తొలిరోజు ఆసీస్‌దే

ABN , First Publish Date - 2021-01-08T10:01:39+05:30 IST

మెల్‌బోర్న్‌ మ్యాచ్‌ ఓటమికి బదులు తీర్చుకోవాలనుకుంటున్న ఆస్ట్రేలియా మూడో టెస్టును దీటుగా ఆరంభించింది. అరంగేట్ర ఓపెనర్‌ పకోవ్‌స్కీతో పాటు లబుషేన్‌ అర్ధసెంచరీ సాధించగా..

తొలిరోజు ఆసీస్‌దే

నేడు మ్యాచ్‌ ఉ. 4.30 నుంచే..

మొదటి ఇన్నింగ్స్‌ 166/2

లబుషేన్‌, పకోవ్‌స్కీ అర్ధసెంచరీలు

చెమటోడ్చిన భారత బౌలర్లు


మెల్‌బోర్న్‌ మ్యాచ్‌ ఓటమికి బదులు తీర్చుకోవాలనుకుంటున్న ఆస్ట్రేలియా మూడో టెస్టును దీటుగా ఆరంభించింది. అరంగేట్ర ఓపెనర్‌ పకోవ్‌స్కీతో పాటు లబుషేన్‌ అర్ధసెంచరీ సాధించగా.. స్టీవ్‌ స్మిత్‌ ఎట్టకేలకు గాడిలో పడ్డాడు. దీనికి తోడు భారత ఫీల్డింగ్‌ వైఫల్యం కూడా వారికి తోడయింది. దాదాపు నాలుగు గంటలపాటు వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు వికెట్ల కోసం చెమటోడ్చాల్సి వచ్చింది. ఇక రెండో రోజు కూడా పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండడం.. అటు స్మిత్‌ ఫామ్‌లోకి రావడం భారత్‌ను ఆందోళనపరిచే విషయం. 


సిడ్నీ: టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మరోవైపు ఊహించినట్టుగానే తొలి రోజు ఆటకు వరుణుడు అంతరాయం కలిగించడంతో 55 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. అయితే ఆఖర్లో మ్యాచ్‌ను అర్ధగంట పొడిగించారు. ఇక భారత బౌలింగ్‌లో బుమ్రా ఆసీ్‌సను కట్టడి చేసినా మిగతా బౌలర్లు కాస్త లయ తప్పారు. మార్నస్‌ లబుషేన్‌ (149 బంతుల్లో 8 ఫోర్లతో 67 బ్యాటింగ్‌)తో పాటు కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న ఓపెనర్‌ విల్‌ పకోవ్‌స్కీ (110 బంతుల్లో 4 ఫోర్లతో 62) అర్ధసెంచరీతో రాణించాడు. ఫలితంగా గురువారం ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లకు 166 పరుగులు చేసింది. వరుసగా విఫలమవుతున్న స్టీవ్‌ స్మిత్‌ (64 బంతుల్లో 5 ఫోర్లతో 31 బ్యాటింగ్‌) ఫామ్‌ అందుకోవడం భారత్‌ను ఇబ్బందిపెట్టే విషయం. సిరాజ్‌, సైనీలకు చెరో వికెట్‌ దక్కింది.


తొలి సెషన్‌లో 7.1 ఓవర్లే..: టాస్‌ గెలిచిన ఆసీస్‌ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్‌ నిర్ణీత సమయానికన్నా ఆలస్యంగా ప్రారంభమైంది. అయినా 7.1 ఓవర్ల తర్వాత మరోసారి భారీ వర్షం కురవడంతో ఆటగాళ్లంతా పెవిలియన్‌కు చేరారు. ఏమాత్రం తెరిపినివ్వకపోవడంతో అరగంట ముందుగానే లంచ్‌ బ్రేక్‌ తీసుకున్నారు. అయితే అప్పటికే ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (5) వికెట్‌ను ఆసీస్‌ కోల్పోయింది. సిరాజ్‌ ఓవర్‌లో ఆఫ్‌ స్టంప్‌నకు ఆవలిగా వెళుతున్న బంతిని వేటాడి స్లిప్‌లో పుజారకు చిక్కాడు. మరోవైపు పకోవ్‌స్కీ మాత్రం డిఫెన్సివ్‌ ఆటతో వికెట్‌ను కాపాడుకుంటూ క్రీజులో నిలిచాడు.


