సకలం బంద్‌

ABN , First Publish Date - 2021-05-06T08:15:02+05:30 IST

రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు బుధవారం నుంచి ప్రభుత్వం 18 గంటల(మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6 వరకు) కర్ఫ్యూను అమల్లోకి తెచ్చింది

సకలం బంద్‌

తొలిరోజు సంపూర్ణంగా 18 గంటల కర్ఫ్యూ

మధ్యాహ్నానికి గ్యారేజీలకు చేరిన బస్సులు

రోడ్డెక్కిన వాహనదారులకు కౌన్సెలింగ్‌, జరిమానా 

రాష్ట్ర సరిహద్దులూ మూసివేత

ఇతర రాష్ర్టాల వాహనాలు వెనక్కి..

జంగారెడ్డిగూడెంలో పెట్రోల్‌ బంకులూ మూత

హోటళ్లు లేక పేషెంట్ల బంధువులు కటకట

ఉదయం 5 గంటలకే మద్యంషాపుల వద్ద బారులు

11 గంటల వరకూ రోడ్లపై విపరీతమైన రద్దీ

తిరుమలలో దుకాణాలు మూయించిన పోలీసులు


మధ్యాహ్నం 12 గంటలకే దుకాణాలన్నీ మూతపడ్డాయి. బస్సులు కూడా మధ్యాహ్నానికి గ్యారేజీలకు చేరిపోయాయి. ఆటోలు, క్యాబ్‌లు సైతం మధ్యాహ్నం రోడ్లపైకి రాకపోవడంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. కర్ఫ్యూ అమల్లో భాగంగా రాష్ట్ర సరిహద్దులనూ మూసివేశారు. రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు తొలిరోజు అని పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించేయగా, కొన్ని చోట్ల జరిమానాలు విధించారు. టీస్టాళ్లు, టిఫిన్‌సెంటర్లు కూడా మూతపడటంతో కొవిడ్‌ రోగుల బంధువులు ఇబ్బందుల పాలయ్యారు. 


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు బుధవారం నుంచి ప్రభుత్వం 18 గంటల(మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6 వరకు) కర్ఫ్యూను అమల్లోకి తెచ్చింది. తొలిరోజు కర్ఫ్యూ సంపూర్ణంగా అమలైంది. ప్రభుత్వ కార్యాలయాలు, అత్యవసర సేవలు మినహా మిగిలిన సేవలన్నీ మధ్యాహ్నం 12 గంటల నుంచి నిలిచిపోయాయి. కొన్నిచోట్ల ఉదయం 11.30 గంటలకే దుకాణాలు మూసేసి ఇళ్ల బాట పట్టారు. మధ్యాహ్నం తరువాత వాహనదారులు కూడా రోడ్ల మీదకు రాలేదు. ఒకరిద్దరు వచ్చినా తొలిరోజు గనుక పోలీసులు హెచ్చరికలతో సరిపెట్టారు. కొన్నిచోట్ల కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు. దీంతో మధ్యాహ్నం నుంచి ఎక్కడా పెద్దగా జనసంచారం కనిపించలేదు. ఉదయం కూడా బస్సులను తగ్గించడంతో తప్పనిసరి ప్రయాణికులు ఇబ్బందికి గురయ్యారు. ఆటోలు, క్యాబ్‌లు కూడా 12 తరువాత రోడ్లపైకి రాలేదు. నగరాలు, పట్టణాల్లో ఉదయాన్నే రైతుబజార్లు, కిరాణా దుకాణాలకు జనం పెద్ద ఎత్తున తరలిరావడంతో గత పది రోజులతో పోల్చుకుంటే ఉదయం 11 గంటల వరకూ కాస్త ఎక్కువగానే రోడ్లపై రద్దీ కనిపించింది. మద్యం షాపుల ముందు ఉదయం 5 గంటల నుంచే మందుబాబులు బారులు తీరారు.


అయితే 12 తరువాత వారు కూడా రోడ్ల మీదకు రాలేదు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు డిపోల్లో బస్సులు లేక ప్రయాణికులు గంటల కొద్దీ పడిగాపులు పడ్డారు. పనులకోసం పట్టణాలకు వచ్చిన ఏజెన్సీ ప్రజలు, పల్లె ప్రజలు పట్టణాల్లోనే చిక్కుకుపోయారు. జంగారెడ్డిగూడెంలో పెట్రోలు బంకులు కూడా మూసేశారు. టీస్టాళ్లు, టిఫిన్‌ సెంటర్లు మూత పడడంతో కొవిడ్‌ బాధితుల బంధువులు, మిత్రులు ఆహారం దొరక్క ఇబ్బందులు పడ్డారు. భీమవరంలో రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు జరిమానాలు వేశారు. విశాఖపట్నంలో రోడ్లపైకి వచ్చిన వాహనాలను పోలీసులు ఆపి కారణాలు అడిగి తెలుసుకుని, గుర్తింపుకార్డులు, ధ్రువపత్రాలు పరిశీలించిన తర్వాత పంపించేశారు. కడప జిల్లాలో ఉదయం పూటా 300 బస్సులు మాత్రమే తిప్పడంతో ఆరీసీకి రాబడి రూ.19.75 లక్షలు మాత్రమే వచ్చింది. అంతకు ముందురోజు ఆదాయం రూ.కోటి వరకూ ఉంది. రాజంపేటలో వాహనదారులకు పోలీసులు జరిమానా విధించారు.  


తెలంగాణ నుంచి 12లోపే రావాలి..

