తొలిరోజు విజయవంతం

ABN , First Publish Date - 2021-01-17T08:36:29+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ టీకా తొలిరోజు విజయవంతమైందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు తెలిపారు.. శనివారం 4200 మందికి టీకా వేయాలని

తొలిరోజు విజయవంతం

4,200 మందికిగాను 3,962 మందికి టీకా..

లక్ష్యంలో 94%.. వీరిలో 20మందికే చిన్నపాటి సమస్యలు

నొప్పి, జ్వరం, దద్దుర్లు, ఎర్రగా మారడం వంటివే

తీవ్రమైన అనారోగ్య సమస్యలేమీ లేవు

తీసుకున్నవారు 2 రోజులు మద్యం తాగొద్దు

సోమవారం నుంచి కేంద్రాల సంఖ్య పెంపు

టీకా కోసం అంతా ముందుకు రావాలి

వ్యాక్సిన్‌ తీసుకున్నాక ఆత్మవిశ్వాసం పెరిగింది

డీహెచ్‌ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి


హైదరాబాద్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌ టీకా తొలిరోజు విజయవంతమైందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు తెలిపారు.. శనివారం 4200 మందికి టీకా వేయాలని నిర్దేశించుకున్న లక్ష్యానికిగాను మధ్యాహ్నం మూడుగంటల వరకు 3,962 మందికి (94శాతం) టీకా వేశామని, ఎవ్వరిలోనూ తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురు కాలేదని తెలిపారు. శనివారం కోఠీలోని డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ కార్యాలయంలో డీఎంఈ డాక్టర్‌ రమేశ్‌రెడ్డితో కలసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. టీకా వేయించుకున్న 3,962 మందిలో 20మందికి మాత్రం నొప్పి, దద్దుర్లు రావడం, ఎర్రగా మారడం, జ్వరం వంటి చిన్న సమస్యలు వచ్చాయని వెల్లడించారు. వాస్తవానికి ఇవి రియాక్షన్స్‌ కూడా కావన్నారు. గాంధీలో తొలిటీకా పారిశుద్ధ్య కార్మికురాలు కృష్ణమ్మ, నార్సింగ్‌లో జయమ్మ అనే మహిళ తీసుకున్నారని వెల్లడించారు. తొలి రోజు టీకా తీసుకున్నవారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తామని, వారి వివరాలు సాప్ట్‌వేర్‌లో ఉన్నాయని  తెలిపారు. వారికి ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తే 104కు కాల్‌ చేయాలని సూచించారు. సోమవారం నుంచి టీకా ఇచ్చే కేంద్రాల సంఖ్యతో పాటు తీసుకునే వారి సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించారు. 28 రోజుల తర్వాత అదే కేంద్రంలో రెండో డోసు ఇస్తామని తెలిపారు.


టీకా తీసుకున్నవారు రెండు రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని, ఆల్కహాలు లాంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. కాగా కొన్ని కేంద్రాల్లో కొందరు భయపడి టీకాలు తీసుకునేందుకు ముందుకు రాలేదని, అలాంటి ఒకటి రెండు కేంద్రాల్లోనే జరిగాయని, టీకా తీసుకోనివారికి బదులుగా లబ్ధిదారుల జాబితాలో ఉన్న మరికొందరికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు తెలిపారు. సాధారణ ప్రజలకు కొవిన్‌ సాప్ట్‌వేర్‌లో రిజిష్ట్రేషన్‌ ఎప్పుడనేది రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని  వెల్లడించారు. టీకా తొలి రోజు విజయవంతం అవడానికి కృషి చేసిన వారందరితో పాట టీకా కార్యక్రమంలో భాగస్వామ్యులైన ప్రజాప్రతినిధులందరికీ   ధన్యవాదాలు తెలిపారు. 


టీకాతో ఆత్మవిశ్వాసం పెరిగింది

వైద్య సిబ్బందిలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు గాంధీ ఆస్పత్రిలో తాను మొదటి రోజు టీకా తీసుకున్నానని, వ్యాక్సిన్‌ తీసుకున్నాక తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని డీఎంఈ వెల్లడించారు. గాంధీలో టీకా తీసుకున్న వారిలో ఎవరికి అనారోగ్య సమస్యలు రాలేదన్నారు. వ్యాక్సిన్‌తో చిన్నపాటి సమస్యలు వస్తాయే తప్ప తీవ్రమైన అనారోగ్య సమస్యలేవీ తలెత్తవన్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ చాలా సురక్షితమని, ఎటువంటి సంకోచం లేకుండా  అంతా టీకాలు తీసుకునేందుకు ముందుకురావాలని విజ్ఞప్తి చేశారు. తనకు టీకా తీసుకున్న తర్వాత చిన్నపాటి సమస్య కూడా రాలేదన్నారు. 

Updated Date - 2021-01-17T08:36:29+05:30 IST