ఎనిమిదవ నిజాం ఆఖరి పాలన

ABN , First Publish Date - 2020-07-14T06:34:59+05:30 IST

విచిత్రమైన ముఖ్యమంత్రి ఒకరు మన దేశంలో ఉన్నారు. ఆయన రోజుల తరబడి ఎవరికీ కనపడరు, వినపడరు. ఊరికి దూరంగా తనకంటూ కట్టించుకున్న ఒక ఫార్మ్ హౌజ్‌లో అక్కడే...

ఎనిమిదవ నిజాం ఆఖరి పాలన

కేసీఆర్ తన గడీలో కూర్చుని తన మనసుకు ఏది తోచితే అదే విధంగా పాలన సాగిస్తున్నారు. ప్రజాస్వామ్యం, పారదర్శకత, జవాబు దారీ విధానం అనే పదాలకు ఆయన నిఘంటువులో చోటు లేదు. తానే ప్రాజెక్టులు రూపకల్పన చేసి, తానే డిజైన్ చేసి తన ఇష్టం వచ్చినట్లు కట్టించి, ఎవరికీ లెక్కలు చెప్పకుండా, డీపీఆర్ లూ తొక్కి పెట్టారు. కేసీఆర్ అసమర్థత పాలన ఏ విధంగా ఉన్నదో ఇవాళ కరోనా సమయంలో ప్రస్ఫుటంగా బయటపడింది. దేశ వ్యాప్తంగా సగటున 7.2 శాతం పాజిటివ్ కేసులు నమోదైతే, తెలంగాణలో 21 శాతం నమోదయ్యాయి!


విచిత్రమైన ముఖ్యమంత్రి ఒకరు మన దేశంలో ఉన్నారు. ఆయన రోజుల తరబడి ఎవరికీ కనపడరు, వినపడరు. ఊరికి దూరంగా తనకంటూ కట్టించుకున్న ఒక ఫార్మ్ హౌజ్‌లో అక్కడే రెండు మూడు వారాలు తిష్ట వేసుకుని కూర్చుంటారు. అక్కడికి వెళ్లడానికి ఎవరూ సాహసించరు.అక్కడేం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. ఆయన అనుకుంటే తప్ప ఎవరూ ఆయనతో మాట్లాడడానికి వీలు లేదు. మొత్తం రాష్ట్రం అంతా ఆయన కోసం ఎదురు చూస్తున్నా, ఎంతో మంది కరోనా వంటి రోగాల వాతపడి మరణిస్తున్నా, పైళ్లు కుప్పలు తెప్పలుగా పెం డింగ్‌లో పడిపోయినా, పాలనా వ్యవస్థ స్తంభించిపోయినా, ఆఖరుకు రాష్ట్ర గవర్నర్, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు ఆయనను కలుసుకోవాలనుకున్నా సదరు ముఖ్యమంత్రి రాజధాని పొలిమేరల్లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఆయన ఎవరో ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అని చరిత్ర పుటలన్నీ తిరగేసి చూస్తే కనపడే ఏకైక నేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.


ముఖ్యమంత్రి అయిన ఆరేళ్లలో ఆయన చాలా చాలా తక్కువ సార్లు మాత్రమే సచివాలయానికి వెళ్ళడం జరిగింది. తన ఇంటివద్దే ఒక ప్రత్యేక భవనాన్ని నిర్మించుకుని అక్కడి నుంచే పాలన సాగిస్తున్నారు. ఇప్పటికే పక్కగా నిర్మితమైన సచివాలయ భవనాలను కూలగొట్టి అక్కడ బ్రహ్మండమైన భవన సముదాయ నిర్మాణానికి ఆయన పూనుకున్నారు! అది కూడా కరోనా సమయంలో రోజుకు వందలాది మంది గురయి, రాష్ట్ర ఆరోగ్య భద్రతా వ్యవస్థ పూర్తిగా చచ్చుబడిన సమయంలో ఆయనకు కొత్త సచివాలయ నిర్మాణం అత్యవసరం అనిపించింది. ఇప్పుడున్న సచివాలయంలో చాలా పక్కా భవనాలు, నాలుగైదేళ్ల క్రితమే కోట్లాది రూపాయల ప్రజాధనంతో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన భవనాలు ఉన్నాయి. తన హయాంలో నిజాంలాగా ఏదో ఒక నిర్మాణాన్ని కట్టించి తన పేరును చరిత్రపుటల్లో ఎక్కించుకోవాలన్న తపనతో ఈ ఆధునిక నిజాం ఆ భవనాలన్నీ కూలగొట్టారు. పనిలో పనిగా అక్కడే ఉన్న దేవాలయాన్నీ, మసీదునూ కూడా కూల ద్రోశారు. మరో వైపు చరిత్రాత్మకమైన ఉస్మానియా ఆసుపత్రి శిథిలమై కుప్పకూలిపోతున్నా అది కేసీఆర్ కంటపడలేదు. కోవిద్ బాధితులంతా గాంధీ ఆసుపత్రికే వెళ్లాలని నిన్నమొన్నటి వరకూ శాసించిన ఈ నయా నవాబు ప్రజలకోసం ఎలాంటి వైద్య వసతులూ కల్పించలేదు.


కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రజా ద్రోహాల పుణ్యమా అని తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో అప్పనంగా అధికారాన్ని కబళించిన కె.చంద్రశేఖర్ రావు ఏనాడూ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టలేదు. లక్షల కోట్ల అప్పు, అరాచక పాలన, వదరుబోతుదనం మూలంగా దేశ రాజధానిలో తెలంగాణ అంటే నవ్వుల పాలయ్యేలా చేశారు. నిజాం వ్యతిరేక పోరాటం జరిపిన ప్రజలను అణిచివేసేందుకు ప్రయత్నించిన దొర లాగా, నియంతలాగా ఆయన గడీలో కూర్చుని తన మనసుకు ఏది తోచితే అదే విధంగా పాలన సాగించారు కాని ప్రజాస్వామ్యం, పారదర్శకత, జవాబు దారీ విధానం అనే పదాలకు ఆయన నిఘంటువులో చోటు లేదు. తానే ప్రాజెక్టులు రూపకల్పన చేసి, తానే డిజైన్ చేసి తన ఇష్టం వచ్చినట్లు కట్టించి, ఎవరికీ లెక్కలు చెప్పకుండా, డీపీఆర్‌లు కూడా తొక్కి పెట్టి వేల కోట్ల రూపాయలు కబళించిన కేసిఆర్ పాలనలో మనకు విచ్చలవిడిగా దౌర్జన్యం, అవినీతి, అధికార దుర్వినియోగం తప్ప మరేవీ కనిపించవు. ప్రశ్నించిన వాడిని తొక్కి పెట్టి, నిరసన తెలిపిన వారిని తరిమిగొట్టి, పోలీసులను, అధికార యంత్రాంగాన్నీ తన చెప్పు చేతల్లో పెట్టుకుని, లంపెన్ శక్తులను ప్రోత్సహించిన కేసిఆర్ అసమర్థ పాలన ఏ విధంగా ఉన్నదో ఇవాళ కరోనా సమయంలో ప్రస్ఫుటంగా బయటపడింది. దేశ వ్యాప్తంగా సగటున 7.2 శాతం పాజిటివ్ కేసులు నమోదైతే, తెలంగాణలో 21 శాతం నమోదయ్యాయి. జనం పిట్టల్లా రాలిపోతున్నా కాకిలెక్కలతో కేవలం 15వేల కేసులే అని చెప్పడం కనీసం 2 వేల పరీక్షలు కూడా చేయలేకపోవడంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా హెచ్చరించాల్సి వచ్చింది. పలు సార్లు కేంద్ర బృందాల్ని పంపాల్సి వచ్చింది, వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు ఏ ఒక్కరినీ కరోనా వదల్లేదు. ఆఖరుకు ప్రగతి భవన్‌లో కరోనా ప్రవేశిస్తే కేసిఆర్ ఫామ్ హౌజ్‌కు పలాయనం చిత్తగించాల్సి వచ్చింది. ప్రజలు వైద్య వసతులు లభించక గిలగిలలాడుతుంటే కేసిఆర్ తన స్వంత ఆరోగ్యం కాపాడుకునేందుకు ప్రాధాన్యత నిచ్చారు.


కేసిఆర్ యజ్ఞాలు, యాగాలూ చేస్తూ ఉండవచ్చు. కాని అది ఆయన వ్యక్తిగత ప్రయోజనాలకోసం, మెజారిటీ ప్రజలను నమ్మించడం కోసం మాత్రమే. కాని అధికారం వరకు వచ్చే సరికి ఆయన ఒవైసీ వంటి మతతత్వ శక్తులతో మిలాఖత్ అయి, సంఘ వ్యతిరేక శక్తులు ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నా కిమ్మనకుండా ఊరుకునే మతతత్వవాది. అందుకే పొరుగుదేశాల్లో ఉంటే ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించేందుకు పౌరసత్వ చట్టాన్ని తీసుకువస్తే ఎనిమిదవ నిజాం అయిన కెసీఆర్ బాహటంగా వ్యతిరేకించారు.


