లో ఆడ పుట్టుక ప్రాణం పోసుకుంటోందని తెలిస్తే చాలు.. గర్భంలోనే పిండాన్ని పిండేస్తున్నారు. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం వెయ్యి మంది పురుషులకు గాను 934 మంది స్ర్తీలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే, ఆడపిల్ల అంటేనే సమాజం లో అదోరకమైన భావన ఉండడంతో యేటేటా భ్రూణహత్యల దారుణా లు పెరిగి పోతున్నాయి. 1994 భ్రూణహత్యల నివారణ చట్టం

పిండాన్ని.. పిండేస్తున్నారు!

జిల్లాలో ఆగని లింగనిర్ధారణ పరీక్షలు

స్కానింగ్‌ సెంటర్‌ నిర్వాహకుల ఇష్టారాజ్యం

గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కొనసాగుతున్న దందా

పత్తాలేని అధికారిక కమిటీలు.. ప్రజల్లో అవగాహన కరువు

ఫిర్యాదులు వస్తున్నా.. వైద్య ఆరోగ్య శాఖ తనిఖీలు నిల్‌

ఆదిలాబాద్‌, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): అమ్మ కడుపు లో ఆడ పుట్టుక ప్రాణం పోసుకుంటోందని తెలిస్తే చాలు.. గర్భంలోనే పిండాన్ని పిండేస్తున్నారు. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం వెయ్యి మంది పురుషులకు గాను 934 మంది స్ర్తీలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే, ఆడపిల్ల అంటేనే సమాజం లో అదోరకమైన భావన ఉండడంతో యేటేటా భ్రూణహత్యల దారుణా లు పెరిగి పోతున్నాయి. 1994 భ్రూణహత్యల నివారణ చట్టం ప్రకారం భ్రూణహత్యలకు పాల్పడిన లేక ప్రోత్సహించినా చట్టరీత్యా శిక్షార్హులు. నిత్యం జిల్లాలో ఎక్కడో ఓ చోట గుట్టుచప్పుడు కాకుండా భ్రూణహత్యలు యథేచ్ఛగా జరిగిపోతున్నా.. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం తేలికగానే తీసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. సిజేరియన్‌ ఆప రేషన్లు తగ్గించి నార్మల్‌ డెలివరీలను పెంచాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తు న్నా.. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో జరుగుతున్న ఆపరేషన్లకు.. అధికారుల వద్ద ఉన్న లెక్కలకు ఏమాత్రం పొంతన లేకుండానే పోతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్‌ సిబ్బంది చెప్పిందే లెక్కాగా మారింది. దీనాధారంగానే ప్రభుత్వానికి అధికారులు నివేదికలు పంపుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లాలో కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు ఇదే పని గా పెట్టుకుంటున్నారన్న ఫిర్యాదులు వస్తున్నా.. వైద్య ఆరోగ్య శాఖ తనిఖీ లు నిర్వహించక పోవడంతో కొందరు వైద్యుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. కట్టడి చేయాల్సిన వైద్య ఆరోగ్య శాఖాధికారులే ప్రేక్షక పాత్ర పోషించడంతో జిల్లాలో భ్రూణహత్య దారుణాలు ఆగడం లేదు.

నిబంధనలు గాలికి..

జిల్లాలో అడ్డగోలుగా వెలిసిన స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలు గాలికొదిలేస్తూ.. అడ్డగోలుగా లింగా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. గర్భిణులకు ఏదైనా ప్రాణపాయం ఉందన్న సమయంలోనే లింగ నిర్ధారణ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కానీ కొందరు వైద్యులు చిన్నపాటి సమస్యలకు కూడా స్కానింగ్‌ పరీక్షలు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. దీంతో గర్భంలో పెరిగే శిశువు ఆడ, మగ అని అప్పుడే తెలిసిపోవడంతో భ్రూణహత్యలకు సిద్ధమవుతున్నారు. ఒక్కో స్కానింగ్‌ పరీక్షకు నిర్వాహకులు రూ.రెండు వేల నుంచి రూ.మూడు వేల వరకు దండుకుంటున్నారు. అత్యవసర సమయంలో అధికంగానే వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. జిల్లాకేంద్రంలో కొన్ని స్కానింగ్‌ సెంటర్లు ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నా.. చర్యలు తీసుకునేందుకు వైద్య అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. కొందరు సీనియర్‌ వైద్యులు భ్రూణహత్యలు చేయడమే పనిగా పెట్టుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. కేవలం నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు మాత్రమే చేస్తూ వదిలేయడంతో.. స్కానింగ్‌ సెంటర్‌ నిర్వాహకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి.