శతక భాగస్వామ్యం: తొలి వికెట్‌ ఆరంభంలోనే కోల్పోయినప్పటికీ పకోవ్‌స్కీ-లబుషేన్‌ జోడీ అదరగొట్టింది. రెండో సెషన్‌లో భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వీరు పూర్తి ఆధిపత్యం కనబరిచారు. 29వ ఓవర్‌లో పకోవ్‌స్కీ రనౌట్‌ ప్రమాదం నుంచి తప్పించుకోగా 31వ ఓవర్‌లో రెండు ఫోర్లతో తొలి అర్ధసెంచరీ సాధించాడు. అటు లబుషేన్‌ కూడా తనదైన శైలిలో బంతులను ఎదుర్కోవడంతో మరో వికెట్‌ కోల్పోకుండానే టీ విరామానికి వెళ్లారు. ఆ తర్వాత చివరి సెషన్‌ ఆరంభమైన కాసేపటికే పకోవ్‌స్కీ జోరు ముగిసింది. రెండో వికెట్‌కు సరిగ్గా వంద పరుగుల భాగస్వామ్యం అందించాక సైనీ 35వ ఓవర్‌లో పకోవ్‌స్కీని ఎల్బీ చేశాడు. టెస్టుల్లో సైనీకి ఇదే తొలి వికెట్‌ కావడం విశేషం. ఇక తీవ్ర ఒత్తిడిలో బరిలోకి దిగిన స్మిత్‌ ఈసారి ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. ఆరంభంలో కుదురుకునేందుకు సమయం తీసుకున్నా ఆ తర్వాత ధాటిని కనబరిచాడు. పిచ్‌ కూడా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుండడంతో బౌండరీలతో కదం తొక్కాడు. ముఖ్యంగా అశ్విన్‌ బౌలింగ్‌ను జాగ్రత్తగా ఎదుర్కొంటూ వికెట్‌ కాపాడుకున్నాడు. అటు లబుషేన్‌ కూడా ధాటిని కనబరుస్తూ అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఈ జోడీ ఆటతీరుతో ఇప్పటికే మూడో వికెట్‌కు అజేయంగా 60 పరుగులు నమోదయ్యాయి.


స్కోరుబోర్డు

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: పకోవ్‌స్కీ (ఎల్బీ) సైనీ 62; వార్నర్‌ (సి) పుజార (బి) సిరాజ్‌ 5; లబుషేన్‌ (బ్యాటింగ్‌) 67; స్మిత్‌ (బ్యాటింగ్‌) 31; ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: 55 ఓవర్లలో 166/2. వికెట్ల పతనం: 1-6, 2-106. బౌలింగ్‌: బుమ్రా 14-3-30-0; సిరాజ్‌ 14-3-46-1; అశ్విన్‌ 17-1-56-0; సైనీ 7-0-32-1; జడేజా 3-2-2-0.


నాన్న గుర్తొచ్చాడు..

మ్యాచ్‌కు ముందు జాతీయ గీతాలాపనలో పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టాడు. 26 ఏళ్ల ఈ హైదరాబాదీకి ఇది రెండో టెస్టు కాగా మ్యాచ్‌ ఆరంభానికి ముందు తండ్రి గుర్తుకు రావడంతో కన్నీటిపర్యంతమయ్యాడు. ‘ఆ సమయంలో నాకు మా నాన్న గుర్తుకువచ్చాడు. భారత జట్టు తరఫున ఆడుతూ దేశం గర్వించే స్థాయిలో ఉండాలని ఆయన కోరేవాడు. ఇప్పుడు నా రెండో టెస్టును పైనుంచి మా నాన్న చూస్తున్నాడనుకుంటున్నా’ అని మ్యాచ్‌ ముగిశాక సిరాజ్‌ తెలిపాడు. ఆటో డ్రైవర్‌గా జీవనాన్ని కొనసాగించిన సిరాజ్‌ తండ్రి మహ్మద్‌ గౌస్‌ నవంబరులో కన్నుమూశాడు.


క్యాచింగ్‌ ఘోరం : పాంటింగ్‌

కీపర్‌గా పంత్‌ సత్తాపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అనుమానం వ్యక్తంజేశాడు. ‘రిషభ్‌ కీపింగ్‌పైనే అందరి దృష్టి ఉంటుందని నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నా. టెస్ట్‌ల్లో అరంగేట్రం నుంచి ప్రపంచంలో ఏ కీపర్‌ వదలనన్ని క్యాచ్‌లు చేజార్చాడు’ అని పాంటింగ్‌ విమర్శించాడు. 



పంత్‌.. అదే తీరు

భారత వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ తన పేలవ ఫీల్డింగ్‌తో మరోసారి విమర్శల పాలయ్యాడు. తొలి మ్యాచ్‌లోనే అర్ధసెంచరీతో ఆకట్టుకున్న ఓపెనర్‌ విల్‌ పకోవ్‌స్కీ ఇచ్చిన క్యాచ్‌ను అతడు రెండుసార్లు వదిలేయడం ఆసీస్‌ ఆధిక్యానికి కారణమైంది. ముందుగా అశ్విన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 22వ ఓవర్‌ చివరి బంతిని పకోవ్‌స్కీ ఆఫ్‌సైడ్‌ ఆడాలని చూశాడు. అయితే బంతి బ్యాట్‌ అంచుకు తగిలి గాల్లోకి లేచినా పంత్‌ సరిగ్గా స్పందించపోవడంతో గ్లోవ్స్‌కు తాకి నేలపాలైంది. ఇక కొద్దిసేపటికే ఇన్నింగ్స్‌ 25వ ఓవర్‌ చివరి బంతిని సిరాజ్‌ షార్ట్‌ పిచ్‌లో వేయగా పకోవ్‌స్కీ లెగ్‌ సైడ్‌లో ఆడాడు. కాస్త వెనక్కి వెళ్లి ఎడమవైపు డైవ్‌ చేసిన పంత్‌ చివరికి బంతిని సరిగ్గా అందుకోలేకపోయాడు. రివ్యూలో బంతి నేలకు తాకినట్టు తేలడంతో పకోవ్‌స్కీకి మరో లైఫ్‌ దొరికి ఏకంగా అర్ధసెంచరీ బాదేశాడు. అటు సోషల్‌ మీడియాలోనూ పంత్‌ కీపింగ్‌ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2021-01-08T10:01:39+05:30 IST