కొలువులకు కొదవ లేదు!

ABN , First Publish Date - 2021-01-01T06:12:30+05:30 IST

పోటీపరీక్షల నిర్వహణ, ఉద్యోగాల అందజేత విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. ఆయా నాయకులు లేదా...

కొలువులకు కొదవ లేదు!

యూపిఎస్సీ అభ్యర్థులు రాష్ట్రాలకు సంబంధించిన నోటిఫికేషన్లు పట్టించుకోకుండా కేవలం యుపిఎస్సీ మీదనే శ్రద్ధపెట్టడం మంచిది. ఎందుకంటే యూపీఎస్సీకి క్రమం తప్పక పాటించే పరీక్ష నిర్వహణ కేలండర్‌ ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న పరీక్షలు పేపర్‌ లీకేజీ, నిరంతర వాయిదాలు, లీగల్‌ సమస్యలతో సతమతమవుతూ అయిదేళ్లకోసారి కూడా భర్తీలు జరపక సాగిలబడుతున్నాయి.


పోటీపరీక్షల నిర్వహణ, ఉద్యోగాల అందజేత విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. ఆయా నాయకులు లేదా అధికారులు పదవులను అలంకరించిన సందర్భాల్లో చూపించే ఆసక్తి, శ్రద్ధ, ఉత్సుకత కొత్త ఉద్యోగాల సృష్టిలోనూ, ఉన్న ఉద్యోగాల భర్తీలోనూ ఏమాత్రం లేదు. యూపిఎస్సీ అభ్యర్థులు రాష్ట్రాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం యుపిఎస్సీ మీదనే శ్రద్ధపెట్టడం మంచిది. ఎందుకంటే యూపీఎస్సీ క్రమం తప్పక పాటించే పరీక్ష నిర్వహణ కేలండర్‌ ఉన్నది. 1854లో మెకాలే ప్రారంభించిన సివిల్‌ సర్వీసు పరీక్షల నిర్వహణ కేలండర్ 2020 వరకూ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరాఘాటంగా కొనసాగుతున్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న పరీక్షలు పేపర్‌ లీకేజీ, నిరంతర వాయిదాలు, లీగల్‌ సమస్యలతో సతమతమవుతూ అయిదేళ్లకోసారి కూడా భర్తీలు జరగక సాగిలబడుతున్నాయి. అందువలనే పరీక్షార్థులు/ఉద్యోగార్థులు కేవలం యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవడం ఉత్తమం. 


రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల పరీక్షల నిర్వహణకు ఒక కేలండర్‌ అంటూ లేకపోవటం, ఉన్నా కట్టుదిట్టంగా అమలు కాకపోవటం లాంటి సమస్యలే కాకుండా రానురానూ అవి కొంగ్రొత్త జాడ్యాలతో సతమతమవుతున్నాయి. ఏదైనా క్రీడల్లో పతకాలను సాధించిన వారికి డిప్యూటీ కలెక్టర్ల ఉద్యోగాలివ్వడం ఈ మధ్య రివాజుగా మారింది. ఉన్న ఒకటీ అరా డిప్యూటీ కలెక్టర్ల ఉద్యోగాలు ఇలా చేజారిపోతుండడంతో ఉద్యోగార్థులు నిరాశకు గురవుతున్నారు. ముఖ్యంగా యూపీఎస్సీ పరీక్షల్లో ఫెయిల్‌ అయి, అటెంప్ట్స్ అయిపోయి అదృష్టాన్ని పరీక్షించుకుందామని ఎదురుచూసే మెరిట్‌ అభ్యర్థులకు (ఉదాహరణకు యూపీఎస్సీ ఇంటర్వ్యూ అటెండ్‌ అయి సర్వీస్‌ రానివారు) ఈ విధానం అశనిపాతంగా మారింది. 


వచ్చిన చిక్కల్లా ఏమిటంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉద్యోగార్థులు ఉద్యోగాలంటే కేవలం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు ప్రకటించే ఉద్యోగాలు మాత్రమే అనే భ్రమతో ఉండటం. అనేకమంది ఉద్యోగ వయోపరిమితి దాటిపోతున్నా వస్తే ఈ ఉద్యోగాలే రావాలి లేదా బతుకే లేదు అనేలా వ్యవహరిస్తూ నిర్లిప్తంగా బతుకు వెళ్ళదీస్తున్నారు. దీనికి మూలకారణం ఆయా విద్యార్థులు/ఉద్యోగార్థులు విద్యనభ్యసించిన కాలేజీలు, విశ్వవిద్యాలయాలు వారికి సరైన రీతిలో కెరీర్‌ కౌన్సెలింగ్‌ ఇవ్వకపోవడం.


బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌, రైల్వేస్‌, స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ వంటివి ఇబ్బడి ముబ్బడిగా ఉద్యోగ ప్రకటనలు ఇస్తూ ఉంటాయి. ఈ ప్రకటనలు ఒక పద్ధతిలో రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి. ఇవి ఎలాంటి రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఉంటాయి. వీటికి ఎంపికైనవారు రెగ్యులర్‌ స్కేల్‌, అడ్వాన్స్‌మెంట్లు, ప్రమోషన్లతో కెరీర్‌ను, కుటుంబ జీవితాన్ని సంతృప్తికరంగా గడిపే అవకాశం ఉంది. ఈ మధ్యనంటే ఈ ఎన్‌పిఎ (నాన్ ఫెర్మార్మింగ్ అసెట్స్) గొడవలు బ్యాంకింగ్‌ రంగంలో ఉన్నవారికి ఊపిరి సలపనివ్వడం లేదు గానీ గతంలో విదేశాలకు బదిలీలతో, విదేశీ ప్రయాణాలకు ఎలవెన్స్‌లతో సంతోషంగా ఉండేవారు. ఇప్పటికీ బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌, రైల్వేస్‌ తదితర రంగాలలో పనిచేసేవారు గ్రూప్‌ వన్‌లోని డిప్యూటీ కలెక్టర్, డిఎస్‌పి, సిటీవో, ఆర్టీవో ఉద్యోగాలను మినహాయించి అన్ని గ్రూప్‌ సర్వీసుల కంటే ఉత్తమమైన కెరీర్‌ను పొందే అవకాశం ఉంది.


ఇక స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ గ్రాడ్యుయేట్‌ ఉద్యోగాలకు ఎంపిక అయినవారు తాము రిటైర్‌ అయ్యే సమయానికి యూపీఎస్సీ ద్వారా ఎంపికయిన సెంట్రల్‌ సర్వీసుల అధికారుల కంటే కేవలం రెండు లేదా మూడు మెట్లు మాత్రమే కింద ఉంటారు. ఇంకా చెప్పాలంటే ముఖ్యమైన ఫీల్డ్‌ పోస్టింగ్స్‌లో ఎక్కువ టెన్యూర్‌లో ఉండేది వీరే. ఎస్‌ఎస్‌సి క్లరికల్‌ స్టాఫ్‌ కూడా ఒత్తిళ్ళు లేకుండా సాఫీగా సజావుగా కెరీర్‌ను కొనసాగిస్తారు.


అదేవిధంగా రీసెర్చ్‌ స్కాలర్స్‌, రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ రంగంలో ఉండేవారు ఆ రంగాన్నే ఎంచుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఉత్తమం. ఏదో యూనివర్శిటీలో హాస్టల్‌ సీటు కోసం పిహెచ్‌.డి. చేస్తున్నాము అనుకునేవారు, థీసిస్‌లో దమ్ములేని వారు మాత్రం గ్రూప్‌ పరీక్షలను ఎంచుకోవడం ఉత్తమం. ఆర్‌అండ్‌డిలో దమ్ము ఉన్నవారు విదేశాల్లో ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో పోస్ట్‌ డాక్టరేట్‌ చేసి, టీచింగ్‌/ప్రొఫెసర్‌ స్థానాలు సంపాదించడానికి కృషిచేయాలి.