బాధితుల అవసరాన్ని బట్టి రేటు

బాధితుల అవసరం ఆరోగ్య పరిస్థితులను బట్టి వైద్యులు రేటును నిర్ణయిస్తూ మరి భ్రూణహత్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓస్‌ రోడ్డులో ఉన్న ఓ ఆసుపత్రితో పాటు రైల్వేగేటు సమీపంలో ఉన్న ఆసుపత్రుల్లో ఇలాంటి సంఘటనలు తరుచు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇటీవల రైల్వే ట్రాక్‌పై భ్రూణహత్యకు పా ల్పడిన మృతపిండాన్ని కుక్కలు ఎత్తుకెళ్తుండగా స్థానికులు చూసినట్లు చెబుతున్నారు. ఇలా ఒక్కో అబార్షన్‌ కేసుకు రూ.10వేల నుంచి రూ.20వేల వరకు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. గర్భంలోని పిండం వయస్సును బట్టి మరి రేటును నిర్ణయిస్తూ వసూళ్లకు ఎగబడుతున్నట్లు తెలుస్తుంది. వైద్యులను ఆశ్రయించిన బాధితులను భయబ్రాంతులకు గురి చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. కొన్ని సందర్భా ల్లో వైద్యం వికటించి తల్లి ప్రాణానికే ముప్పు వాటిల్లుతుంది. అయినా ఇలాంటి విషయాలను బయటకు పొక్కకుండా వైద్యులు జాగ్రత్త పడుతున్నారు. ఏదై నా విషయం బయటకి వచ్చిన మధ్యవర్తులతో రాయబారం నడుపుతు సెటిల్‌ చేసుకుంటున్నాయి. మారుమూల ప్రాంత గ్రామాలలో ఎక్కువగా ఇలాంటి సంఘటనలే చోటు చేసుకుంటున్నాయి. స్థానిక ఆర్‌ఎంపీ వైద్యులు బాధితులను భయబ్రాంతులకు గురి చేసి వైద్యులతో డీల్‌చేస్తూ కమిషన్‌ దందాకు ఎగబడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

పత్తాలేని కమిటీలు

భ్రూణహత్యల నిర్మూలనకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినా.. అవి పత్తాలేకుండానే పోతున్నాయి. తల్లిదండ్రుల్లో ఏమాత్రం అవగాహన లేకపోవడంతో గుట్టుచప్పుడు కాకుండా భ్రూణహత్యలకు పాల్పడుతు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఆడ శిశువు అనగానే అంతమొందించేందుకు ఆగమేఘాల మీద వైద్యులను సంప్రదిస్తున్నారు. బాధితుల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న కొందరు వైద్యులు భయబ్రాంతులకు గురిచేసి రహస్యంగా అబార్షన్‌ చేస్తూ దండుకుంటున్నారు. ముఖ్యం గా మహిళ శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు శాఖ, రెవెన్యూ శాఖల అధికారులు జిల్లా వైద్యాధికారి ఆధ్వర్యంలో తరుచు ఆసుపత్రులు, స్కానింగ్‌ సెంటర్లను పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో ప్రైవేట్‌ ఆసుపత్రుల ఆగ డాలకు అడ్డూఅదుపు లేకుండానే పోతోంది. నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న స్కానింగ్‌ సెంటర్లపై చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. అలాగే కమిటీల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. యేడాది లో ఒకటి, రెండు సార్లు కూడా సమావేశమైన దాఖలాలు కనిపించడం లేదు. ఏదో నామమాత్రంగానే కమిటీలను ఏర్పాటు చేసి వదిలేస్తున్నారు.

కమిటీని సమావేశ పరిచి చర్యలు తీసుకుంటాం

: డా.రాథోడ్‌ నరేందర్‌, డీఎంహెచ్‌వో, ఆదిలాబాద్‌

జిల్లాలో లింగనిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్లు ఎవరూ ఫిర్యాదులు చేయడం లేదు. రహస్యంగా పరిశీలించేందుకు చర్యలు తీసుకుంటాం. వెంటనే కమిటీని సమావేశ పరిచి లింగా నిర్ధారణ పరీక్షలు, భ్రూణహత్యలపై చర్చిస్తాం. వైద్యుల సలహాలు, సూచనలు లేకుండానే తల్లిదండ్రులు కూడా లింగా నిర్ధారణ పరీక్షలు చేయిస్తే చర్యలు తప్పవు. అత్యవసర పరిస్థితుల్లోనే వైద్యుడి సలహా మేరకు గర్భిణులకు స్కానింగ్‌ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. రైల్వే ట్రాక్‌పై మృతపిండం విషయం మా దృష్టికి రాలేదు. ఎవరైనా నిర్భయంగా వచ్చి ఫిర్యాదు చేస్తే సంబంధిత స్కానింగ్‌ సెంటర్లపై దాడులు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2022-09-22T05:54:00+05:30 IST