తెలంగాణ నుంచి ఆంధ్రాకు వచ్చే ప్రయాణికులు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల్లోపే రావాలని గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ స్పష్టం చేశారు. మధ్యాహ్నం 12 తర్వాత రాకపోకలకు అనుమతులు ఉండవన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు చెక్‌పోస్టుల వద్ద కర్ఫ్యూ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నట్టు తెలిపారు. మెడికల్‌, ఇతర అత్యవసరంగా ప్రయాణం చేయాల్సిన వారు సరిహద్దులో తగిన ఆధారాలు చూపిస్తే వారికి వెసులుబాటు కల్పిస్తామన్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల చెక్‌పోస్టు వద్ద వాహనాల రాకపోకలను నిలిపివేశారు. కృష్ణాజిల్లా గరికపాడు వద్ద తెలంగాణ  నుంచి వాహనదారులను పోలీసులు వెనక్కు తిప్పి పంపారు. దీంతో మహిళలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నెల్లూరు జిల్లాలో ఎక్కడికక్కడ చెక్‌పాయింట్లు ఏర్పాటు చేసి బయట తిరుగుతున్న వారిని నిలువరించారు. చాలా వరకు పరిశ్రమలు యథావిధిగా నడిచాయి. తడ వద్ద రాష్ట్ర సరిహద్దును మూసివేసి తనిఖీలు నిర్వహించారు. నెల్లూరు నగరంలో కలెక్టర్‌ చక్రధర్‌బాబు, ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ రోడ్లపై తిరుగుతూ వాహనదారులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం వద్ద ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాలను పోలీసులు మూసివేశారు. ఎస్పీ అమిత్‌బర్దర్‌ డ్రోన్‌ కెమెరాల ద్వారా కర్ఫ్యూ అమలుతీరును పరిశీలించారు. 


ఇచ్ఛాపురంలోని పురుషోత్తపురం చెక్‌పోస్టు వద్ద ఒడిశా, పశ్చిమబెంగాల్‌ల లారీలు, ఆటోలు, బస్సులు, వ్యాన్‌లు రోడ్లపైనే ఉండిపోయాయి. అనంతపురం జిల్లాలో కర్ణాటక సరిహద్దు వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. కర్ణాటకకు వెళ్లే వాహనాలను ఆ రాష్ట్ర పోలీసులు నిలిపివేశారు. చిత్తూరు జిల్లాలో తడుకుపేట, చీకలబైలు, నంగిలి చెక్‌పోస్టుల వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గుడిపాల మండలంలో తమిళనాడు సరిహద్దుల్లో మాత్రం తనిఖీలు నిర్వహించలేదు. కానీ.. ప్రజారవాణా వాహనాలేవీ ఈ మార్గంలో కనిపించలేదు. కర్నూలు జిల్లాలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులను అలంపూర్‌ టోల్‌ప్లాజా వద్దే నిలిపివేశారు. దీంతో హైదరాబాద్‌ నుంచి వచ్చే వారు అక్కడే దిగి ఇళ్లకు చేరుకునేందుకు ఆటోలు, ఇతర వాహనాల కోసం ఎదురుచూశారు. కొందరు తమవారికి ఫోన్‌ చేసి ద్విచక్ర వాహనాలపై ఇళ్లకు చేరుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు నుంచి ఛత్తీ్‌సగఢ్‌, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలకు వెళ్లే రహదారులు నిర్మానుష్యంగా మారాయి. విజయనగరం జిల్లాలో రాష్ట్రం నుంచి ఒడిశాలోకి వెళుతున్న అత్యవసర వాహనాల డ్రైవర్లు, ఇతర సిబ్బందికి థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేసి విడిచిపెడుతున్నారు. కూనేరు, పి.కోనవలస, రామన్నవలస, నాతవలస రాజపులోవ జంక్షన్ల వద్ద చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. 


కూలీల అడ్డగింత..ఆందోళనలో మిర్చి రైతులు..

గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో మిరప పంట కోతలకు తెలంగాణలోని దామరచర్ల, మేళ్లచెరువు, హుజూర్‌నగర్‌ తదితర మండలాల నుంచి వస్తున్న కూలీలను పొందుగల చెక్‌పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మిరప కాయలు కోసేవారు లేక రైతులు ఇబ్బంది పడ్డారు. మరోవైపు ఆకాశం మేఘావృతమవడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. 


తిరుమలలో తగ్గిన భక్తులు

కర్ఫ్యూ నేసథ్యంలో తిరుమలలో భక్తుల సంఖ్య మరింత తగ్గింది. ఆలయ ప్రాంతంతోపాటు మాడవీధులు, కొబ్బరికాయలు సమర్పించే అఖిలాండం, కాటేజీలు, వైకుంఠం క్యూంప్లెక్స్‌ ప్రాంతాలు వెలవెలబోయాయి. పాపవినాశనానికి పూర్తిగా రవాణా సౌకర్యాన్ని రద్దు చేశారు. కర్ఫ్యూ అమలు తిరుమలలో ఎలా ఉంటుందో టీటీడీ కానీ, పోలీసులు కానీ స్పష్టత ఇవ్వకపోవడంతో మధ్యాహ్నం 12 గంటలు దాటినా తిరుమలలో అన్ని దుకాణాలు, హోటళ్లు తెరుచుకొనే ఉన్నాయి. తర్వాత పోలీసులు అన్ని దుకాణాల వద్దకు వెళ్లి మూసివేయించారు. హోటళ్లు కూడా మూతపడటంతో భక్తులు, భవన నిర్మాణ కార్మికులు, దుకాణాల్లో పనిచేసే సిబ్బంది ఇబ్బంది పడ్డారు. కొందరు టీటీడీ అన్నదాన భవనానికి చేరుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌లోనూ భక్తులు పడిగాపులు పడ్డారు.

Updated Date - 2021-05-06T08:15:02+05:30 IST