ఏ కుటుంబ రాజకీయాలనైతే భారతీయజనతా పార్టీ వ్యతిరేకిస్తూ ఈ దేశంలో పాతుకుపోయిన దుష్ట సంస్కృతిపై పోరాటం సాగిస్తోందో ఆ రాజకీయాలను, సంస్కృతిని కేసిఆర్ పెంచి పోషిస్తూ ఉన్నారు. కొన్ని దశాబ్దాలుగా దేశంలో అరాచక, అవినీతి భూయిష్ట పాలన చేస్తూ వారసత్వ రాజకీయాలను నడిపిన కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాల్లో ఏ విధంగా క్షీణించిపోయిందో తెలంగాణలో కూడా అదే విధంగా క్షీణించిపోయింది. కాంగ్రెస్ నేతలను చూస్తే ప్రజలకు అవినీతి, కుటుంబపాలన, ఆశ్రిత పక్షపాతం గుర్తుకు వస్తాయి. అధికారం కోసం ఎటువంటి నీచ కృత్యాలకైనా దిగజారే ఆయారాం గయారామ్‌లు గుర్తుకు వస్తారు. అందుకే తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించారు. కాని కాంగ్రెస్ స్థానంలో అధికారంలోకి వచ్చిన కెసీఆర్ ఏమి చేశారు? అదే సంస్కృతిని, అదే కుటుంబ పాలనను అదే రకమైన అవినీతి రాజకీయాలను ప్రవేశపెట్టారు. ఏ మార్పునైతే తెలంగాణ ప్రజలు ఆశించారో. ఆ మార్పు, ఆ సామాజిక తెలంగాణ కాగడా వేసి వెతికినా కనపడని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇవాళ కాంగ్రెస్ స్థానంలో తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయంగా కనపడుతోంది. అడుగడుగునా ఇవాళ బిజెపి కార్యకర్తలు కేసీఆర్ ప్రజావ్యతిరేక నిర్ణయాలను, ఆయన పాలనా తీరుతెన్నులను నిరసిస్తూ ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. తన పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో రాజుకుంటున్న వేడిని గమనించినందువల్లే కేసిఆర్ అణిచివేత చర్యలకు పాల్పడుతున్నారు. ప్రజాప్రతినిధులపై కూడా దాడులు చేయిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని, కేసిఆర్‌తో కుమ్మక్కై తమ స్వంత పార్టీని నిర్వీర్యం చేస్తుంటే బిజెపి నిరంతరం ప్రతిఘటిస్తూ ఒక శక్తిగా ఆవిర్భించేందుకు ప్రయత్నిస్తున్నది. గత లోక్ సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలుచుకున్న బిజెపి త్రిపురలో లాగా తెలంగాణను కూడా కైవశం చేసుకోవడం ఎంతో దూరంలో లేదు.


ఇందుకు ప్రధాన కారణం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిజాయితీ, అవినీతి రహిత, స్వచ్చమైన పాలన పట్ల దేశ వ్యాప్తంగా ప్రజల్లో ఆదరణ పెరగడం. ఒక వైపు నరేంద్రమోదీ నిత్యం ప్రజలతో ఏదో ఒక రూపంలో సంభాషిస్తూ, లద్దాఖ్ వంటి ప్రాంతాలకు వెళ్లి చైనాతో పోరాడిన సైనికులకు ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తూ ఆత్మ నిర్భర భారత్ ద్వారా ప్రజలకు మనో ధైర్యాన్ని కల్పిస్తూ ఉంటే కేసిఆర్ ఫామ్ హౌజ్‌కు పరిమితమయ్యారు. కరోనా పీడితులను పరామర్శించకుండా ఒక అప్రజాస్వామిక, అనారోగ్య వాతావరణం కల్పించడం ద్వారా ప్రజలు మనోధైర్యం కోల్పోయేలా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు మోదీ సారథ్యంలోని బిజెపి వైపు చూస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు.


వై. సత్యకుమార్

బిజెపి జాతీయ కార్యదర్శి

Updated Date - 2020-07-14T06:34:59+05:30 IST