సైనిక రంగానికి సంబంధించిన ఉద్యోగాలకు మన ఉభయ రాష్ట్రాల విద్యార్థులు/ ఉద్యోగార్థులు అర్హులు కారు అన్నట్లుగా వ్యవహరించడం అత్యంత బాధాకరమైన విషయం. నాకున్న వ్యక్తిగత పరిజ్ఞానం మేరకు సైనిక దళాలలో అనగా పదాతి దళం, నావికా దళం, వాయు దళాలలో మన తెలుగు ప్రాతినిధ్యం చాలా తక్కువ. సైనికదళాలు కూడా విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. ఉపాధి, ఉద్యోగం అనే కాకుండా దేశ సేవ చేసినట్లు కూడా ఉంటుంది. ఈ ఉద్యోగాలలో మన తెలుగువారి ప్రాతినిధ్యం పెరిగేందుకుగాను సైనిక ర్యాలీలు, రిక్రూట్‌మెంట్లు ఒక్క సికింద్రాబాద్‌లోనే కాకుండా, జిల్లా, సబ్‌ డివిజనల్‌ స్థాయిలో కూడా జరగాలి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సైనిక స్కూల్స్‌ సంఖ్యను పెంచాలి. మన విద్యార్థులు/ఉద్యోగార్థులు సైతం మన ఊళ్ళోనే, మన జిల్లాలోనే ఉద్యోగం చేయాలి అనే మంకుపట్టు వీడాలి. అవకాశాలను వెదుక్కుంటూ ఎక్కడయినా వెళ్ళే విశాల దృక్పథాన్ని అలవరచుకోవాలి. అత్యంత క్లిష్టమైన సరిహద్దు రక్షణ విధులు రొటేషన్‌ బేసిస్‌లో రెండు మూడేళ్ళకొకసారి మాత్రమే వస్తుంది గానీ రోజూ ఆ కష్టం ఉండదు. విధుల్లో భాగంగా సుఖవంతమైన జీవితం కూడా ఉంటుంది. వివిధ భాషలు నేర్చుకునే అవకాశం కలుగుతోంది. అత్యంత ముఖ్యమైన విషయం ప్రభుత్వాలు మారినా, పార్టీలు మారినా నిరంతరం కొనసాగేది సైనిక దళాలు మాత్రమే. ఎందుకంటే అవి దేశ రక్షణ, సార్వభౌమత్వానికి సంబంధించిన ఉద్యోగాలు. ఇదే విధంగా- పారా మిలిటరీ ఉద్యోగాలు అంతర్గత భద్రతకు, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించిన ఉద్యోగాలు. వీటిల్లో అన్నీ కూడా ఇబ్బందికరమైనవి కావు. ఉదాహరణకు సిఐఎస్‌ఎఫ్‌ జవాన్లు పెద్ద పెద్ద ప్రభుత్వరంగ సంస్థల్లోనూ, విమానాశ్రయాల్లోనూ విధులు నిర్వహిస్తుంటారు. 


కొద్దిపాటి భాషానైపుణ్యం, వ్యక్తిత్వం, మంచి వ్యవహారశైలితో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగాలు సంపాదించడం సులువు. దీనికిగాను బెరుకు వదిలి తమదైన శైలిలో ఇంగ్లీషు మాట్లాడడం నేర్చుకోవాలి. కనీసం దేశ అధికార భాషయిన హిందీనైనా చక్కగా నేర్చుకోవాలి. ముఖ్యంగా నాలాంటివారు స్వయంగా అనుభవించిన కష్టం- స్కూళ్లలో సరైన హిందీ మాస్టర్‌ లేకపోవడం, తత్ఫలితంగా హిందీ మీద పట్టు సంపాదించలేకపోవడం. చాలామంది పాలకులు, అధికారులు ఈ విషయాన్ని చాలా చిన్న విషయంగా చూసి సరైన ప్రాధాన్యతను ఇవ్వరుగానీ ఇది చాలా కీలకమైన అంశం. విద్యార్థులను హిందీలో తగిన విధంగా సన్నద్ధం చేసిననాడు మన తెలుగు ఉద్యోగార్థులు కూడా కేవలం రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షల కోసమే చకోరపక్షిలా ఎదురుచూడకుండా దేశంలో జరిగే అన్ని పోటీ పరీక్షలను ఎదుర్కోగలుగుతారు. అన్ని రంగాల పరీక్షలకు సిద్ధమవుతారు. మన విద్యార్థులు సైతం కేవలం ఉభయ రాష్ట్రాల యూనివర్శిటీలనే నమ్ముకోకుండా వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళి అక్కడ ఉన్నత విద్యను అభ్యసించగలుగుతారు.

నేలపట్ల అశోక్‌బాబు

జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇన్‌కంటాక్స్‌

Updated Date - 2021-01-01T06:12:30+05:30 IST