తొలి ఫలితం 11 గంటల తర్వాతే!

ABN , First Publish Date - 2020-12-04T07:25:16+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ పీఠం ఎవరిది..? ఉద్రిక్తత తారస్థాయికి చేరిన మహా పోరులో అంతిమ విజయం వరించేది ఎవరిని..? ఉత్కంఠ

తొలి ఫలితం  11 గంటల తర్వాతే!

జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌ నేడే

ఉదయం 8 గంటలకు ప్రారంభం

ఒక్కో రౌండ్‌లో 14 వేల ఓట్ల లెక్కింపు

ఒక్కో రౌండ్‌కు గంట నుంచి గంటన్నర

మెజారిటీ వార్డుల్లో 2 రౌండ్లలోనే ఫలితం


ఎవరిది ఊపు? ఎవరిది నిట్టూర్పు? ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయి? బల్దియాపై జెండా పాతేదెవరు? ఈ ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. శుక్రవారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌ కోసం అంతా సిద్ధమైంది. ఉదయం 11 గంటల తర్వాత తొలి ఫలితం వెలువడనుంది. మెజారిటీ వార్డుల్లో  రెండు రౌండ్లలోనే ఫలితం రానుంది. 


హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌ పీఠం ఎవరిది..? ఉద్రిక్తత తారస్థాయికి చేరిన మహా పోరులో అంతిమ విజయం వరించేది ఎవరిని..? ఉత్కంఠ వీడే సమయం ఆసన్నమైంది! గ్రేటర్‌ హైద రాబాద్‌ ఎన్నికల్లో చివరిది, కీలకమైన ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఘట్టం శుక్రవారం జరగనుంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది.

11 గంటల తర్వాత మొదటి రౌండ్‌ ఫలితం వచ్చే అవకాశం ఉంది. సాయంత్రానికి పూర్తిస్థాయి ఫలితాలు వెలువడతాయని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ 1,926 పోస్టల్‌ బ్యాలెట్లు వచ్చాయి. కౌంటింగ్‌ వరకూ వచ్చిన వాటిని పరిగణనలోకి తీసుకుని, తొలుత పోస్టల్‌ బ్యాలెట్ల కౌంటింగ్‌ పూర్తి చేస్తారు. అనంతరం బ్యాలెట్‌ బాక్సులను తెరుస్తారు.


30 సర్కిళ్లలోని 30 ప్రదేశాల్లో లెక్కింపు కేంద్రాల కోసం 150 హాళ్లను సిద్ధం చేశారు. ప్రతి హాల్‌లోనూ 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌పై 1000 ఓట్ల లెక్కింపు వంతున ఒక రౌండ్‌లోనే 14 వేల ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. నగరంలోని మెజారిటీ డివిజన్లలో 28 వేలలోపు ఓట్లు పోలైన విషయం తెలిసిందే. దాంతో, రెండు రౌండ్లలోనే పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. అన్ని హాళ్లలో గరిష్ఠంగా మూడు రౌండ్‌లలోనే లెక్కింపు పూర్తి కానుంది. 11 వేల ఓట్లు పోలైన మెహిదీపట్నం ఫలితం ఒకే రౌండ్‌లోనే రానుంది.


ఇక, ఒక్కో రౌండ్‌ ఓట్ల లెక్కింపునకు గంట నుంచి గంటన్నర సమయం పట్టనుంది. లెక్కింపులో 8,152 మంది సిబ్బంది పాల్గొంటుండగా.. 31 మంది ప్రక్రియను పరిశీలిస్తారు. సీసీటీవీ కెమెరాలతో లెక్కింపును రికార్డు చేయనున్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద కూడా కరోనా కట్టడి చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి టేబుల్‌ వద్ద శానిటైజర్‌ అందుబాటులో ఉంటుంది. అధికారులు, ఏజెంట్‌లు విధిగా మాస్కు ధరించాలి.


Updated Date - 2020-12-04T07:25:16+05:30 IST